మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు అద్భుత విజయం సాధించారు. అసలు రేసులో ఉండరు అనుకున్న స్థాయి నుంచి ఘన విజయం వరకూ ఆయన ఎక్కడా తగ్గలేదు. ప్రత్యర్థులకు ధీటుగా సమాధానం చెప్పడం దగ్గర్నుంచి పోల్‌ మేనేజ్‌మెంట్ వరకూ దేన్నీ నిర్లక్ష్యం చేయలేదు. ‘మా’ ఎన్నికల్లో గెలుపు రుచి చూసిన తర్వాత ఖచ్చితంగా ఆయనకు ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి ఏర్పడుతుదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎందుకంటే మంచు విష్ణు రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తే. అందుకే విష్ణు తదుపరి అడుగులు రాజకీయాల వైపు ఉంటాయా అన్న చర్చ ప్రారంభమైంది.


పోల్‌ మేనేజ్‌మెంట్‌లో మంచు విష్ణు టాలెంట్ ! 


ఎన్నికలు అంటే పోల్ మేనేజ్‌మెంట్ అత్యంత కీలకం. తమకు ఓట్లు వేస్తారు అనుకున్న వారిని పోలింగ్ బూత్ వద్దకు తీసుకు రావడంలోనే అసలు సక్సెస్ ఉంటుంది. అది సాధారణ ఎన్నికల్లో మాత్రమే కాదు. అన్ని రకాల ఎన్నికల్లోనూ పని చేస్తుంది. ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు టీం చాలా పకడ్బందీగా ఈ పోల్ మేనేజ్‌మెంట్‌ను ఉపయోగించుకుంది. ఎప్పుడు ‘మా’ ఎన్నికలు జరిగినా ఓటింగ్‌కే రాని వారిని.. అసలు ‘మా’ సభ్యులమా అన్న విషయాన్ని మర్చిపోయిన వారిని కూడా ఓటింగ్‌కు తీసుకు రాగలిగారు. ఇందులో ఖర్చు గురించి ఆలోచించలేదు.  నరేష్ అధ్యక్షుడిగా ఎన్నికయినప్పుడు పోలైన ఓట్ల కంటే కనీసం రెండు వందల ఓట్లు ఈ సారి ఎక్కువ పోలయ్యాయి. ఈ రెండు వందల ఓట్లే ఫలితాలను తేల్చేశాయి. ఇవన్నీ మంచు ఫ్యామిలీ తమ పరిచయాలతో ఓటింగ్‌కు దూరంగా ఉన్న వారిని తీసుకొచ్చినవే. చివరికి జయప్రద, జెనిలియా లాంటి వారిని కూడా ఓటింగ్‌కు తీసుకు రాగలిగారు. అందు కోసం వారు ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేశారా.. స్టార్ హోటళ్లలో విడిది ఏర్పాటు చేశారా అన్నది తర్వాతి విషయం. కానీ వారి పోల్ మేనేజ్ మెంట్ మాత్రం పక్కాగా పని చేసింది.


Also Read : మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా.. తెలుగోడిగా పుట్టకపోవడం నా తప్పు కాదు!


పరోక్ష రాజకీయాల్లోనే ఇప్పటి వరకూ మంచు ఫ్యామిలీ ! 


మంచు ఫ్యామిలీ ఇంత వరకూ ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. మోహన్ బాబు తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆరేళ్ల పాటు ఉన్నారు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. అలాంటి చూపించలేదు. కానీ మంచు మోహన్ బాబు ఎప్పుడూ రాజకీయాల్లో ఉన్నట్లే ఉంటారు. గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ ప్రచారం చేశారు. గతంలో ఆయన కుమార్తె మంచు లక్ష్మి తిరుపతి నుంచి పోటీ చేయడానికి ఓ ప్రధాన రాజకీయ పార్టీ తరపున అవకాశం కోసం ప్రయత్నించారన్న ప్రచారం జరిగింది. కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో  నేరుగా పోటీ చేస్తే పోల్ మేనేజ్‌మెంట్ పక్కాగా చేయగలమన్న ఓ నమ్మకానికి ఇప్పుడా కుటుంబం వచ్చి ఉంటుంది. ఈ ఉత్సాహంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూకినా ఆశ్చర్యపోయేదేమీ ఉండవకపోవచ్చు.


Also Read: ‘మా’లో మంచు తుఫాన్.. విష్ణు విజయానికి కారణాలివే.. ప్రకాష్ రాజ్ ఆ మాట అనకపోయి ఉంటే..


మంచు ఫ్యామిలీ ముందు  వైఎస్ఆర్ కాంగ్రెస్ , బీజేపీ ఆప్షన్లు ! 


మంచు మోహన్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అధికారికంగా అయితే ఇదే నిజం. అయితే ఇటీవల ఓ ఇంటర్యూలో మాట్లాడిన ఆయన తాను రాజకీయాలకు 99 శాతం దూరం అని ప్రకటించారు. కానీ ఒక్క శాతం ఆప్షన్ ఉంచుకున్నారు. ఆ ఒక్క శాతం ఎందుకు అంటే అంటే ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన ఇంటికి ఎప్పుడైనా రావొచ్చనిఆఫర్ ఇచ్చారు. తన ఇంటికి అంటే ఇక్కడ బీజేపీకి అని అనుకోవాలి. ఈ ఏడాది జనవరిలో మంచు మోహన్ బాబు కుటుంబంతో సహా వెళ్లి నరేంద్రమోడీతో సమావేశం అయ్యారు. అప్పుడు ఆయన బీజేపీలోకి రావాలని ఆహ్వానించారన్న ప్రచారం ఉంది. మోహన్ బాబు ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కానీ..  ఇటీవల ఓ ఇంటర్యూలో మాట్లాడినదాన్ని బట్టి చూస్తే..  రాజకీయాల్లోకి మళ్లీ వెళ్తే అది బీజేపీలోకే అన్నట్లుగా అభిప్రాయం ఉంది.


Also Read: విష్ణు విజయంపై మంచు లక్ష్మి, మనోజ్ ఏమన్నారంటే.. 


ఇప్పుడు మోహన్ బాబు ఫ్యామిలీ సీరియస్‌గా రాజకీయాల గురించి ఆలోచించే అవకాశం !
 
మోహన్ బాబు కుటుంబంలో అందరూ సామాజిక స్పృహతో ఉండేవాళ్లే. ఆ రకంగా సమాజం విషయంలో స్పందించే వాళ్లే. మంచు మనోజ్ కూడా తరచూ ప్రజా సమస్యలపై స్పందిస్తూంటారు. మంచు లక్ష్మి అంతే. ఇప్పుడు విష్ణు ప్రత్యక్షంగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ క్రమంలో మంచు కుటుంబ ఇక సీరియస్‌గా రాజకీయాలపై దృష్టి సారించే అవకాశం ఉంది.  వారి రాజకీయ ప్రస్థానానికి "మా" ఎన్నికలు మొదటి మెట్టు అనుకోవచ్చు. 


Also Read: మంచు Vs మోనార్క్.. వీరి ప్యానళ్లలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి