Breaking News Telugu Live Updates: కుప్పకూలిన భారత ఆర్మీ చీతా హెలికాప్టర్, ఒకరు మృతి
Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఓ పైలట్ ప్రాణాలు కోల్పోయారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
టిఆర్ఎస్ పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చారు. జాతీయ పార్టీగా మారుస్తూ ఏకగ్రీవ తీర్మానం. పార్టీ జనరల్ బాడీ ఆమోదం తెలిపింది. పార్టీ సర్వసభ్య సమావేశం చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని చదివి వినిపించారు సీఎం కేసీఆర్. పార్టీ పేరు మార్పు నిర్ణయంపై కీలక నిర్ణయంపై మధ్యాహ్నం 1.20 నిమిషాలకు సంతకం చేశారు.
హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
మాసబ్‌ట్యాంక్ నుంచి బంజారాహిల్స్ రోడ్డు నెం. 12 వైపు వెళ్లే వాహనాలను బంజారాహిల్స్ రోడ్డు నెం. 1, రోడ్డు నెం.10, జహీరానగర్, క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఎన్టీఆర్ భవన్ వైపు వెళ్లాలని సూచించారు.
ఎన్టీఆర్ భవన్, అపోలో హాస్పిటల్, ఫిలింనగర్, బంజారాహిల్స్ వైపు వచ్చే వారు జుబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి రోడ్డు బంజారాహిల్స్ రోడ్డు నెం.36, రోడ్డు నెం. 45 రూట్‌లలో వెళ్లాలని నగర ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
ఫిలింనగర్ నుంచి ఒరిస్సా ఐలాండ్‌కు వచ్చే వాహనాలు జుబ్లీహిల్స్ చెక్‌పోస్టు, ఎన్టీఆర్ భవన్, సాగర్ సొసైటీ, ఎస్‌ఎన్‌టీ, ఎన్‌ఎఫ్‌సీఎల్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లాల్సి ఉంటుంది
మాసబ్‌ట్యాంక్ నుంచి బంజారాహిల్స్ రోడ్డు నెం.12, జుబ్లీహిల్స్ వైపు వెళ్లే వాహనదారులు మెహిదీపట్నం, నానల్‌నగర్, టోలిచౌక్, ఫిలిం నగర్, జుబ్లీహిల్స్ వైపు వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలో పలుచోట్ల నేడు ట్రాఫిక్ ఆంక్షలున్నాయి. బంజారాహిల్స్ లోని తెలంగాణ భవన్‌తో పాటు, ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ మంగళవారం రాత్రి వెల్లడించారు. బుధవారం (అక్టోబర్ 5న) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు రంగనాథ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశానికి సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖ నేతలు హాజరు కానున్నారు.
నేడు తెలంగాణ పెద్ద పండుగ విజయదశమిని పురస్కరించుకుని నేతలు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సద్దుల బతుకమ్మ సంబరం ముగిశాక తెలంగాణలో దసరాకు అత్యంత ప్రాధాన్యత ఉంది. విజయాలను అందించే ఈ విజయదశమిని పురస్కరించుకుని తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలువురు నేతలు రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ధర్మ స్థాపనకు నిదర్శనంగా, విజయాలను అందించే విజయ దశమిగా దసరా పండుగను దేశ వ్యాప్తంగా జరుపుకుంటారు. దసరా రోజున శుభసూచకంగా పాలపిట్టను దర్శించి పవిత్రమైన జమ్మిచెట్టుకు పూజలు చేసే సంప్రదాయం గొప్పది. విజయానికి సంకేతమైన దసరా నాడు తలపెట్టిన కార్యాలన్నీ ఫలించాలని ప్రార్థిస్తూ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
Background
నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడనం ప్రభావం అధికంగా ఉంటుంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, యానాంలో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు తెలిపాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ సీజన్‌లో చివరిసారి వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కోస్తాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలో వేర్వేరుగా రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. రెండో ఆవర్తనం నేడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనంలో విలీనం అవుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. నేడు మోస్తరు వర్షాలు కురవనుండగా, రేపటి నుంచి రెండు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొట్టనున్నాయి.
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
రాష్ట్రంలో నేడు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అక్టోబర్ 6 నుంచి 8 వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. మంగళవారం సైతం పలు జిల్లాల్లో చిరు జల్లులు, మోస్తరు వర్షాలు కురిశాయి. గంటకు 8 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచననున్నాయి.
అక్టోబర్ 6 నుంచి పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలలో అక్కడ్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందటంతో ఈ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. హైదరాబాద్ ను మేఘాలు కమ్మేశాయి. రంగారెడ్డి జిల్లాతో పాటు జీహెచ్ఎంసీ, హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
అల్పపీడనం ఏపీపై మూడు, నాలుగు రోజులపాటు ప్రభావం చూపనుంది. నేటి నుంచి 3 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నగరం, అల్లూరిసీతామరాజు, పార్వతీపురం మణ్యం, అనకాపల్లి జిల్లాల్లో నేడు మోస్తరు వర్షాలు పడతాయి. దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తున్నాయి. కాకినాడ, కొనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. తీరంలో 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో నైరుతి, తూర్పు బంగాళాఖాతం దిశల నుంచి గాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లడం క్షేమదాయకం కాదని అధికారులు హెచ్చరించారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్రలో విజయదశమి మరుసటి రోజు నుంచి (అక్టోబర్ 6) తరువాత గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు జిల్లాలో వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం మరింత బలపడటంతో రేపటి నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. రాయలసీమలో పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడతాయి. కర్నూలు, నంద్యాల, కడప, చిత్తూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -