" కరెంట్ చార్జీలను పూర్తిగా తగ్గించేస్తా " అని ప్రమాణస్వీకార వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు చేతులెత్తి ఇప్పటి వరకూ భారం మోశారని ఇక తాను భారం దించేస్తానన్న హావభావాలతో చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చార్జీలు తగ్గుతాయని అనుకున్నారు. కానీ రెండేళ్లు దాటిపోయినా చార్జీలు తగ్గకపోగా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా బిల్లులో "ట్రూ అప్" పేరుతో  కొత్త సెక్షన్ తీసుకు వచ్చి ఒక్కో యూనిట్‌కూ రూ. 1.23 పైసలు వసూలు ప్రారంభించడంతో విద్యుత్ వినియోగదారులకు షాక్ తగిలినట్లయింది. అసలు ఈ ట్రూ అప్ చార్జీలు అంటే ఏమిటి ? తగ్గిస్తామన్న చార్జీలను ప్రభుత్వం ఎందుకు పెంచుతోంది ? కరోనా కష్టాల్లో ఉన్న ప్రజలపై ప్రభుత్వం భారం వేయడం దేనికి..? 


వంద యూనిట్లకు రూ.123 చొప్పున ట్రూ అప్ చార్జీల వడ్డింపు..! 


ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల విద్యుత్ బిల్లులు అందుకున్న ప్రజలు పెరిగిన చార్జీలతో షాక్‌కు గురవుతున్నారు. గత నెలకు, ఈ నెలకు ఒకే మాదిరిగా కరెంట‌ వాడుకున్నప్పటికీ బిల్లు మాత్రం 40శాతం అధికంగా వచ్చింది. బిల్లులో ట్రూ అప్ సెక్షన్‌ను చేర్చి కొత్తగా యూనిట్‌కు రూ.1.23 పైసలు బిల్లులో చూపిస్తున్నారు. అంటే వంద యూనిట్లు వాడితే రూ. 123 అదనంగా వస్తుందన్నమాట. ఆగస్టులో వినియోగించిన విద్యుత్‌ యూనిట్‌కు రూ.1.23 ట్రూ అప్‌ చార్జీలను కూడా కలిపి బిల్లులు వస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి వరకూ ఈ ట్రూ అప్ చార్జీలను ఇదే విధంగా వసూలు చేస్తారు. గత నెల బిల్లు, ఈ నెల బిల్లు మధ్య తేడా చూపిస్తూ వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తూర్పు ప్రాంత విద్యుత్‌ సంస్థ పరిధిలోని ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల వినియోగదారులపై మాత్రం ఈ చార్జి  యూనిట్‌కు 45 పైసల భారమే పడుతోంది.


Also Read : వేల్ఫేవర్ .. మరో అగ్రిగోల్డ్ తరహా మోసమా?



ట్రూ అప్ చార్జీలు ఎందుకంటే..? 


విద్యుత్‌ సంస్థలు చేసే ఖర్చు అంటే సిబ్బంది జీతాలు, పంపిణీ నష్టాలు, బొగ్గు కొనుగోలు  ఇతర అవసరాలకు చేసే ఖర్చును ఏపీఈఆర్‌సీ ఆమోదిస్తుంది. ఈ ఖర్చును అనుసరించి విద్యుత్ చార్జీలు నిర్ణయిస్తారు. ఏపీఈఆర్‌సీ ఆమోదించిన అంచనాలకు మించి విద్యుత్ సంస్థకు ఖర్చు చేయాల్సి వస్తే .. ఆ అదనపు వ్యయాన్ని ఏటా ట్రూ అప్‌ చార్జీల పేరిట వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవచ్చు. ఎంతో ఎక్కువ ఖర్చయ్యాయని చెబుతున్న విద్యుత్ సంస్థలు ట్రూ అప్‌  చార్జీల కింద 8 నెలల్లో రూ.3,660 కోట్లు వినియోగదారుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ నెల నుంచే వసూలు ప్రారంభించారు.


Also Read : ఏపీ గెజిట్ వెబ్‌సైట్‌లో జీవోలు



గత ప్రభుత్వాలు ఈ ట్రూ అప్ చార్జీలను ఎందుకు వేయలేదు ? 


విద్యుత్ సంస్థలు అదనపు ఖర్చులపై ప్రతి ఏడాది విద్యుత్ నియంత్రణ సంస్థకు నివేదిక సమర్పించి ట్రూ అప్ చార్జీల వసూలుకు అనుమతి కోరుతాయి. గత ప్రభుత్వం ఈ ట్రూ అప్‌ నివేదికలను ఈఆర్‌సీ వద్ద దాఖలు చేయవద్దని ప్రజలపై భారం వద్దని... విద్యుత్‌ సంస్థలకు ఏవైనా అదనపు ఖర్చులు వస్తే ప్రభుత్వపరంగా భరించాలని విధానపరమైన నిర్ణయం తీసుకుంది.  ఈ కారణంగా విద్యుత్‌ సంస్థలు అప్పట్లో ఈ నివేదికలు దాఖలు చేయలేదు. అందుకే గత ప్రభుత్వాల హయాంలో ఈ చార్జీలు వేయలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక సమస్యల్లో ఉంది. అదనంగా విద్యుత్ సంస్థలకు సాయం చేసే పరిస్థితిలో లేకపోవడంతో ఆ ట్రూ అప్ చార్జీలను ప్రజల నుంచే వసూలు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.


Also Read : ఏపీలో వినాయకచవితి ఆంక్షలపై రగడ



గత ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం వల్లే పెంచాల్సి వచ్చిందన్న ప్రభుత్వం..! 


 2014 నుంచి 2019 వరకూ ట్రూ అప్‌ నివేదికలు దాఖలు చేయవద్దని  నిర్ణయం తీసుకున్న అప్పటి ప్రభుత్వం  ట్రూ అప్‌ సర్దుబాటు కోసం నిధులేవీ ఇవ్వలేదని ప్రస్తుత ప్రభుత్వం చెబుతోంది. అందుకే  విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాయని అది రాష్ట్రానికి, వినియోగదారులకు మంచిది కాదన్న ఉద్దేశంతో సర్దుబాటు చార్జీల వసూలుకు నిర్ణయించామని తెలిపింది.  టీడీపీ హయాంలో ఐదేళ్లలో విద్యుత్ సంస్థల బకాయిలు  రూ.32 వేల కోట్లకు చేరాయని ప్రభుత్వం ప్రకటించింది.