ప్రజాసమస్యలపై పోరుబాట పట్టేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా రోజుల తర్వాత రోడ్లపైకి వస్తున్నారు. రెండున్నరేళ్ల నుంచి రోడ్ల విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేయడంతో ఎక్కడివక్కడ పాడైపోయాయి. ఎన్ని సార్లు చెప్పినా ప్రభుత్వం బాగు చేయకపోతూండటంతో  శ్రమదానం ద్వారా బాగు చేయాలని నిర్ణయించారు. గాంధీ జయంతి రోజున తాను స్వయంగా రెండు చోట్ల శ్రమదానానికి ఏర్పాట్లు చేశారు. తొలుత రాజమహేంద్రవరంలోని కాటన్‌ బ్యారేజీ రోడ్డుపైన..  మధ్యాహ్నం అనంతపురం జిల్లా కొత్త చెరువు రోడ్డుపైన నిర్వహించాలని కార్యక్రమాన్ని రెడీచేశారు. 


Also Read : అమరావతిలో పవన్‌ను కలిసిన అగ్రనిర్మాతలు ! ఒంటరిని చేయలేదని క్లారిటీ ఇచ్చారా?


అయితే ప్రభుత్వం పవన్ కల్యాణ్ వస్తున్నారని చెప్పి రెండు చోట్ల పైపైన మరమ్మతులు నిర్వహించింది. అదే సమయంలో కాటన్ బ్యారేజీపైకి ఎవర్నీ అనుమతించబోమని అధికారులు చెప్పారు. దీంతో శ్రమదానం చేసే ప్రదేశాన్ని హుకుంపేటలోని బాలాజీపేటకు మార్చారు. బాలాజీపేట కనకదుర్గమ్మ గుడి వద్ద సభ అనంతరం రోడ్డుపై పవన్‌ శ్రమదానం చేయనున్నారు. మధ్యాహ్నం అనంతపురం వెళ్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు శ్రమదానం చేయనున్నారు. ప్రభుత్వం నుంచి వ్యతిరేక ప్రకటనలు వస్తూండటంతో పవన్ కల్యాణ్ శ్రమదానం చేయకుండా అడ్డుకుంటారని జనసేన వర్గాలు నమ్ముతున్నాయి. ఈ క్రమంలో అనుకున్న ప్రకారం పవన్ కల్యాణ్ శ్రమదానం చేసి తీరాల్సిందేనని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం, పోలీసులు అడ్డుకున్నా వదలకూడదని పట్టుదలతో ఉన్నారు.  


Also Read : గెలుపు ఖాయమన్నాడు.. ఇంతలోనే..! షాకిచ్చిన బండ్ల గణేష్..


ఏపీలో రోడ్ల దుస్థితిని గత నెల మొదట్లో మూడు రోజుల పాటు జేఎస్పీ ఫర్ ఏపీ రోడ్స్ పేరుతో సోషల్ మీడియాలో ఉంచారు. దాదాపుగా నాలుగు లక్షల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  అడుగుకో గుంత - గజానికో గొయ్యిలా రాష్ట్రంలో రహదారులు ఉన్నాయని పవన్ కల్యాణ్  ఆరోపణలు చేశారు. మరో వైపు రోడ్ల దుస్థితిపై  జనసేన రాద్దాంతం చేస్తోందని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు ప్రారంభించారు. వర్షాలు ముగిసిపోయిన వెంటనే మరమ్మత్తులు చేస్తామని.. ఇప్పటికే వేల కోట్ల విలువైన టెండర్లను ఖరారు చేశామని చెబుతున్నారు. అయితే రెండున్నరేళ్లుగా ధ్వంసమైన రహదారుల్ని.. వరుసగామూడు వర్షాకాలాలు వచ్చినా బాగు చేయని ప్రభుత్వం ఇప్పుడు పవన్ కల్యాణ్ ఉద్యమం ప్రారంభించే సరికి ఇలాంటి ప్రకటనలు చేస్తోందని.. జనసేన వర్గాలు అంటున్నాయి. 


Also Read : రాజు తలుచుకుంటే వరాలకు కొదవా? సీఎం జగన్ కు నిర్మాత అల్లు అరవింద్ రిక్వెస్ట్.. సినీ ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరించాలని వినతి


ప్రస్తుతం వైసీపీ, జనసేన మధ్య ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. సినీ పరిశ్రమ సమస్యల విషయంలో పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం .. వాటిపై వైసీపీ నేతలు బూతులు లంకించుకోవడంతో సమస్య తీవ్ర రూపం దాల్చింది.  ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ రోడ్ల మీదకు వస్తూండటంతో  పోలీసులు పర్యటనను సాఫీగా సాగనిస్తారా లేక అడ్డుకుంటారా అన్నదానిపై ఆసక్తి ఏర్పడింది. 


బహిరంగ సభకు అనుమతి లేదు: పోలీసులు


జనసేన బహిరంగ సభకు అనుమతి లేదని రాజమండ్రి పోలీసులు తెలిపారు. సభావేదిక మార్చుకోవాలని జనసేన నేతలకు తెలిపామని రాజమండ్రి అడిషనల్ ఎస్పీ తెలిపారు. బాలాజీపేట సెంటర్ లో సభ పెట్టడం వల్ల ఇబ్బందులు వస్తాయన్నారు. సభకు అనుమతి ఇస్తే సుమారు 20 వేలమంది వచ్చే అవకాశం ఉందని, అందుకే ఈ సూచన చేశామన్నారు. హుకుంపేట-బాలాజీపేట రోడ్డులో జనసేన శ్రమదానం కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. అయితే పోలీసుల ప్రకటన తర్వాత పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. 


పవన్ పర్యటన షెడ్యూల్


గాంధీ జయంతి సందర్భంగా శనివారం జనసేన శ్రమదానం కార్యక్రమం చేపట్టింది. రోడ్లకు మరమ్మతు చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రేపు ఉదయం పవన్ రాజమండ్రికి చేరుకుంటారు. ఉదయం 9 గంటలకు హుకుంపేట సమీపంలోని బాలాజీపేట కనకదుర్గమ్మగుడి దగ్గర జరిగే సభలో పాల్గోనున్నారు. అనంతరం హుకుంపేట సమీపంలో శ్రమదానంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు కొత్తచెరువు సమీపంలో చేపట్టే శ్రమదానంలో పాల్గొంటారు. అనంతరం కొత్తచెరువు జంక్షన్ దగ్గర నిర్వహించే సభలో పాల్గొంటారని జనసేన ఒక ప్రకటనలో తెలిపింది. శ్రమదానం అనంతరం పుట్టపర్తికి బయలుదేరతారని ప్రకటించింది.   


Watch Video : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పోరాటం ఎవరి కోసం? పార్టీ కోసమా? సినీ పరిశ్రమ కోసమా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి