"సినీ పరిశ్రమ బిడ్డగానే వచ్చాను. పెద్దగా కాదు. మీరు ఏదయినా చెబితే పరిగణనలోకి తీసుకుని విధివిధానాలను రూపొందిస్తామన్నారు. అనవసరంగా ఆందోళన వద్దు..ఎవరూ మాటలు జారవద్దు. నిర్మాణాత్మక నిర్ణయం వస్తుంది. నా మాటను మన్నించండి "  విజయవాడ ఎయిర్‌పోర్టు వద్ద చిరంజీవి ప్రత్యేకంగా చేసిన విన్నపం ఇది. సీఎం జగన్‌ను రాత్రికి రాత్రే లంచ్ మీటింగ్‌కు ఆహ్వానించడానికి వెనుక ఉన్న అసలు లక్ష్యం కూడా ఈ విన్నపమేనని విశ్లేషిస్తున్నారు. గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే నిజమని అనిపించకమానదు. 


Also Read: పది రోజుల్లో సమస్యకు పరిష్కారం - చిరంజీవికి సీఎం జగన్ హామీ !


నోరు విప్పుతున్న టాలీవుడ్ ప్రముఖులకు నోళ్లకు తాళం వేసే వ్యూహం !


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలపై టాలీవుడ్ నుంచి నిన్నామొన్నటి వరకూ ఎవరూ మాట్లాడలేదు. టాలీవుడ్‌పై కొంతకాలంగా వైఎస్ఆర్‌సీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దొంగ షోలు వేస్తారని.. టాక్స్‌లు ఎగ్గొడతారని.. రెమ్యూనరేషన్లు ఎందుకని ఇలా నానా మాటలన్నారు. చివరికి కోవూరు ఎమ్మెల్యే అయితే " బలిసి కొట్టుకుంటున్నారని" తేల్చేశారు. అప్పటి వరకూ ప్రభుత్వంతో వివాదం ఎందుకు.. అని సంయమనంతో ఉన్న టాలీవుడ్ ప్రముఖులకు.. చివరికి ఇక స్పందించకపోతే ఈ తిట్లు భరించరానంతగా మారిపోతాయన్న అంచనాకు వచ్చారు. ఒక్కొక్కరుగా బయటకు రావడం ప్రారంభించారు. మొదట ఫిలించాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్.. ఆ తర్వాత దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ... వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చి.. మొత్తంగా ఎవరి జాతకాలంటోతేల్చుకుందాం రమ్మని సవాల్ చేశారు. 


Also Read: ఏపీలో టికెట్ రేట్స్‌తో మాకు స‌మ‌స్య‌ లేదని ఎందుకు అన్నానంటే.. నాగార్జున వివరణ!


ఎవరూ మాట్లాడవద్దని భేటీ తర్వాత కోరిన చిరంజీవి !


ఇప్పటికే టాలీవుడ్ పై ఏపీ ప్రభుత్వం వేసిన దెబ్బలు చిన్న చిన్నవి కావు. చాలా నష్టపోయారు. నష్టానికి నష్టం.. గౌరవం కూడా లేకుండా పోతోందని.. తిరగబడకపోతే విలువ ఉండదన్న అభిప్రాయానికి టాలీవుడ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక కౌంటర్లు ఇవ్వాల్సిందే అనుకుని ప్రారంభించేశారు. ఈ విషయం అర్థమైపోయిన ఏపీలోని అధికార పార్టీ వెంటనే "చిరంజీవికి లంచ్" పేరుతో పాచిక విసినట్లుగా భావిస్తున్నారు. అనుకున్నట్లుగానే చిరంజీవి భేటీకి వచ్చారు. మాట్లాడారు. సీఎం సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించారు కాబట్టి ఎవరూ నోరెత్తవద్దని సలహా ఇచ్చారు. ప్రభుత‌్వం సినీ పరిశ్రమ సమస్యలపై సానుకూలంగా స్పందిస్తోంది కాబట్టి ఇలాంటి సమయంలో ఘాటు వ్యాఖ్యలు చేసి పరిస్థితిని దిగజార్చుకోవద్దన్న సందేశాన్ని చిరంజీవి పంపించారు. వైఎస్ఆర్‌సీపీ వాళ్లు ఎన్ని మాటలన్నా మనకు సమస్యల పరిష్కారం ముఖ్యం కాబట్టి ఆ దిశగా ప్రయత్నిద్దామనే మాటలు చిరంజీవి నుంచి వచ్చాయి. ఇప్పుడు  ఇండస్ట్రీ వైపు నుంచి ఎవరూ వైఎస్ఆర్‌సీపీ నేతల విమర్శలపై స్పందించే అవకాశం లేదు. ఖచ్చితంగా ఇదే ఎఫెక్ట్ కోసమే చిరంజీవిని ఆహ్వానించారని ప్రత్యేకంగా విశ్లేషించాల్సిన పని లేదు. 


Also Read: అక్కడ వినిపించుకునే నాథుడు ఉండాలి కదా..? టికెట్ రేట్ ఇష్యూపై బాలయ్య వ్యాఖ్యలు..


టాలీవుడ్‌పై అనుచితంగా మాట్లాడవద్దని వైఎస్ఆర్‌సీపీ నేతల్ని ఎవరూ కోరలేదుగా !?


టాలీవుడ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలకు ఎవరూ గీత దాటి విమర్శించవద్దని సలహాలు ఇవ్వలేదు. అసలు సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదని కోవూరు ఎమ్మెల్యే దగ్గర్నుంచి ఇండస్ట్రీతో అనుబంధం ఉన్న రోజా వరకూ అందరూ చేసిన కామెంట్లను పులిస్టాప్ పెట్టాలని ఇప్పటికీ ఎవరికీ చెప్పలేదు. వారు టాలీవుడ్‌పై.. హీరోలపై తమ విమర్శల దాడి చేస్తూనే ఉంటారు. కానీ టాలీవుడ్ వారు మాత్రం నోరు తెరవకూడదన్న పరిస్థితిని ఇప్పుడు కల్పించారు. ఎక్కువ మాట్లాడితే సమస్య జఠిలం అవుతుందన్న  ఓ భయం కూడా కల్పించగలిగారని భావించవచ్చు. 


Also Read: జాతకాలు తేల్చుకుందాం.. దమ్ముంటే ఓపెన్‌ డిబేట్‌కు రండి.. వైఎస్అర్‌సీపీ ఎమ్మెల్యేలకు తమ్మారెడ్డి సవాల్ !


చిరుతో లంచ్‌ భేటీతో  వైఎస్ఆర్‌సీపీ వ్యూహం సక్సెస్ !


సినిమా ఇండస్ట్రీ అంటే ఎంత మీడియా అటెన్షన్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తే అదో సెన్సేషన్ అవుతుంది. అలాంటివి రెండు రోజులుగా కనిపిస్తున్నాయి. ఇక కనిపించవు. దీని కోసమే.. గత ఏడాది ఆగస్టులోనే చిరంజీవికి ఇస్తామన్న అపాయింట్‌మెంట్.. ఆపి.. ఆపి ఇప్పుడు ఇచ్చారు. ఎందుకంటే రాజకీయాల్లో టైమింగ్ ముఖ్యం.  ఆ టైమింగ్ గురించి వైఎఎస్‌ఆర్‌సీపీ అధినేతకు బాగా తెలుసు. చిరంజీవి లంచ్ భేటీ తర్వాత టాలీవుడ్ నోటికి తాళం పడటంతోనే ఆ విషయం స్పష్టమవుతుంది. 


Also Read: బలిసికొట్టుకుంటోంది మీరే.. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేపై మండిపడిన నిర్మాత !


ఏపీలో సమస్యలు ప్రభుత్వం సృష్టించినవే..పరిష్కారమూ ప్రభుత్వం చేతుల్లోనే !


ఆంధ్రలో సినీ పరిశ్రమకు ఉన్న సమస్యలు ప్రభుత్వం సృష్టించినవే. కరోనా తర్వాత సాఫీగా సాగిపోవాల్సిన సినిమా ఇండస్ట్రీకి టిక్కెట్ రేట్లు తగ్గించడం ద్వారా.. ధియేటర్లను సీజ్ చేయడం ద్వారా.. ఆన్ లైన్ టిక్కెట్ల పోర్టల్ తెస్తామంటూ చట్టం చేయడం త్వారా సమస్యలు సృష్టించింది ప్రభుత్వమే. ఇప్పుడు వాటి పరిష్కారానికి కిందా మీదా పడుతోంది టాలీవుడ్. రేపు ఎంతో కొంత రిలీఫ్ ఇచ్చి.. గొప్ప సాయం చేశామని ప్రశంసలు అందుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ రాజకీయాన్ని ఎదుర్కొనేంత పాలిటిక్స్ టాలీవుడ్‌లో లేవు. అందుకే ఇప్పటికైతే టాలీవుడ్‌పై ఏపీ అధికార పార్టీదే పైచేయి. 


Also Read: సినిమా టిక్కెట్ రేట్ల కాన్సెప్ట్ బస్ టిక్కెట్లకు వర్తించదా !? ఏపీ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది ?




ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి