Prakasam Fire Accident: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల లోడ్ తో వెళ్తున్న లారీ ఒక్కసారిగా అగ్నిప్రమాదానికి గురైంది. లారీ ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. నిమిషాల్లోనే లారీకి మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో లారీలో ఉన్న సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలిపోయాయి. భారీ శబ్ధంతో సిలిండర్లు పేలడంతో స్థానికులు భయాందోళకు గురయ్యారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది.
అసలేం జరిగిందంటే..
కర్నూలు నుంచి ఉలవపాడుకు నిండు సిలిండర్ లోడ్‌తో లారీ వెళ్తోంది. అయితే మార్గం మధ్యలో ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పెద్దవాడ వద్ద ఆ లారీ ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గ్రహించి అప్రమత్తమైన లారీ డ్రైవర్ వాహనం నుంచి బయటకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు. కానీ నిమిషాల వ్యవధిలో మంటలు లారీ మొత్తానికి వ్యాపించడంతో.. అందులో ఉన్న వందల ఎల్పీజీ సిలిండర్లు భారీ శబ్ధంతో పేలిపోయాయి. లారీలో 300కు పైగా సిలిండర్లు ఉన్నట్లు సమాచారం.
స్తంభించిన రాకపోకలు..
మంటల ధాటికి గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఏం జరిగిందో అర్థంకాక స్థానికులు ఉలిక్కిపడ్డారు. రోడ్డుపైనే లారీ దగ్దం కాగా, అందులోని సిలిండర్లు పేలిపోవడంతో కిలోమీటర్ వరకు రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. సిలిండర్ల లారీ కర్నూలు నుంచి ఉలువపాడు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెప్పారు. అగ్ని ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సిలిండర్ల లోడ్‌తో వెళ్తున్న లారీకి విద్యుత్ వైర్లు తగలడంతోనే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు.
చిట్యాల వద్ద పేలిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్
Private Travels Bus Accident: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద పెను ప్రమాదం తప్పింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ ప్రమాదవశాత్తు పేలడంతో దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ట్రావెల్ బస్సులో సుమారు 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.