ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుంటున్నారు. కానీ ఇద్దరి మధ్య కొంత గ్యాప్ ఉంది. మరో అబ్బాయి .. అమ్మాయి పట్ల ఆకర్షణ పెంచుకున్నాడు. ప్రేమించడానికి సిద్ధమంటున్నాడు. కానీ అమ్మాయి ఎటూ తేల్చుకోలేకపోతోంది ? చివరికి ఏమవుతుంది ?.. ఇలాంటి కథలతో... క్యారెక్టరైజేషన్లను అటూ ఇటూ మార్చి పదుల సంఖ్యలో సినిమాలు వచ్చి ఉంటాయి. వాటిలో సక్సెస్ అయినవే ఎక్కువ. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఏపీ రాజకీయాల్లోనూ కనిపిస్తోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ప్రారంభమైంది.
జనసేనపై వన్‌సైడ్ లవ్ చూపిస్తున్న టీడీపీ !
జనసేనతో పొత్తు గురించి కుప్పంలో చంద్రబాబును ఓ కార్యకర్త ప్రశ్నించారు. మనది వన్ సైడ్ లవ్ అన్న అర్థంలో చంద్రబాబునాయుడు రిప్లై ఇచ్చారు. ఇది వైరల్ అయింది. నిజానికి చంద్రబాబునాయుడు ఎప్పుడూ జనసేనను వ్యతిరేకంగా ప్రకటించలేదు. గత ఎన్నికలకు ముందు .. అభ్యర్థుల్ని ప్రకటించే చివరి నిమిషంలోనూ పవ్ కల్యాణ్‌కు కలసి నడుద్దాం రమ్మని ఆఫర్ ఇచ్చారు. కానీ అంతకు ఏడాది ముందు నుంచే టీడీపీపై యుద్ధం ప్రకటించిన జనసేనాని.. తాను గెలవకపోయినా ఓడిస్తానని సవాల్ చేసి .. కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకుని పోటీ చేశారు. ఆయన గెలవలేదు కానీ ఆయన సవాల్ చేసినట్లుగా టీడీపీ ఓడిపోయింది. అయినప్పటికీ కొంత మంది టీడీపీ నేతలు పవన్‌పై విమర్శలు చేసినా వారందర్నీ చంద్రబాబు నిలువరించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ-జనసేన నేతలు స్థానికంగా కలసిపోయి పోటీ చేశారు. టీడీపీ - జనసేన స్థానిక నేతలు పొత్తులు పెట్టుకున్న చోట మంచి ఫలితాలు వచ్చాయి. ఇది రెండు పార్టీల నేతల్ని ఆలోచనలలో పడేసింది. ముఖ్యంగా చంద్రబాబును ఇంకా ఆలోచనలో పడేసినట్లుగా కనిపిస్తోంది. అందుకే జనసేనతో పొత్తుకు తాము సిద్ధమన్న సంకేతాలను ఆయన కుప్పం నుంచి పంపించారు.
Also Read: పవన్‌ను పదే పదే టార్గెట్ చేస్తున్న సోము వీర్రాజు ! బీజేపీ -జనసేన మధ్య దూరం పెరుగుతోందా ?
ఇప్పటికే బీజేపీతో పొత్తు ప్రేమలో ఉన్న జనసేన !
2019 ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత పవన్ కల్యాణ్ కమ్యూనిస్టులకు గుడ్ బై చెప్పి అనూహ్యంగా బీజేపీతో జత కట్టారు. కానీ రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీల మధ్య అంత గొప్పగా సన్నిహిత సంబంధాలు ఏర్పడలేదు. ఢిల్లీ స్థాయిలో బీజేపీ నేతలతో పవన్ కల్యాణ్ సన్నిహితంగా వ్యవహరిస్తున్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో ఎవరూ కలిసే పరిస్థితి లేదు. కలసి కట్టుగా నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. దీంతో జనసేన - బీజేపీ నేతలు ఎవరి దారి వారిదే అన్నట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓ సమన్వయ కమిటీని నియమించారు. కలిసి కార్యక్రమాలు చేపట్టాలని అనుకున్నారు. కానీ రెండు పార్టీల మధ్య సఖ్యత కుదరలేదు. ఫలితంగా నిర్ణయాలు ఏవీ కలిసి తీసుకోలేకపోతున్నారు. బద్వేలు ఉపఎన్నికల్లో ీ విషయం స్పష్టంగా కనిపించింది. తిరుపతి ఉపఎన్నికల్లో అభ్యర్థిత్వం విషయంలోనూ అదే రచ్చ జరగింది. ఇప్పటికైతే బీజేపీతో పొత్తు ఉందని జనసేన చెబుతోంది. జనసేన తమ మిత్రపక్షమని బీజేపీ చెబుతోంది. కానీ కలిసి పని చేస్తున్న సందర్భాలు మాత్రం చాలా తక్కువ. ఇటీవల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని పవన్ ఎత్తుకోవడం బీజేపీకి నచ్చలేదు. సోము వీర్రాజు పవన్‌పై విమర్శలు చేశారు.
Also Read: ప్రాణ త్యాగం అవసరంలేదు ప్లకార్డులు పట్టుకోండి చాలు... వైసీపీ ఎంపీలపై పవన్ విమర్శలు...
టీడీపీ - జనసేన ప్రేమ ఫలితాలను మారుస్తుందన్న అంచనాలు !
గత ఎన్నికల్లో టీడీపీకి కాస్త తక్కువగా నలభై శాతం ఓట్లు వచ్చాయి. జనసేనకు ఆరు శాతం ఓట్లు వచ్చాయి. అధికార వైఎస్ఆర్‌సీపీకి యాభై శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో ఓ వేవ్ కనిపించింది. అలాంటి వేవ్‌లోనూ వచ్చిన ఫలితాలు అవి. అదే టీడీపీ, జనసేన కలిసి ఉంటే చాలా చోట్ల ఫలితాలు తారుమారయ్యేవి.కానీ ఓవరాల్‌గా ఫలితం మారేది కాదు. అప్పుడు పరిస్థితులు వేరు . టీడీపీకి అధికార వ్యతిరేకత ఉంది. ఇప్పుడు కలిసి పోటీ చేస్తే వైసీపీపై అధికార వ్యతిరేకత తమకు కలిసి వచ్చే అవకాశం ఉందన్న అంచనా ఉంది. అందరూ విడివిడిగా పోటీ చేస్తే అధికార వ్యతిరేక ఓట్లు చీలిపోతాయి. బీజేపీకి ఒక్క శాతం ఓటు బ్యాంక్ మాత్రమే ఉంది. బీజేపీ కాకపోయినా జనసేన వస్తే గేమ్ ఛేంజర్ అని టీడీపీ నమ్మకంతో ఉంది. అందుకే జనసేనకు ప్రేమ లేఖలు రాస్తున్నారు.
Also Read: ఏపీలో బీజేపీ - జనసేన అనధికారిక కటీఫ్ ! బద్వేలు పోటీనే తేల్చేసిందా ?
క్లైమాక్స్ ఎలా ఉంటుంది ?
ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లవ్ స్టోరీ ప్రారంభమైందని అనుకోవాలి. క్రైమాక్స్‌లో జరిగే సీన్లను బట్టి ఫలితాలను అంచనా వేయవచ్చు. రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీకి అయినా అంతిమంగా ఒకటే లక్ష్యం .. అదే గెలుపు. జనసేన పార్టీ గత ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవడం వల్ల కనీస ప్రయోజనం పొందలేకపోయింది. ఇప్పుడు బీజేపీతో పొత్తులు పెట్టుకుంది. కానీ ఎంత మేర ప్రయోజనం పొంతుతుందో చెప్పడం కష్టం. అదే సమయంలో జనసేనతో పొత్తు వల్ల అటు కమ్యూనిస్టులు కానీ బీజేపీ కానీ గరిష్టంగా ప్రయోజనం పొందలేకపోయాయి. తిరుపతి, బద్వేలు ఉపఎన్నికల్లో అదే జరిగింది. ఏ పొత్తు పెట్టుకున్న ఫలితాలే కొలమానం. అందుకే టీడీపీతో జత కడితేనే జనసేనకు కాస్త బలం వస్తుందని .. ఈ సారి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వస్తుందని లేకపోతే.. మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయన్న అంచనా జనసేనలో ఉంది. కులాల రాజకీయాల్లో కొట్టు మిట్టాడుతున్న ఏపీలో పవన్ సపోర్ట్ ఉంటేనే అధికారంలోకి రాగలమని టీడీపీ కూడా భావిస్తోంది. అధికార వ్యతిరేకత తీవ్రంగా ఉందని భావిస్తున్న సమయంలో పవన్ కలిస్తే టెన్షన్ ఉండదని భావిస్తున్నారు. ఇప్పుడు క్లైమాక్స్‌లో పవన్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నదానిపై ఎన్నికల సినిమా ఫలితం ఆధారపడి ఉంటుందని అనుకోవచ్చు.
Also Read: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పోరాటం ఎవరి కోసం? పార్టీ కోసమా? సినీ పరిశ్రమ కోసమా?