ఎస్మా అంటే ఏమిటి..? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా చేయడానికి ఈ చట్టాన్ని ప్రయోగించేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.  అసలు ఎస్మా చట్టం అంటే ఏమిటి అది అమలు చేస్తే ఏమవుతుంది?
 
ఎస్మా అంటే ? 


 ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ మెయింటేనెన్స్‌ యాక్ట్‌ అంటే అత్యవసర సేవల నిర్వహణ చట్టాన్ని ఎస్మా అంటారు.  సమ్మెలు, బంద్‌ల వల్ల ప్రజల దైనందిన జీవనానికి ఇబ్బంది కలగకుండా చూడటం, కొన్ని రకాల అత్యవసర సేవల ని ర్వహణ ఆటంకం లేకుండా కొనసాగేలా చూడటం కోసం ఈ చట్టం రూపొందించారు. 1981లో దీన్ని రూపొందించి చట్ట రూపమిచ్చారు.
 
ఎప్పుడు.. ఎవరిపై ప్రయోగించవచ్చు ?
 
అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు తమ విధులకు హాజరుకాకుండా, ఆయా సేవలకు విఘాతం కలిగేలా సమ్మె చేస్తే దీన్ని ప్రయోగించే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ చట్టం పరిధిలోకి వస్తారు. ఈ చట్టాన్ని ఒకసారి ప్రయోగిస్తే ఆరు నెలలపాటు అమల్లో ఉంటుంది. దాన్ని ఒక్కోసారి పొడిగిస్తుంటారు కూడా. ఈ చట్టం ప్రకారం సమ్మె చేస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవచ్చు. సస్పెన్షన్‌, డిస్మిస్‌, జైలు శిక్ష, జరిమానా విధించే హక్కు ప్రభుత్వాలకు ఉంటుంది.


 ఉద్యోగులు ఎవరిపైనైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు !
 
ఎస్మా నిబంధనలను అతిక్రమించి సమ్మెకు దిగినట్లు ప్రభుత్వం అనుకుంటే  నేరశిక్షాస్మృతితో సంబంధం లేకుండానే పోలీసులు వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయవచ్చు. ఎస్మా నిబంధనలకు విరుద్ధంగా సమ్మె ప్రారంభించే, పాటించే ఉద్యోగులను డిస్మిస్‌ చేయడంతో పాటు వివిధ రకాల క్రమశిక్షణ చర్యలు చేపట్టొచ్చు. సమ్మెలో పాల్గొంటున్న వారికి, వారిని ప్రోత్సహిస్తున్న వారికి జైలు, జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. ఈ చట్టం ప్రకారం సమ్మెకు ఆర్థిక సహకారం అందించేవారు కూడా శిక్షకు అర్హులే.  
 
అతి తక్కువ సార్లు ఎస్మా ప్రయోగం !


ఎస్మా చట్టాన్ని ప్రభుత్వాలు ఇక తప్పదనుకుంటున్న పరిస్థితుల్లో ఉపయోగించుకుంటున్నాయి.  2003లో తమిళనాడు ప్రభుత్వ ఉపాధ్యాయు లు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఆ స మయంలో జయలలిత ప్రభుత్వం ఎస్మా ప్రయోగించి దాదాపు 1,70,000మందిని విధుల్లోంచి తొలగించింది. 2006లో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా విమానాశ్రయ సిబ్బంది సమ్మెకు దిగినప్పుడు ప్రయోగించారు. 2009లో ట్రక్కు రవాణాదారులు సమ్మె చేసినప్పుడు, అదే యేడాది చమురు, గ్యాస్‌ సిబ్బంది సమ్మె చేసినప్పుడు ఎస్మా ప్రయోగించారు. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఎస్మా ప్రయోగించే పరిస్థితి లేదు. ఏడాదిన్నర కిందట తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నప్పుడు ఎస్మా ప్రయోగిస్తారని అనుకున్నారు. కానీ అలాంటి నిర్ణయం తీసుకోలేదు.