తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఇవాళ స్వర్ణరథోత్సవం వైభవంగా నిర్వహించారు. గురువారం ఉదయం గం.9 ల నుంచి 11 గంటల వరకు శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని తిరుమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు. టీటీడీ మహిళా ఉద్యోగులు రథాన్ని లాగారు. ఆలయ మాడ వీధుల్లో స్వర్ణరథంపై విహరించిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామిని గ్యాలరీల్లో పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. గోవింద నామస్మరణతో మాడ వీధులు మారుమోగాయి. కోవిడ్ వ్యాప్తి కారణంగా స్వర్ణరథాన్ని లాగే టీటీడీ మహిళా ఉద్యోగులకు ముందస్తుగా కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రేపు ఉదయం 4.30 నుంచి 5.30 గంటల నడుమ ఆలయంలో ఏర్పాటు చేసిన పుష్కరిణిలో సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవాన్ని టీటీడీ ఏకాంతంగా నిర్వహించనుంది.
Also Read: వెల్కం ఆచార్య.. చిరుకు జగన్ సాదర స్వాగతం !
వైభవంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల పాటు ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచాలని టీటీడీ నిర్ణయించింది. అయితే కరోనా నిబంధనల కారణంగా ముందస్తు దర్శన టికెట్లు ఉన్న వ్యక్తులను మాత్రమే దర్శనానికి అధికారులు అనుమతిస్తున్నారు. ఆన్లైన్లో వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను భక్తులు పొందారు. అలాగే తిరుపతిలో స్థానికుల కోసం 50 వేలు కరెంట్ బుకింగ్ ఉచిత దర్శనం టికెట్లు కేటాయించింది టీటీడీ. తెల్లవారు జామున రెండు గంటల నుంచే ప్రోటోకాల్ వీఐపీ దర్శనాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ముందస్తు టికెట్లు ఉన్న ఇతర భక్తులను దర్శనానికి అనుమతించారు. ఇక ఏకాదశి సందర్భంగా ఈరోజు స్వర్ణరథంపై శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు మాడ వీధుల్లో విహరించారు. రేపు ద్వాదశి సందర్భంగా పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించనున్నారు.
Also Read: తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందడి.. శ్రీవారి సేవలో పెద్దఎత్తున ప్రముఖులు
శ్రీశైలంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు
శ్రీశైల క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారికి ప్రత్యేక ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉత్తర ద్వార దర్శనానికి అనుమతిస్తున్నారు. ఉభయదేవాలయల ప్రాంగణంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని రావణవాహనంపై ఆశీనులను చేసి ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటలకే ఆలయ ద్వారాలు తెరచి మంగళవాయిద్యాలు, సుప్రభాతసేవ, ప్రాతఃకాలపూజ చేశారు. స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను ఉత్తరద్వార ముఖమండపం నుంచి వెలుపలకు తీసుకొచ్చి రావణవాహనంపై అధిష్ఠింపజేసి అర్చకస్వాములు ప్రత్యేక అర్చనలు, హారతి పూజలు నిర్వహించారు. అలానే భక్తులు దర్శించుకునేందుకు వీలుగా శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం ముఖమండపం వెలుపల (బలిపీఠం సమీపంలో) ఉంచారు. భక్తులు స్వామి అమ్మవారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటున్నారు.