చిన్నప్పుడు సిమెంట్ రోడ్ల మీద రబ్బర్ బాల్‌తో ఆడడం వల్లే.. ఇప్పుడు భారీ షాట్లు కొట్టడం సాధ్యమవుతుందని తన అభిప్రాయం అని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. హాంకాంగ్ తో మ్యాచ్ తో సూపర్ ఇన్నింగ్స్ తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు సూర్య. 22 బంతుల్లోనే అర్ధశతకం చేశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో 4 సిక్సర్లతో చెలరేగాడు. కోహ్లీతో కలిసి మూడో వికెట్ కు 7 ఓవర్లలోనే 98 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే తన భారీ షాట్ల వెనుక ఉన్న రహస్యాన్ని చెప్పాడు సూర్యకుమార్. 


అలాంటి షాట్లు తానేమీ ప్రాక్టీస్ చేయలేదని తెలిపాడు సూర్య. అయితే చిన్నప్పుడు సిమెంట్ రోడ్లపై రబ్బరు బంతితో ఆడడం వలనే అలాంటి షాట్లు ఆడగలుగుతున్నానేమో అని చెప్పాడు. హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ గురించి రోహిత్, పంత్ లతో మాట్లాడానని తెలిపాడు. ముందునుంచి దూకుడుగా ఆడాలనే నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. ఆ పిచ్ పై 170-175 పరుగులు చేయాలని.. అది చాలా మంచి స్కోరు అని అభిప్రాయపడ్డాడు. అయితే చివరకి 192 పరుగులు చేయడం ఆనందంగా ఉందన్నాడు. ఛేదనలో హాంకాంగ్ 152 పరుగులే చేసి ఓటమి పాలయ్యింది. ఈ విజయంతో భారత్ సూపర్-4 కి అర్హత సాధించింది. 


టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ తన తొలి వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. వేగంగా ఆడే క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ (21: 13 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (36: 39 బంతుల్లో, రెండు సిక్సర్లు), విరాట్ కోహ్లీ (59 నాటౌట్: ఒక ఫోర్, మూడు సిక్సర్లు) నింపాదిగా ఆడారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ అతి జాగ్రత్తతో ఆడటంతో స్కోరు బాగా నిదానించింది. 10 ఓవర్లకు జట్టు స్కోరు 70 పరుగులు మాత్రమే.


అదరగొట్టిన సూర్య


ఇన్నింగ్స్ 13వ ఓవర్లో రాహుల్ కూడా అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (68 నాటౌట్: 26 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కు ఏడు ఓవర్లలోనే 98 పరుగులు జోడించాడు. ముఖ్యంగా చివరి ఓవర్లో సూర్యకుమార్ హిట్టింగ్ నెక్స్ట్ లెవల్. నాలుగు సిక్సర్లు, రెండు పరుగులతో ఏకంగా 26 పరుగులు సాధించాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.