ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , ఉద్యోగుల మధ్య ఇంత కాలం ఉన్న ఓ రకమైన తెర తొలగిపోయింది. చర్చలు ప్రారంభించారు., ప్రభుత్వం ఇంత కాలం అపోహలు తొలగిస్తాం కానీ జీవోల్లో మార్పులు చేర్పులు లాంటివి ఏమీ ఉండవని చెబుతూ వస్తోంది.కానీ సమ్మెకు ముందు కాస్త మెట్టు దిగి.. ఉద్యోగుల డిమాండ్లపై బేరసారాలు మొదలు పెట్టింది. అసలు ఉద్యోగులు ఏం అడుగుతున్నారు...? ప్రభుత్వం ఏం ఇస్తానంటోంది ? 


హెచ్‌ఆర్‌ఏ సహా పాత పద్దతిలోనే అలవెన్స్‌లు ఉండాలంటున్న ఉద్యోగులు!


హెచ్‌ఆర్ఏ, సీసీఏ లాంటివి పెంచాలని ఉద్యోగులు కోరడం లేదు. గత నెల వరకూ ఏమిచ్చారో ఇప్పుడు కూడా అదే ఇవ్వమని అడుగుతున్నారు. పీఆర్సీ జీవోల్లో హెచ్ఆర్ఏను తగ్గించడంతో పాటు సీసీఏ రద్దు చేశారు. తాము ఈ సౌకర్యాలన్నీ దశాబ్దాలుగా పోరాడిగా తెచ్చుకున్న సౌకర్యాలని.. వాటిని ఈ ప్రభుత్వం ఎలా రద్దు చేస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు . ఎక్కడైనా పెంచుతారు కానీ తగ్గించడం ఏమిటని అంటున్నారు. 


కొత్త హెచ్‌ఆర్ఏల్లో కాస్త మార్పులు చేస్తామంటున్న ప్రభుత్వం !


ప్రభుత్వం పాత హెచ్‌ఆర్ఏ కొనసాగించడం ఆర్థికంగా భారం అని చెబుతోంది. ప్రత్యామ్నాయంగా జీవోల్లో మార్పులు చేస్తామని ప్రతిపాదన పెట్టింది. రెండు లక్షల మంది జనభా ఉన్న ప్రాంతాలకు ఎనిమిది శాతం, 2 నుండి 5 లక్షల జనాభా ఉండే ప్రాంతాలకు12, 5-15 లక్షల జనాభా ప్రాంతాలకు 16 శాతం, 15 లక్షలపైన జనాభా ఉండే ప్రాంతాలకు 24 శాతం హెచ్‌ఆర్‌ఎను మంత్రుల కమిటీ ప్రతిపాదించింది. అదే విధంగా రిటైర్డ్‌ ఉద్యోగులకు అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ పాత విధానాన్ని కొనసాగించేందుకు అంగీకారం తెలిపింది. 70 ఏళ్ల వారికి ఐదు శాతం, 75 ఏళ్లపైబడిన వారికి 10 శాతం ఇస్తామని మంత్రుల కమిటీ తెలిపింది.


ఫిట్‌మెంట్ పైనా రెండు వర్గాల మధ్య పీట ముడి !


ఐఆర్ 27 శాతం ఉన్నందున ఫిట్‌మెంట్ 30శాతం వరకూ ఉండాలని ఉద్యోగ సంఘాల నేతలు పట్టుబడుతున్నారు. కింది స్థాయి ఉద్యోగులు ఐఆర్ కన్నా ఫిట్‌మెంట్ తగ్గడంపై అసంతృప్తిగా ఉన్నారు. 23 శాతం ఫిట్‌మెంట్‌కు అంగీకరించవద్దని కోరుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఫిట్‌మెంట్ విషయంలో ఎలాంటి చర్చలకు చాన్స్ లేదని..మార్చే అవకాశం లేదని తేల్చి చెబుతున్నారు. 


రికవరీ అంశంలో వెనక్కి తగ్గిన ప్రభుత్వం ! 


ఏపీ ఉద్యోగులు  ఇప్పటికే రెండున్నరేళ్ల నుంచి 27 శాతం మధ్యంతర భృతి రూపంలో పొందుతున్నారు. ఇప్పుడు 23 శాతమే ఫిట్‌మెంట్ ఖరారు చేయడం వల్ల నాలుగు శాతం లోటు పడింది. గత రెండున్నరేళ్ల నుంచి అదనంగా ఇచ్చిన ఈ నాలుగు శాతం మొత్తాన్ని రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని డీఏలను ఒకే సారి మంజూరు చేసిన ప్రభుత్వం  వాటికి చెల్లించాల్సిన ఎరియర్స్‌ను ఈ ఐఆర్‌తో కవర్ చేయాలని నిర్ణయించుకుంది. ఉద్యోగులకు ఒక్క రూపాయి కూడా బకాయి చెల్లించకుండా లెక్కలు సరి చేయాలనుకుంది. అయితే ఇప్పుడు రికవరీ లేకుండా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ ఒక్క విషయంలో రెండు వర్గాల మధ్య ఏకాభిప్రాయం వచ్చిందని అనుకోవచ్చు. 


ఐదేళ్లకోసారి పీఆర్సీకి ప్రభుత్వం అంగీకారం !


ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన పీఆర్సీ జీవోల్లో మరో పదేళ్ల వరకూ పీఆర్సీ ఉండదని ..కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం నియమించే వేతన సవరణ కమిటీ నివేదిక ఆధారంగానే తాము కూడా వేతన సవరణ చేస్తామని చెప్పింది. ఉద్యోగులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎప్పట్లాగే ఐదేళ్లకోసారి రాష్ట్ర పీఆర్సీనే ఉండాలంటున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్లుగా తెలుస్తోంది. 


మంత్రుల కమిటీ ముందు ప్రధానంగా పది డిమాండ్లు పెట్టిన ఉద్యోగ సంఘాల నేతలు !


మంత్రుల కమిటీ ముందు ఉద్యోగ సంఘ నేతలు  పిఆర్‌సిపై అశుతోష్‌ కమిటీ నివేదికను బయట పెట్టాలన్న డిమాండ్‌ను కూడా పెట్టారు. ఇది ఆర్థిక భారం కాదు. ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి నష్టం లేదు. కానీ అందులో ఎక్కువ సిఫార్సులుంటే ఉద్యోగుల్లో ప్రభుత్వం మోసం చేసిందన్న అభిప్రాయం ఏర్పడుతుంది. అందుకే ప్రభుత్వం వెనుకడుగు వేస్తోంది. అలాగే6. కాంట్రాక్టు ఉద్యోగులకు పే, డిఎ, హెచ్‌ర్‌ఎ , అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు మినిమం స్కేల్‌ , 8.గ్రామ సచివాలయ ఉద్యోగులకు గత అక్టోబర్‌ నుండి రెగ్యులర్‌ స్కేలు , 2022 పిఆర్‌సి స్కేళ్లు ఇవ్వడం, మార్చి 31 లోగా సిపిఎస్‌ రద్దుపై నిర్ణయం తీసుకోవడం వంటి డిమాండ్లు ఉద్యోగ సంఘ నేతలు పెట్టారు.