తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అన్ని జిల్లాల్లో కురుస్తాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది. సెప్టెంబరు 30న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మరుసటి రోజు వాతావరణ అంచనాలను ట్విటర్ ద్వారా తెలిపారు.
ఝార్కండ్, బిహార్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉందని వారు పేర్కొన్నారు. దీంతో గురు, శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు వెల్లడించారు. శుక్రవారం పలు చోట్ల మోస్తరు వర్షాలు పడుతాయని, పలు జిల్లాల్లో భారీ వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని వారు తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఇలా..
అమరావతిలోని వాతావరణ విభాగం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. అక్టోబరు 1న ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమ ప్రాంతంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వివరించారు. రాష్ట్రం మొత్తమ్మీద ఉరుములు మెరుపులు కేవలం ఒకటి లేక రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని తెలిపారు.
రెండ్రోజుల్లో భారీ వర్షం
అయితే, మరో రెండ్రోజుల్లో మాత్రం ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుందని అంచనా వేశారు. రాయలసీమలోనూ ఒకటి లేక రెండు చోట్ల మరో రెండు రోజుల్లో భారీ వర్షం కురుస్తుందని అంచనా వేశారు.
Also Read: ఏపీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై నాన్‌బెయిల్‌బుల్ వారెంట్