ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉత్తర్వులు ( జీవోలు )ను ప్రజలకు అందుబాటులో ఉంచడం ప్రారంభించింది. ఏపీ ఈ-గెజిట్ వెబ్ సైట్ ద్వారా జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచడం ప్రారంభించారు. https://apegazette.cgg.gov.in/login.do వెబ్‌సైట్‌లో 7వ తేదీన అంటే మంగళవారం రోజున నాలుగు జీవోలను అందుబాటులో ఉంచారు. అంతకు ముందు రోజు మూడు జీవోలను ఉంచారు. ప్రజలకు సమాచారం ఇవ్వాల్సిన ఉత్తర్వులను ఏపీ ఈ-గెజిట్ ద్వారా  ప్రభుత్వ ఉత్తర్వులను తిరిగి జారీ చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. జీవో ఐఆర్ వెబ్‌సైట్‌ను నిలిపి వేసినందున సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలుగకుండా ఏపీ ఈ-గెజిట్‌లో ఉత్తర్వులను ఉంచనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలకు అవసరం లేని సమాచారాన్ని ఏపీ ఈ-గెజిట్‌లో ఉంచరు.Also Read : జీవోలపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ఏపీ సర్కార్‌కు ఇబ్బందేనా..?



ప్రభుత్వ నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయన్న కారణంగా ఆగస్టు 16వ తేదీన ఏపీ ప్రభుత్వం జీవోలన్నింటినీ రహస్యంగా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. జీవోలు ఏవీ పబ్లిక్ డొమైన్‌లో పెట్టవద్దని సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి ముత్యాలరాజు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మాన్యువల్ పద్దతిలో జీవోల రిజిస్టర్ నిర్వహించాలని ఆదేశించారు. ఆ ప్రకారం అప్పటి నుండి ప్రభుత్వం నిర్వహిస్తున్న జీవోఐఆర్ వెబ్‌సైట్‌లో జీవోలు అప్ లోడింగ్ నిలిపివేశారు. ప్రభుత్వ నిర్ణయంపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ నిర్ణయం చట్ట విరుద్ధమనే అభిప్రాయాలు వినిపించాయి. Also Read : ఏపీ ప్రభుత్వం రహస్య పాలన చేస్తోందా..?



జీవోలను రహస్యంగా ఉంచాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. వాటిపై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం జీవోలను వెబ్‌సైట్లో ఉంచకూడదని నిర్ణయించడం  సమాచార హక్కు చట్టం సెక్షన్‌ 4(1)(బి) కి విరుద్ధమని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  జీవోలను రహస్యంగా ఉంచేందుకు అధికారులకు అనుమతిస్తే.. పరిపాలన వ్యవహారమంతా చీకటిమయం అవుతుందని వెంటనే  ప్రభుత్వ నిర్ణయాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించి.. జీవోలన్నింటినీ వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేసేలా  ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. వాటిపై ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయగానే విచారణ జరిగే అవకాశం ఉంది. Also Read : ఏపీలో బ్లాంక్ జీవోలు వివాదాస్పదం ఎందుకయ్యాయి..?



దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా ఆఫ్ లైన్ జీవోల విధానం లేదు. పలు చోట్ల న్యాయస్థానాలు కూడా ప్రభుత్వ నిర్ణయాలన్నీ ప్రజలకు తెలియాలని ఉత్తర్వులన్నీ బహిరంగ పరచాలని ఆదేశించాయి. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం అన్నీ రహస్యంగా ఉంచాలని నిర్ణయించింది. కోర్టులో ఈ నిర్ణయం నిలబడదని న్యాయ నిపుణలు చెప్పడంతో కొన్ని జీవోలను ఈ గెజిట్ వెబ్ సైట్‌లో ఉంచడం ప్రారంభించారని.. ఇదే విషయాన్ని కోర్టుకు చెబుతారని అంటున్నారు. రోజుకు వందల కొద్దీ జీవోలను వివిధ శాఖలు విడుదల చేస్తూంటాయి. కానీ గెజిట్ వెబ్ సైట్‌లో మూడు లేదా నాలుగు మాత్రమే ఉత్తర్వులు అందుబాటులో ఉంచుతున్నారు.  ప్రజలకు అవసరం లేని వాటిని మాత్రమే రహస్యంగా ఉంచుతున్నామని హైకోర్టుకు తెలిపే అవకాశం ఉంది.