మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు వారబ్బాయి విష్ణు అనుకున్నది సాధించారు. ప్రకాష్ రాజ్‌పై 107 ఓట్ల భారీ ఆధిక్యంతో విష్ణు గెలుపొందారు. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు జరిగే ఎన్నికల్లో సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 925 మంది సభ్యుల్లో కొందరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. సాయంత్రం విడుదల చేసిన ఎన్నికల ఫలితాల్లో.. విష్ణుకు క్లియర్ మెజారిటీ లభించింది. దీంతో ప్రకాష్‌ రాజ్‌కు పరాజయం తప్పలేదు. అయితే, మొదట్లో ప్రకాష్ రాజ్ వైపు వీచిన గాలి.. అకాస్మాత్తుగా మంచు విష్ణు వైపు ఎలా తిరిగిందో తెలియాలంటే.. మొదటి నుంచి జరిగిన పరిణామాల గురించి తప్పకుండా తెలుసుకోవల్సిందే.  


కలిసిరాని చిరు మద్దతు: ‘మా’ చరిత్రలో చిరంజీవి కుటుంబం మద్దతు ఉండే అభ్యర్థులు ఎన్నడూ పరాయం చవిచూడలేదు. కానీ, తొలిసారిగా ప్రకాష్ రాజ్ విషయంలో అంచనాలు తలకిందులయ్యాయి. ఇందుకు ప్రకాష్ రాజ్ స్వయంకృతాపరాదం కూడా తొడైంది. మెగా కుటుంబం మద్దతు ప్రకాష్ రాజ్‌కే అని చెప్పినప్పుడు అంతా ప్రకాష్ రాజ్ విజయం నల్లేరుపై నడక అనుకున్నారు. విష్ణు కూడా మొదట్లో ‘మా’ భవనం అంశం తప్పా.. మరే హామీ ఇవ్వలేదు. అయితే, ఎన్నికల తేదీ ప్రకటన రోజు నుంచి విష్ణు జోరు పెంచాడు. అతడికి ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ కూడా తోడయ్యాడు. దీంతో విష్ణు పాచికలు వేయడం మొదలుపెట్టాడు. 


పెద్దలే ముంచేశారా?: ఒక పక్క ప్రకాష్ రాజ్‌ను ‘నాన్-లోకల్’ అని విమర్శిస్తూనే మరో పక్క ఇండస్ట్రీ పెద్దల ఆశీర్వాదాలను పొందేందుకు విష్ణు ప్రయత్నించారు. ముఖ్యంగా పోస్టల్ ఓటర్లతోపాటు.. ఏపీ, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న సభ్యులను సైతం సంప్రదించి పోలింగ్ రోజున హైదరాబాద్‌కు రప్పించుకోలిగారు. అయితే, ప్రకాష్ రాజ్ తనకు ఎవరి మద్దతు అక్కర్లేదని, పెద్దల సాయం అస్సలు వద్దని స్టేట్‌మెంట్ ఇవ్వడంతో.. సమీకరణాలు మారిపోయాయి. ఆ మాట అనకపోయి ఉంటే.. ఫలితాలు వేరేగే ఉండేవేమో అనే అభిప్రాయం వినిపిస్తోంది. పైగా ప్రకాష్ రాజ్ ‘మా’ సభ్యులకు ఏం చేస్తామనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయలేదు. కనీసం మేనిఫేస్టో కూడా విడుదల చేయలేదు. కేవలం తనని తాను డిఫెండ్ చేసుకోడానికే ప్రయత్నించారు. హామీలతో ఆకట్టుకొనే ప్రయత్నం మాత్రం చేయలేకపోయారు. దీనివల్ల ‘మా’ సభ్యులు ఆలోచనలో పడ్డారు. పైగా ప్రకాష్ రాజ్ సిద్ధాంతాలు రాజకీయాలకు సరిపోతాయేమో గానీ.. ‘మా’లాంటి చిన్న అసోసియేషన్‌కు సరిపోవానే భావన కూడా ఏర్పడింది. 


లోపల ఒకటి బయట ఇంకొకటి: కళాకారుడికి లోకల్, నాన్-లోకల్ అనే బేధాలు లేవని బయటకు అంతా చెబుతున్నారు. కానీ, చాలామంది మనసులో మాత్రం ప్రకాష్ రాజ్‌ను బయటవాడనే భావనే ఉంది. సినిమాల్లో నటన వరకు ఓకే.. కానీ, పాలన బాధ్యతలు ఆయనకు ఇవ్వడం ఎందుకని అనుకున్నారు. దీంతో ప్రకాష్ రాజ్ విజయావకాశాలు సన్నగిల్లాయి. దీంతో అతడి ప్యానల్ బలంగా.. అధ్యక్షుడు మాత్రం బలహీనంగా మారిపోయాడు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో కూడా మంచు అండ్ కో.. ఓటేయడానికి వచ్చిన సభ్యులను అప్యాయంగా పలకరిస్తూ.. తన వైపు తిప్పుకొనే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొందరు ప్రకాష్ రాజ్ వైపుకే మొగ్గు చూపారు. 107 ఓట్ల తేడాతో మంచు విష్ణు గెలిచాడు. ప్రకాష్ రాజ్‌కు 274 ఓట్లు పోల్ కాగా, విష్ణుకు 381 ఓట్లు పడ్డాయి. అంటే.. ఓటింగ్ సరళి పెరగడం విష్ణుకు బాగా కలిసొచ్చింది.


 Also Read: హేమ కొరుకుడు.. హాస్పిటల్‌లో శివ బాలాజీ.. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ 


కలిసొచ్చిన మేనిపేస్టో: ప్రకాష్ రాజ్ పోటీ చేస్తానని చెప్పిన తర్వాత ‘లోకల్-నాన్ లోకల్’ వివాదం మాత్రమే ఉండేది. కానీ, ఆ తర్వాత వ్యక్తిగత దూషణలు.. పరుష పదజాలాలతో పోటీ వాడీ వేడిగా మారింది. వీరి మాటల యుద్ధం.. కోటలు దాటి మీడియాకు ఎక్కింది. దీంతో ప్రకాష్ రాజ్.. మంచుకు సవాళ్లు విసరడం.. మంచు ఎదురుదాడి చేయడంతో ‘మా’ ఎన్నికలు రోత పుట్టించేలా తయారయ్యాయి. కొన్ని టీవీ చానెళ్లు కూడా వారిని స్టూడియోలకు పిలిచి అతి చేయడంతో ‘మా’ పరువు మొత్తం రచ్చకెక్కింది. పైగా ప్రకాష్ రాజ్ ‘మా’ పెద్దలతో తనకు సంబంధం లేదని, వారి మద్దతు పొందితే.. అధ్యక్షుడైన తర్వాత వారి వద్ద కూర్చోవాలనే వ్యాఖ్యలు కొందరికి రుచించలేదు. దీంతో ఈ అంశం విష్ణుకు బాగా కలిసొచ్చింది. విష్ణు టాలీవుడ్ సినిమా పెద్దలను కలుస్తూ.. వారి మద్దతును సంపాదించే ప్రయత్నం చేశారు. పోస్టల్ బ్యాలెట్‌ను సైతం విష్ణు తెలివిగా తనవైపు తిప్పుకున్నారు. అయితే, ఇందులో ఎన్ని ఓట్లు వచ్చాయనేది తెలియాల్సి ఉంది. అలాగే మేనిఫేస్టో ప్రకటించే రోజు కూడా విష్ణు.. ప్రకాష్ రాజ్ మీద ఎలాంటి ఆరోపణలు చేయకుండా కూల్‌గా స్పందించారు. తాను ఇవ్వాలనుకున్న హామీలను స్పష్టంగా వివరించి ‘మా’ సభ్యులను ఆకట్టుకోవడంలో విష్ణు సఫలమయ్యారని ఫలితం బట్టి తెలుస్తోంది.


 Also Read: ‘మా’ ఎన్నికల్లో రికార్డ్.. గతం కంటే పెరిగిన ఓటింగ్ 


మోహన్ బాబు పెత్తనం..: టాలీవుడ్ పెద్దల సూచన మేరకే విష్ణు.. ప్రెస్ మీట్‌లో ప్రకాష్ రాజ్, నాగబాబులపై విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వలేదని తెలుస్తోంది. ఒక వేళ వారిని విమర్శిస్తే మీడియా ఆ వ్యాఖ్యలకే ప్రాధాన్యమిచ్చి.. అసలు విషయాన్ని పక్కన పెట్టేస్తుందని సూచించడంతో విష్ణు ఆచీతూచి మాట్లాడారనిపిస్తోంది. తన ప్యానల్ సభ్యులను కూడా ఆయన.. మీడియాలో మాట్లాడవద్దని చెప్పినట్లు తెలిసింది. ఈ వ్యూహంతో.. మంచు చాపకింద నీరులా ఓటర్లను ఆకట్టుకున్నాడు. ఇందులో మోహన్ బాబు పాత్ర కూడా చాలా ఉంది. ఆయన కూడా కొంతమంది పెద్దలను కలవడం, ఫోన్లు చేసి మరీ మా అబ్బాయిని గెలిపించండని కోరడంతో కొందరు స్వచ్ఛంగా ఓటేయడానికి వచ్చారు. అయితే, ఆయన పెత్తనం పోలింగ్ రోజు కూడా కొనసాగింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులతో దురుసుగా ప్రవర్తించడం, ఓటేయడానికి వచ్చిన సభ్యులను అభ్యర్థించడం వంటివి చాలానే చేశారు. ఇది కూడా ఒక రకంగా విష్ణుకు కలిసి వచ్చింది. మంచు విష్ణు పోలింగ్ ఆరంభం నుంచి ఉత్సాహంగానే ఉన్నారు. సభ్యులను ఆకట్టుకోడానికే ప్రయత్నించారు. ప్రకాష్ రాజ్‌లో మాత్రం తెలియని ఆందోళన కనిపించింది. విష్ణు సభ్యులు చేసిన గందరగోళాన్ని అడ్డుకోడానికే ఆయన సమయమంతా సరిపోయింది. ఫలితంగా సభ్యులంతా మంచు చేతికే ‘మా’ను అప్పగించారు. 


Also Read: ‘మా’ ఎన్నికలు.. మోహన్ బాబు కాళ్లు మొక్కబోయిన ప్రకాష్ రాజ్, విష్ణుకు హగ్!


Also Read: మోనార్క్ Vs మంచు: ‘మా’ పోరుపై ఉత్కంఠ.. విజయావకాశాలు అతడికే ఎక్కువట!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి