New Ration Cards Guidelines: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం బిగ్ అప్ డేట్ ఇచ్చింది. నూతన రేషన్ కార్డుల (New Ration Cards) మంజూరుకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి పౌర సరఫరాల శాఖ - ఆహార భద్రత కార్డులు జారీ కానున్నాయి. ఈ క్రమంలో సుదీర్ఘంగా అపరిష్కృతంగా ఉన్న వినతుల పరిష్కారం దిశంగా ప్రభుత్వం ముందడుగు వేసినట్లయింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులకు అనుగుణంగా జరగనుంది. దరఖాస్తులను నిశితంగా పరిశీలించిన అనంతరం కుల గణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం పంపిస్తారు.
వారే బాధ్యులు
కాగా, మండల స్థాయిలో ఎంపీడీవో, యూఎల్‌బీలో మున్సిపల్ కమిషన్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులుగా వ్యవహరిస్తారు. ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డుల్లో ప్రదర్శించి, చదివి వినిపించిన తర్వాత ఆమోదం లభించనుంది. ఆహార భద్రత కార్డుల్లో సభ్యుల చేర్పులు, మార్పులు జరగనున్నాయి. అర్హత కలిగిన కుటుంబాలకు ఈ నెల 26 నుంచి పౌర సరఫరాల శాఖ రేషన్ కార్డులు జారీ చేస్తుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.