వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత 2009 సెప్టంబరు 3న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. హైకమాండ్ రోశయ్యను సీఎంగా ఎంపిక చేయడం ఎవరికీ ఇష్టం లేదు. మంత్రులుగా ప్రమాణం చేయడానికి ఇతరులు సిద్ధం కాలేదు. కానీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హెచ్చరిక రావడంతో అందరూ రోశయ్య కంటే ముందే రాజ్ భవన్‌కు వచ్చారు. అలా ప్రమాణ స్వీకారం చేసిన రోశయ్య ముఖ్యమంత్రి పదవికి 2010 నవంబరు 24న రాజీనామా చేశారు. ఆయన పదవిలో ఉన్న కాలం 14 నెలల 22 రోజులు. ఈ కాలంలో ఆయన ఎదుర్కొన్న ఒత్తిడి .. చివరికి రాజీనామా చేసేలా చేసింది.
Also Read : నొప్పింపని ..తానొవ్వని నేత..! వర్గ పోరాటాల కాంగ్రెస్‌లో అజాతశత్రువు రోశయ్య !
రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. కానీ వర్షాలు లేవు. కృష్ణాకు ఎగువ నుంచి వచ్చిన వరదలతో కనీవినీ ఎరుగని రీతిలో కర్నూలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఆస్తి నష్టం భారీగానే జరిగింది. అంతకు ముందు వరకూ ఉన్న ప్రభుత్వ పెద్దలు శ్రీశైలంలో నీటిని దిగువకు విడుదల చేసే విషయంలో జాగ్రత్త పాటించారు. కానీ ఒక్క సారిగా వరద రావడంతో బ్యాక్‌వాటర్ వెనక్కి తన్ని.. తుంగభద్ర నది ఉప్పొంగి కర్నూలును ముంచెత్తింది. కర్నూలు మొత్తం ఎఫెక్ట్ అయిన ఆ వరదల్లో ఏ ప్రభుత్వం ఎంత చేసినా అసంతృప్తి సహజంగానే వస్తుంది.
Also Read : వైఎస్‌ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలన్న రోశయ్య..ఆ వైఎస్‌కే ఆత్మబంధువు ఎలా అయ్యారు !?
అలా ఆ విపత్తు నుంచి ప్రయాణం ప్రారంభించిన రోశయ్యకు వెంటనే తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెరపైకి ఫ్రీజోన్ అంశం వచ్చింది. పోలీసు ఉద్యోగాల నియామకంలోహైదరాబాద్ ఫ్రీజోనే అని ఏ ప్రాంతం వారైనా ఇక్కడ పోలీసు ఉద్యోగాల్లో చేరవచ్చని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర భావన మరింత పెరిగింది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు టిఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖరరావు ఆమరణ నిరాహార దీక్ష ప్రకటన చేశారు. దీక్షకు అనుమతించకుడా.. రోశయ్య సర్కారు, కెసిఆర్‌ను మధ్యలోనే అరెస్టు చేసింది. ఇక అక్కడినుంచి తెలంగాణ అంశం రావణ కాష్ఠంలా రగిలిపోయింది.
Also Read : మాటల మాంత్రికుడు రోశయ్య .. ఆ పంచ్‌లకు ఎవరి దగ్గరా ఆన్సర్ ఉండదు !
డిసెంబర్ 9న చిదంబరం చేసిన ప్రకటన రోశయ్యకు కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైందన్న ఆ ప్రకటన.. సీమాంధ్రలో ఉద్యమానికి కారణమైంది. సమైక్యాంధ్ర భావనతో.. సీమాంధ్ర ప్రజలు ఉద్యమించారు. దీంతో.. తెలంగాణలోని ఆందోళనలు కాస్తా సీమాంధ్రకు మళ్లాయి. ఒక ప్రాంతానికి మద్దతుగా ఏ నిర్ణయం తీసుకున్నా.. రెండో ప్రాంతం వారు గొడవకు దిగే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణకమిటీని వేసింది. ఆ వివాదం అలా ఆయన పదవీ కాలం మొత్తం సాగింది.
Also Read : తరలిపోయిన ఉమ్మడి రాష్ట్ర దిగ్గజ నేత.. మాజీ సీఎం రోశయ్య కన్నుమూత !
వరదలతో ప్రారంభించి.. తెలంగాణ ఉద్యమ గండాన్ని ఎదుర్కొంటున్న ఆయనకు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలోనే.. పార్టీని ధిక్కరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంశం మరింత కలవరపరిచింది. ఓదార్పు యాత్ర పేరిట, జగన్ అధిష్ఠానాన్ని ధిక్కరిస్తూ పార్టీని బలహీనం చేస్తున్నా ఏమీ చేయలేకపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పటి వరకూ అండగా నిలిచిన మీడియాలో వస్తున్న కథనాలు.. సీఎం రోశయ్యపై మానసిక దాడి.. కేబినెట్ మంత్రులే సహకరించని పరిస్థితి ఆయనకు ఎదురైంది. సోనియా గాంధీకి వ్యతిరేకంగా కథనాలు ప్రాంభమయ్యాయి. ఓ ఛానల్‌లోను, ఓ పత్రికలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుమ్మెత్తిపోయడం ప్రారంభమయింది. పిల్లి సుభాష్ వంటి వారు జగన్‌కు మద్దతుగా రాజీనామాలు చేయడం కూడా ఆయనపై ఒత్తిడికి మరింత కారణం అయింది.
Also Read: Konijeti Rosaiah Death: మాజీ గవర్నర్ రోశయ్య కన్నుమూత.. ప్రముఖుల సంతాపం
ఇలా ప్రభుత్వ పరంగా.. రాజకీయ పరంగా అన్ని వైపుల నుంచి 14 నెలల పాటు సవాళ్లను ఎదుర్కొన్న రోశయ్య మానసికంగా నలికిపోయారు. సంప్రదాయబద్దంగా ఎలాంటి గ్రూపు రాజకీయాలు నడపకుండా.. సీనియారిటీతో, విధేయతతో, అనుభవంతో పాలన చేస్తారనుకున్నారు కానీ లెక్క తప్పింది. దీంతో ఆయన సీఎంపదవికి రాజీనామా చేసి.. తన వల్ల కాదన్నారు. ఆతర్వాత గవర్నర్ గా వెళ్లారు.