Earthquake Strikes Japan: జపాన్‌లో (Japan) సోమవారం భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి పూట ఆ దేశ నైరుతి ప్రాంతంలో 6.9 తీవ్రతతో ప్రకంపనలు నమోదైనట్లు జపాన్ వాతావరణ విభాగం తెలిపింది. ఈ క్రమంలోనే భూకంప కేంద్రం నమోదైన మియాజాకితో పాటు కొచీ ప్రాంతాలకు సునామీ అలర్ట్‌ను అక్కడి అధికారులు జారీ చేశారు. నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. కాగా, గతేడాది ఆగస్ట్‌లోనూ జపాన్‌లో 2 భారీ భూకంపాలు సంభవించాయి. ఇటీవలే నేపాల్, టిబెట్ సరిహద్దులో సంభవించిన భూకంపం ధాటికి దాదాపు వందల మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా, సునామీ హెచ్చరికలతో అక్కడి ప్రజల్లో ఆందోళన నెలకొంది.
కాగా, గతేడాది ఆగస్టులో 6.9, 7.1 తీవ్రతతో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. నైరుతి దీవులైన క్యుషు, షికోకులను ఇవి కుదిపేశాయి. ఆ సమయంలో అనేక ప్రాంతాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అలాగే, గతేడాది జనవరి 1న సుజు, వాజిమా పరిసర ప్రాంతాల్లోనూ 7.6 తీవ్రతతో సంభవించి భారీ భూకంపంలో 300 మందికి పైగా మృతి చెందారు.