కొణిజేటి రోశయ్య మాటల మాంత్రికుడు. ఆయన గొప్ప ఉపన్యాసకుడు కాకపోవచ్చు కానీ అసెంబ్లీలో ప్రత్యర్థులకు ఆయనకు ఇచ్చే పంచ్‌లకు వారి వద్ద ఆన్సర్ ఉండేది కాదు. ఆయనో రాజకీయ శిఖరం... రాజకీయాల్లో ఆయన చూడని ఎత్తులు లేవు పై ఎత్తులు లేవు. రాజకీయాల్లో ఆయనను మించిన వ్యూహ చతురత కలిగిన నాయకుడు మరొకరు లేరు. ఆయన రాజకీయం చేస్తే కర్రా విరగదు పాము చావదు. ఆయన రాజకీయం చేస్తే విపక్షాలు కూడా ఆయనను గట్టిగా విమర్శలు చేయలేవు. ఆయన మాటలు ఓ రకంగా తూటాలు...కానీ అవి ఎవరినీ గాయం చేయవు.
Also Read : తరలిపోయిన ఉమ్మడి రాష్ట్ర దిగ్గజ నేత.. మాజీ సీఎం రోశయ్య కన్నుమూత !
ఆయన ఒక్క మాట మాట్లాడితే దాని వెనుక ఎంతో పెద్ద అర్ధం ఉంటే గాని మాట్లాడరు. అనవసర ప్రసంగాలు ఆయన నుంచి రావు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ నుంచి ఎవరు సిఎం అయినా సరే ఆయన కేబినేట్ లో ఉండాల్సిందే. ప్రజల్లో మాస్ ఇమేజ్ లేకపోయినా సరే ఆయనకు ప్రభుత్వంలో మాత్రం సిఎం తర్వాత సిఎం గా ప్రాధాన్యత ఉండేది అందుకే. ప్రత్యర్ధులపై చమత్కారాలతో ఇరుకున పెట్టే నైపుణ్యం ఆయన సొంతం.
Also Read : పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి.. రోశయ్య మృతిపై కేసీఆర్, వైఎస్ జగన్ సంతాపం
వైఎస్ సీఎంగా ఉండగా ఓ సందర్భంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అసెంబ్లీలో రోశయ్యను ఉద్దేసించి మీకు ఈ మధ్య తెలివితేటలు ఎక్కువ అయ్యాయి అని వ్యాఖ్యానించారు. దానికి రోశయ్య ప్రతి స్పందిస్తూ నాకే తెలివితేటలు ఉంటే , చెన్నా రెడ్డిని , నేదురుమల్లి జనార్ధనరెడ్డిని, అంజయ్యను , వీరితో పాటు తనను నమ్మిన వై.ఎస్‌ను ఎప్పుడో ఏ మార్చి సీఎం అయ్యేవాడినంటూ సెటైర్ వేశారు. చంద్రబాబు ఎన్టీఆర్‌ను దింపేసిన వైనాన్ని అలా అసెంబ్లీలోకి పరోక్షంగా తీసుకు వచ్చారన్నమాట. అంత పరుషంగా ఉండదు.. అలా అని ఎదుటివారు తేలిగ్గా తీసుకోలేని విమర్శలు.
Also Read: Konijeti Rosaiah Death: మాజీ గవర్నర్ రోశయ్య కన్నుమూత.. ప్రముఖుల సంతాపం
ఓ సందర్భంలో ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఆయన సమీప బంధువు ఒకరు విశాఖలో ఓ " పాశ్చాత్య " సంప్రదాయ పార్టీలో దొరికిపోయారు. ఆ విషయం ఆయనను ఇరుకున పెట్టడానికి అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు ప్రస్తావించారు. దానికి రోశయ్య ఏ మాత్రం తడుముకోకుండా రిప్లయ్ ఇచ్చారు. అభివృద్ధి పేరుతో అలాంటి జాడ్యాలను తెచ్చి పెట్టింది అంతకు ముందు ప్రభుత్వమేనని సెటైర్ వేశారు. ఓ సారి మంద బలంతో బిల్లులు పాస్ చేసుకుంటున్నారని విపక్షాలు చేసిన విమర్శలకు.. మంద బలం ఉండబట్టే తాము అధికారపక్షం వైపు ఉన్నామని.. ఒక్క మాటతో తేల్చేశారు.
ఆయన మాటల చాతుర్యం గురించి చెప్పుకోవాలంటే ప్రతి సందర్భం.. ఓ సాక్ష్యమే అవుతుంది. ఆయన మాస్ లీడర్ కాదు. పరోక్షంగా ఎన్నికయిందే ఎక్కువ. కానీ ఆయన మాటల రాజకీయం.. తెలివైన రాజకీయం కారణంగా ఆయన విజయవంతమైన నేతగా గుర్తింపు పొందారు.