ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ప్రజలు విద్యుత్ వాడకాన్ని నియంత్రించుకోవాలని సూచించారు. ఎంత డబ్బులు పెట్టి కొన్నా కరెంట్ మార్కెట్లో దొరికే పరిస్థితి లేదన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ముందు ముందు విద్యుత్ కోతలు విధించక తప్పదన్నారు. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరత.. కరెంట్ కొరత ఉందని స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సీఎం జగన్ ఇప్పటికే లేఖ రాశారని గుర్తు చేశారు. 


Also Read : ప్రతీ స్కూల్‌కు రూ. లక్ష .. స్కూళ్లు ప్రారంభం కాగానే అమ్మఒడి, విద్యాకానుక ! సీఎం జగన్ కీలక ఆదేశాలు !


రెండు రోజుల కిందట మీడియాతో మాట్లాడిన ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ కూడా ఇదే సలహా ఇచ్చారు. సాయంత్రం ఆరు నుంచి పది గంటల వరకు ఏసీలు ఆఫ్ చేసుకోవాలన్నారు. వేసవి కాలం కాకపోయినా ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితుల కారణంగా విద్యుత్ వాడకం పెరిగిపోయింది. ఇప్పటికే పలు చోట్ల లోడ్ రిలీఫ్ పేరిట అనధికారిక కరెంట్ కోతలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి రాసిన లేఖలోని వివరాల ప్రకారం చూస్తే ముందు ముందు ఏపీలో కరెంట్ కోతలు ఖాయమని ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం రోజుకు 185 మిలియన్‌ యూనిట్ల నుంచి 190 మిలియన్‌ యూనిట్ల వరకు ఉంటోంది. ఇందులో ఏపీ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు సమకూరుస్తున్న విద్యుత్ 45 శాతం మాత్రమే అంటే.  80 నుంచి 90 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందిస్తోంది. మిగతా అంతా ప్రభుత్వం బయట నుంచి కొనుగోలు చేస్తోంది.   


Also Read : ఇక డైరక్ట్ రాజకీయాల్లోకి జంప్! ‘మంచు మార్క్’ పాలిటిక్స్ ఖాయమేనా?


ఆంధ్రప్రదేశ్ జెన్‌కో థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 90 మిలియన్‌ యూనిట్లు ఉంది. అయితే ఇందులో సగం మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. అంటే 45 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అవుతుంది.  సెంట్రల్‌ పవర్‌ స్టేషన్ల నుంచి రోజుకు 40 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి కావాలి. కానీ 30 మిలియన్ యూనిట్లే ఉత్పత్తి అవుతున్నాయి. దీంతో బహిరంగ మార్కెట్‌లో కొని అవసరాలు తీర్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.  ఆంధ్రప్రదేశ్ ప్రతి రోజూ 40 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తోంది. సెప్టెంబర్‌ 15 వరకు సగటున యూనిట్‌ రూ.4. 60 పైసలు ఉండగా ఇప్పుడు అది రూ.15కు చేరింది.  కొన్ని సందర్భాల్లో ఇది రూ. ఇరవై వరకూ ఉంటోందని ప్రభుత్వం చెబుతోంది. అంత రేటు పెట్టినా కరెంట్ దొరికే పరిస్థితిలేదని సజ్జల చెబుతున్నారు.


Also Read : విద్యుత్ కొరతపై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ... యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి...


విద్యుత్ అవసరమైన వారు కొనుగోలు చేయడానికి పవర్ ఎక్స్‌ఛేంజ్ ఉంటుంది. బహిరంగ మార్కెట్‌లో డిమాండ్ సప్లయ్‌కు తగ్గట్లుగానే కరెంట్ చార్జీలు ఉంటాయి. ఈ ఎక్స్చేంజ్‌ లో  విద్యుత్ కొనాలనుకునే సంస్థలు.. ముందుగానే లెటర్ ఆఫ్ క్రెడిట్ ను ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని విద్యుత్ అమ్మిన సంస్థ 45 రోజుల్లో నగదుగా మార్చుకుంటాయి. రేట్లు పెరిగిపోతూండటంతో  ఏపీ ప్రభుత్వానికి పెనుభారంగా మారింది. 


Also Read : ఏపీ సర్కార్ కు మరోసారి చుక్కెదురు... ఇళ్ల పథకంపై సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్... స్వీకరణకు నో చెప్పిన డివిజన్ బెంచ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి