తెలంగాణ ఆర్టీసీకి ఎండీగా ఐపీఎస్ అధికారి సజ్జనార్ నియమితులు అయిన నుంచి విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. తాజాగా ఉద్యోగులకు ఎండీ వీసీ సజ్జనార్‌ శుభవార్త అందించారు. ఇక నుంచి అంటే అక్టోబరు నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు మొదటి వారంలోపే జీతాలు అందనున్నాయి. జీతాల విషయంలో ఇబ్బందులు లేకుండా ఓ జాతీయ బ్యాంక్‌తో ఒప్పందం కుదిరినట్లుగా ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రతి నెలాఖరులో ఆర్టీసీ సిబ్బంది జీతాలు అందుకుంటున్నారు. సజ్జనార్ చొరవతో ఇకపై సిబ్బంది శుక్రవారం జీతాలు అందుకోనున్నారు.


దాదాపు మూడేళ్ల తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు సమయానికి జీతాలు అందుకోనున్నారు. ఇకపైనా ప్రతి నెలా మొదటి వారంలోపే జీతాలు చెల్లించాలని సంస్థ ఎండీ సజ్జనార్‌ ఉన్నతాధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. దాదాపు 48 వేల మంది ఉద్యోగులు, పింఛనుదారులు తొలివారంలోపే వేతనాలు అందుకోనున్నారు. మొత్తం 48 వేల మందికిపైగా ఉద్యోగులకు నెలనెలా జీతాలకు రూ.230 కోట్లకు పైగా అవసరం ఉంటుంది. పీఎఫ్‌ కోసం సుమారు రూ.40 కోట్లు, సీసీఎస్‌ రూ.30 కోట్లు మొత్తం రూ.70 కోట్లను ఆర్టీసీ ఆ తర్వాత సర్దుబాటు చేసుకుంటుంది. ఈ మొత్తాన్ని మినహాయించి వేతనాల వరకు సుమారు రూ.160 కోట్లు ఓడీ కింద బ్యాంకు సమకూర్చడానికి అంగీకరించినట్లుగా తెలుస్తోంది. 


Also Read: TS Assembly: మీ మాటలు వింటే జాలిగా ఉంది.. కేసీఆర్ అసంతృప్తి, అందరికీ అన్ని వివరాలిస్తామని వెల్లడి


గత నెల రోజులుగా ఆర్టీసీ పూర్తిస్థాయిలో బస్సులను పునరుద్ధరించింది. కానీ, కరోనా భయంతో ఆశించిన స్థాయిలో బస్సుల్లో ప్రజలు ప్రయాణించడం లేదు. రోజువారీ ఆర్టీసీ ఆదాయం రూ.15 కోట్ల నుంచి రూ.9.5 కోట్లకు పడిపోయింది. దీనికి తోడు డీజిల్‌, బస్సుల విడిభాగాల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సంస్థ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ఆర్టీసీలో దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లిన ఉద్యోగులకు జీతాల చెల్లింపులు నిలిపివేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. విదేశాలకు వెళ్లే వారికి వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసేవారు. ఇక నుంచి ఉద్యోగులు వారి పరిమితి మేరకు వినియోగించే సెలవులకు మాత్రమే వేతనాలు చెల్లించనున్నారు.


డోర్ టూ డోర్ డెలివరీమరోవైపు, ఏపీఎస్‌ ఆర్టీసీ ఇవాల్టి నుంచి (అక్టోబరు 1) ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాలకు డోర్‌ డెలివరీ సేవలను ప్రారంభించింది. హైదరాబాద్‌ నుంచి శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూల్‌, ఏలూరు, ఒంగోలు, అనంతపురం, మచిలీపట్నం, గుంటూరు, విశాఖపట్నం జిల్లా కేంద్రాలతో పాటు రాజమండ్రి, విజయవాడ, తిరుపతి పట్టణాల్లో 50 కేజీల వరకు పార్సిల్‌, కొరియర్‌లను డోర్‌ డెలివరీ చేయనున్నట్లు ఉన్నతాధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.


Also Read: Huzurabad Government Expenditure : హుజురాబాద్‌ ఉపఎన్నిక చాలా కాస్ట్‌లీ గురూ ! ప్రభుత్వం.. పార్టీల ఖర్చు ఎంతో తెలుసా ?


Also Read: Warangal Rape Case: వరంగల్ రేప్ కేసులో టీఆర్ఎస్ లీడర్ భర్త.. అరెస్టు చేసిన పోలీసులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి