గుంటూరు జిల్లా నర్సరావుపేటలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన కోట అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేష్ వెళ్లాలని నిర్ణయించుకోవడం రాజకీయ ఉద్రిక్తతలకు కారణం అవుతోంది. ఇప్పటి వరకూ కర్నూలు సహా పలు చోట్ల లోకేష్ పర్యటించి ప్రేమోన్మాదుల చేతులలో హత్యకు గురైన వారి కుటుంబాలను పరామర్శించారు. అయితే నర్సరావుపేట పర్యటనకు వెళ్తున్నారనే సరికి వివాదాలు ప్రారంభమయ్యాయి. రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకుంటామని ప్రకటనలు చేశారు. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నర్సరావుపేటలోచనిపోయింది కోట అనూష అయితే ఆ విషయం కూడా ఆయన మర్చిపోయినట్లుగా వేరే పేరు చెప్పారు. ఎమ్మెల్యే విమర్శలపై సోషల్ మీడియాలో లోకేష్ ఘాటుగా విరుచుకుపడ్డారు. గుర్తు చేసేందుకే తాను నర్సరావుపేట వస్తున్నానని ప్రకటించారు. [tw]





[/tw]


మరో వైపు లోకేష్ పర్యటనకు వ్యతిరేకంగా గుంటూరు ఐజీ సహా రూరల్,  అర్బన్ ఎస్పీలు ప్రెస్‌మీట్ పెట్టారు. లోకేష్ పర్యటనకు అనుమతి లేదని ప్రకటించారు. గుంటూరు జిల్లాలో జరిగిన ఆడపిల్లల హత్య కేసులో పోలీసులు వెంటనే పట్టుకుకున్నారని..  కొంతమంది మాత్రం దిశా చట్టం మీద అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. వెంటనే పోలీసులు స్పందిస్తున్నారని.. ఇప్పటికే 7రోజుల్లోగాన 1600కేసులు నమోదుచేసి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నామని గుంటూరు రేంజి ఐజీ త్రివిక్రమ వర్మ చెప్పారు. దిశా చట్టం అనేది నేటి సమాజానికి ఒక సంరక్షణ కలిగించే గోడుగులాంటిదన్నారు. దిశా చట్టం వచ్చిన తర్వాత దిశ యాప్47లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని వివరించారు.


Also Read : ఏపీలో కరెంట్ చార్జీలు ఎందుకు పెంచారు ?


గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ కొన్ని రాజకీయ పార్టీలు నరసరావుపేట లో జరిగిన ఘటనలో అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. గురువారం టీడీపీ నేత లోకేష్ పర్యటనకు అనుమతి లేదని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా పోలీసులు పనిచేస్తున్నారని చెప్పుకున్నారు. రేంజి డీఐజీ ఎస్పీలు వచ్చి ఇలా ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. లోకేష్  పర్యటన రాజకీయంగా ఉందని, అనుమతిలేని పర్యటనలకు రాజకీయ నాయకులు రావద్దని స్పష్టం చేశారు. గుంటూరు అర్బన్ ఎస్పీ రమ్య హత్య ఘటనలో అర్బన్ పోలీసులు గంటల వ్యవధిలో నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరిగిందని గుర్తు చేశారు.


Also Read : ప్రభుత్వ ఆస్తులకు వైఎస్ఆర్ సీపీ రంగులపై హైకోర్టు మళ్లీ ఆగ్రహం


పోలీసులు అనుమతి లేదని చెప్పినా లోకేష్ గురువారం  నర్సరావుపేట వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. లోకేష్ పర్యటనపై అటు వైసీపీ ఎమ్మెల్యే తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం.. ఇటు రేంజీ డీఐజీ సహా ఇద్దరు ఎస్పీలు ప్రెస్మీట్ పెట్టి అనుమతి లేదని హెచ్చరికలు జారీ చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది. గురువారం నర్సరావుపేటకు లోకేష్ బయలుదేరకుండానే హౌస్ అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. 


Also Read : సీఎం జగన్ అమలు చేయలేకపోతున్న ఐదు హామీలేంటి..?