ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన అది దేశ పౌరసత్వానికి సర్టిఫికెట్ కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు లోక్‌సభకు ఈ విషయం స్పష్టంగా తెలిపారు. ఆధార్ కార్డు  పౌరసత్వానికి గుర్తింపుగా ఉంటుంది కానీ.. ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన పౌరసత్వం  ఉన్నట్లు కాదని స్పష్టం చేసింది. దేశంలోకి అక్రమంగా వలస వస్తున్న అనేక మంది స్థానిక అధికారుల అవినీతి కారణంగా ఆధార్ కార్డు పొందుతున్న ఆరోపణలు తరచూవస్తున్నాయి. సరిహద్దు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. 


హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లోనూ ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఆధార్ కార్డులు పొంది వాటి ఆధారంగా పాస్‌పోర్టులు ఇతర సిటిజన్ షిప్ ధృవీకరించే గుర్తింపు పత్రాలుపొందినట్లుగా కేసులు కూడా నమోదయ్యాయి. ఇండియా ఆధార్ కార్డు ఉంటే ఇండియనే అన్న భావన పెరుగుతూండటంతో కేంద్ర ప్రభుత్వం దీనికి చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది. విదేశీయులు పౌరసత్వం పొందడానికి ప్రత్యేకమైన మార్గాలుంటాయి.  


అయితే అక్రమంగా వలస వచ్చిన వారు..  దురుద్దేశంతో  అడ్డదారులు తొక్కుతున్నారు. అక్రమ పద్దతుల్లో  ఆధార్ కార్డు పొందడం ద్వారా ఇండియన్ పౌరసత్వం పొందినట్లుగా షార్ట్ కట్ మార్గాలు ఎంచుకోవడం నేరమని కేంద్రం ఈ ప్రకటనతో తేల్చేసినట్లయింది. ఆధార్ విషయంలో కేంద్రం ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఓటర్ కార్డుకు కూడా అనుసంధానం చేస్తూ పార్లమెంట్‌లో నిర్ణయం తీసుకుంది. ప్రతి ఓటరు తమ ఆధార్ నెంబర్‌తో ఓటర్ కార్డు నెంబర్‌ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది స్వచ్చందమేనని కేంద్రం తెలిపింది. ఇప్పటికి భారత్‌లో ఆధార్ అనేది అత్యంత ముఖ్యమైన నెంబర్ అయింది. ఇది విస్తృతంగా చెల్లుబాటయ్యే గుర్తింపు కార్డుగా ఉంది. 


ప్రస్తుతం భారత్‌లో ఆధార్ కార్డు లేకపోతే రోజువారీ పనులు చేసుకోలేని పరిస్థితి ఉంది. చిరునామాకు రుజువుగా ఆధార్ కార్డ్ చెల్లుతుంది. ఆధార్ కార్డ్‌లో ఫోటో, పేరు, చిరునామా మాత్రమే బయటకు కనిపిస్తాయి. కానీ వేలిముద్రలు , ఐరిస్ స్కాన్, ఫోన్ నెంబర్ అన్నీ రిజిస్టరై ఉంటాయి. ఓటరు కార్డు లేకపోతే ఓటు వేయలేరు, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే డ్రైవింగ్ చేయలేరు, పాస్‌పోర్ట్ లేకపోతే విదేశాలకు వెళ్లలేరు కానీ లేకపోతే ఆధార్ కార్డు లేకపోతే ఏ పనీ చేయలేము. ఆధార్ కార్డు ఉంటేనే ఇతర గుర్తింపు కార్డులు తీసుకోగలం.  ఆధార్ విషయంలో కేంద్రం ఇచ్చిన తాజా ప్రకటన  ఆధార్ ఉంటే పౌరసత్వం లభిస్తుందనే వారికి స్పష్టత ఇచ్చినట్లయింది.