ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ వైపు ఉద్యోగులతో చర్చలు జరుపుతూనే అవి వర్కవుట్ అవకపోతే సమ్మెను నిరోధించే దిశగా కీలకమైన అడుగులు వేస్తోంది. ఉద్యోగులపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించే ఆలోచన చేస్తోంది. ముందుగా గనుల శాఖ డైరక్టర్ వెంకటరెడ్డి తమ శాఖలో ఎస్మా అంశాన్ని ప్రస్తావిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గనుల శాఖలో ఎవరైనా ఉద్యోగులు సమ్మెకు వెళ్లినా.. బంద్ చేసినా.. ఆందోళనలకు దిగినా ఎస్మా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులు జారీ చేశారు.


ఏపీ ఉద్యోగులు కోరుతున్నదేంటి? ప్రభుత్వం ఇస్తానంటున్నదేంటి? వివాదానికి ఈ రోజు తెరపడేనా ?


మైనింగ్ శాఖలో ఎస్మా చట్టం ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఉద్యోగ సంఘాల్లో కలకలానికి కారణం అయింది. దీంతో  సాయంత్రానికి ఉత్తర్వులు విత్ డ్రా చేసుకుంటున్నామని.. ఎదైనా ఉంటే ప్రభుత్వమే ప్రకటిస్తుందన్నారు.  ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు జరుపుతున్నారు. అవి సానుకూలంగా ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ సమయంలో ఎస్మా ఉత్తర్వులు జారీ చేసి ఉద్యోగుల్ని భయపెడదామనో.. లేకపోతే తమ ఉద్దేశం మారదని సంకేతాలు పంపుదామనో ఇలాంటి ఉత్తర్వులు జారీ చేశారని ఉద్యోగులు భావిస్తున్నారు. ప్రభుత్వం చర్చల విషయంలో ఒకలా... బయట మరోలా వ్యవహరిస్తోందని ఉద్యోగులు ఆందోళన చెందారు. 



నిజానికి అత్యవసర సేవల నిర్వహణ చట్టాన్ని ఎస్మా అంటారు.  సమ్మెలు, బంద్‌ల వల్ల ప్రజల దైనందిన జీవనానికి ఇబ్బంది కలగకుండా చూడటం, కొన్ని రకాల అత్యవసర సేవల నిర్వహణ ఆటంకం లేకుండా కొనసాగేలా చూడటం కోసం ఈ చట్టం రూపొందించారు. అయితే మైనింగ్ శాఖ ఏ విధంగానూ అత్యవసర సేవల్లోకి రాదు. అలాంటప్పుడు మైనింగ్ శాఖ డైరక్టర్ వెంకటరెడ్డి ఎందుకు ఈ ఉత్తర్వులు జారీ చేశారనేది సందేహంగా మారింది. అయితే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా.. ఉద్యోగులకు ఓ సందేశం పంపడానికే మైనింగ్ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ చేసిందని కొంత మంది ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.  


ఏపీ వ్యాప్తంగా ఉద్యోగుల సహాయనిరాకరణ.. ఎక్కడివక్కడ నిలిచిపోయిన ప్రభుత్వ కార్యకలాపాలు !


ఉద్యోగులంతా సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించారు. దీంతో ప్రభుత్వం స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని నివారించడానికి ప్రభుత్వం ఎంతో కొంత తగ్గి ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని చూస్తోంది. అయితే ఒక వేళ సాధ్యం కాకపోతే ప్లాన్ బీ కోసం ఎస్మా చట్టం ప్రయోగానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఒక వేళ చర్చలు విఫలమైతే.. అన్ని శాఖల్లోనూ ఎస్మా ప్రయోగం ఖాయమని మైనింగ్ శాఖ ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వం సంకేతాలిచ్చిందని అర్థం చేసుకోవచ్చుని అనుకున్నారు. అయితే వివాదం కావడంతో వెంటనే ఉపసంహరించుకోవడంతో వివాదం సద్దుమణిగింది.