తెలంగాణ శాసన సభలో విపక్షాల మాటలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం నాటి సభలో ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భ‌ట్టి విక్రమార్కకు చుర‌క‌లంటించారు. గ్రామ పంచాయతీలు, స‌ర్పంచ్‌ల విష‌యంలో భ‌ట్టి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందని కేసీఆర్ అన్నారు. గత ప్రభుత్వాల హ‌యాంలో ఎప్పుడూ స‌ర్పంచ్‌ల‌ను ప‌ట్టించుకోలేదని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన త‌ర్వాత స‌ర్పంచ్‌ల‌కు స్వేచ్ఛ ఇచ్చి, అన్ని హ‌క్కులు కల్పించామని అన్నారు. ఇప్పుడు గ్రామాల్లో వారు మంచి పనులు చేసుకుంటూ పోతున్నారని చెప్పారు.


‘‘ప‌ల్లె, ప‌ట్టణ‌ ప్రగ‌తిపై స్వల్ప కాలిక చ‌ర్చ కాదు.. దీర్ఘకాలిక చ‌ర్చ పెట్టండి. అవసరమైతే మరో 20 రోజులు సభను నడుపుకుందాం. ప్రజలకు అన్ని నిజాలు తెలియాలి. ఏక‌గ్రీవ‌మైన గ్రామ‌పంచాయ‌తీల‌కు నిధులు ఇస్తామ‌ని ఎక్కడా చెప్పలేదు. నూత‌న పంచాయ‌తీ రాజ్ చ‌ట్టంలో ఆ ప్రస్తావ‌నే లేదు. ఆ చ‌ట్టం ప్రకారమే నిధుల పంపిణీ, విడుద‌ల జ‌రుగుతుంద‌ని అన్నారు. మా ప్రభుత్వం పార‌ద‌ర్శకంగా ప‌ని చేస్తుంది.’’ అని కేసీఆర్ అన్నారు.


Also Read: వర్క్ ఫ్రం హోం ఇక ముగిసినట్లే.. ఆఫీసులు తెరవనున్న దిగ్గజ కంపెనీల జాబితా ఇదే..


కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం అనేది దయాదాక్షిణ్యం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో అన్నారు. ‘‘ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా సూచన ప్రకారమే రాష్ట్రాలకు కేంద్ర నిధులు ఇస్తుంది. అంతేకానీ, ప్రత్యేకంగా ఏం ఇవ్వడం లేదు. కాంగ్రెస్ సభ్యుల మాటలు వింటే జాలేస్తుంది. కరోనా టైంలో ఎమ్మెల్యేల జీతాలు ఆపాం కానీ, పంచాయతీలకు నిధులు ఆపలేదు. కాంగ్రెస్ సభ్యుల మాటలు వింటుంటే జాలేస్తుంది. ఇంకా అవసరమైతే మంత్రుల జీతాలు కూడా ఆపి పంచాయతీలకు నిధులిస్తాం. 


Also Read: Huzurabad News: హుజూరాబాద్‌లో ప్రచార వ్యూహాలు షురూ.. మార్నింగ్ వాక్‌లో మంత్రి, గ్రౌండ్‌లో ఎక్సర్‌సైజులు


‘‘రాష్ట్రంలోని 2,796 గ్రామ పంచాయతీలకు ఎన్ని నిధులు విడుదల చేశామో మొత్తం వివరాలిస్తాం. ప్రతి సభ్యుడికి దానికి సంబంధించిన ప్రతులు అందిస్తాం. గ‌త ప్రభుత్వాల హ‌యాంలో పంచాయ‌తీల్లో అవినీతి జ‌రిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో ప‌రిశుభ్రత కోసం ఎన్నో కార్యక్రమాలు చేప‌ట్టాం. వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే గిరిజన ప్రాంతాల్లో మ‌ర‌ణాలు సంభ‌వించేవి. ఇప్పుడు అన్ని సీజ‌న‌ల్ వ్యాధులు, డెంగీ లాంటి విష‌ జ్వరాలు త‌గ్గిపోయాయి. గ్రామాల రూపురేఖ‌ల‌ను పూర్తిగా మార్చేశాం’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.


Also Read : త్వరలో రెడ్డి కార్పొరేషన్ .. హుజూరాబాద్‌లో హరీష్ హామీ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి