ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తున్నారు. శని, ఆదివారాల్లో సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారం ఈ రోజు ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు ఎవరూ పని చేయలేదు. సెక్రటేరియట్‌లో ఐదు రోజుల పని దినాల విధానం ఉండటంతో ఒక రోజు ముందుగానే శుక్రవారమే పెన్ డౌన్,యాప్ డౌన్ చేశారు. జిల్లాల్లోని కార్యాలయాల్లో శనివారం రోజు ఉద్యోగులు పెన్ డౌన్, సిస్టండౌన్, యాప్ డౌన్ చేశారు.  




ఏపీ ఉద్యోగులు కోరుతున్నదేంటి? ప్రభుత్వం ఇస్తానంటున్నదేంటి? వివాదానికి ఈ రోజు తెరపడేనా ?


రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో పెన్‌డౌన్, యాప్ డౌన్ చేసి ఉద్యోగులు విధులను బహిష్కరించారు. కార్యాకలాపాలు నిలిచి పోవడంతో ప్రజలు పనుల కోసం వచ్చి వెనుదిరిగారు. ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని.. స్టీరింగ్ కమిటీ ఆదేశాలతో కార్యాచరణ కొనసాగుతుందని ప్రకటించారు. అన్ని జిల్లాల్లో తహసీల్దారు, పౌర సరఫరాలశాఖ, రిజిస్ట్రేషన్, రవాణా శాఖ, ఆర్అండ్‌బీ శాఖల కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి. ఉదయం నుంచే ఉద్యోగులు విధులకు హాజరైనప్పటికీ విధుల్లో నిమగ్నం కాలేదు. ఎలాంటి ఫైల్స్ ను ముట్టు కోకుండా ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. కొందరు ఉద్యోగులు అసలు విధులకు దూరంగా ఉండిపోయారు.. దీంతో ఎక్కడి ఫైళ్లు అక్కడే ఉండి పోయాయి.


ఎస్మా " అంటే ఏమిటి? ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా ప్రయోగిస్తే ఏమవుతుంది ?


ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని ఉపసంహరించుకునే వరకూ తమ పోరు కొనసాగుతుందని ఉద్యోగులు అంటుండడగా.. మరో పక్క ప్రభుత్వ సేవల కోసం కార్యాలయాలకు వస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. ప్రభుత్వ కార్యాలయాల ముందు ప్రజలు పడిగాపులు పడాల్సి వస్తోంది. ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు జరుపుతున్నారు. ఆ చర్చల్లో సానుకూల ఫలితం రాకపోతే ఇక నుంచి ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లనున్నారు. ఆదివారం ఎలాగూ సెలవు రోజు. ఆదివారం అర్థరాత్రి నుంచి ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తున్నారు. 


ఉద్యోగుల ఉద్యమం తీవ్రంగా ఉండటం.. అన్ని శాఖల ఉద్యోగులూ సమ్మెకు సిద్ధమవడంతో  సమ్మె అంటూ ప్రారంభమైతే తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ప్రభుత్వం ఉద్యోగులు సమ్మె వరకూ వెళ్లకుండా చూడాలని పట్టుదలగా ఉంది. వారి డిమాండ్లపై చర్చిస్తోంది. ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం వస్తే సరి .. లేకపోతే ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.