Chandrababu Letter : రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ఉద్యోగులపై ప్రభుత్వమే వేధింపులకు పాల్పడడం, తప్పుడు కేసులు నమోదు చేసి వేధించడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. కానిస్టేబుల్ ప్రకాష్‌న డిస్మిస్ చేసిన వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేయాలని చంద్రబాబు లేఖలో కోరారు. ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ విషయంలో పోలీసు అధికారులు, ప్రభుత్వం అనుసరించిన వైఖరి పూర్తి అక్రమంగా, అన్యాయంగా, దళిత ఉద్యోగులను వేధించే విధంగా ఉందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బకాయిల గురించి ప్రశ్నించారనే కానిస్టేబుల్ ప్రకాష్‌పై కేసులు
ఏ.ఆర్.కానిస్టేబుల్ ప్రకాష్ పోలీసు శాఖలో సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్‌లు (SLs), అదనపు సరెండర్ లీవ్(ASL)లను చెల్లించాలని కోరుతూ ప్లకార్డును ప్రదర్శించారని అదే నేరమైనట్లుగా సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. న్యాయంగా విడుదల కావాల్సిన బకాయిలపై ప్రజాస్వామ్యబద్దంగా ప్లకార్డు పట్టుకుని సమస్యను మీ దృష్టికి తీసుకొచ్చినందుకు సహృదయంతో అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించకపోగా... అక్రమ కేసులు పెట్టి ప్రకాష్‌ను వేధించారని మండిపడ్డారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిల విడుదల కోరినందుకు... సంబంధం లేని కేసులో ఇరికించి సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు. బాధితురాలిగా చెప్పబడుతున్న మహిళ శ్రీలక్ష్మి మీడియా ముందుకు వచ్చి, ప్రకాష్‌పై నమోదు చేసినది తప్పుడు కేసు అని, ప్రకాష్ తనను వేధించలేదని పేర్కొన్నారు. పైగా స్పందన కార్యక్రమంలో తన ఫిర్యాదు విషయంలో ప్రకాష్ తనకు సహకారం అందించారని కూడా స్పష్టం చేశారు. తద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించారనే కారణంగానే ప్రకాష్ పై కక్షగట్టి విధుల నుంచి తొలగించారన్నది తేలిపోయిందన్నారు.
దళిత వర్గాలపై అణిచివేత
ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, అహంకారపూరితంగా వ్యవహరించి ప్రకాష్‌ను బాధితుడిని చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రశ్నించిన వారిని వేధించడం, హింసించడం, బెదిరించడం, భయపెట్టడం అనేది రాష్ట్రంలో సాధారణంగా మారిపోయిందన్నారు. . ముఖ్యంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ అణిచివేతలలో దళితులు, అణగారిన వర్గాలు బాధితులుగా మారుతున్నారన్నారు.
సీబీఐతో విచారణ చేయించాలి !
తనపై అక్రమ కేసుల విషయంలో ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ఫిర్యాదుతో అనంతపురం టూటౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ఫిర్యాదులో నిందితులుగా ఉన్న ముగ్గురు అధికారులు ప్రస్తుతం అదే జిల్లాలో కీలకమైన, ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. వారు అదే జిల్లాలో విధుల్లో ఉన్నా, సర్వీసులో ఉన్నా విచారణను తీవ్రంగా ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. ఈ కేసులో సమగ్ర విచారణ పూర్తయ్యే వరకు నిందితులుగా ఉన్న ముగ్గురు అధికారులను విఆర్ లో ఉంచాలి. ఐపీఎస్ స్థాయి అధికారులు ముద్దాయిలుగా ఉన్న ఈ కేసులో నిష్పాక్షికమైన దర్యాప్తు జరగాల్సి ఉంది. ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్‌ను డిస్మిస్ చేసేందుకు కుట్ర పన్నిన వ్యవహారంలో భాగస్వాములు ఎవరో తేల్చేందుకు జ్యుడీషియల్ విచారణ జరపాలి. అదే విధంగా ప్రకాష్ చేసిన ఫిర్యాదుపై అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుపై సీబీఐతో దర్యాప్తు జరపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.