సీజనల్‌ వ్యాధులైన డెంగీ, మలేరియాతో పాటు విష జ్వరాలతో బాధపడుతున్న వారికి ఆరోగ్యశ్రీలో వైద్యం అందించనున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. విశాఖ జిల్లాలో సీజనల్ వ్యాధులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని వైద్యాధికారులు, వైద్యులతో ఆయన సమావేశమయ్యారు. వర్షాల నేపథ్యంలో సీజనల్‌ వ్యాధుల కట్టడికి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఏ ప్రాంతంలో విషజ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నాయో అక్కడ ప్రత్యేకంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు.


సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని.. తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆళ్ల నాని ప్రజలకు సూచించారు. నీటి నిల్వలున్న ప్రాంతాలు, దోమల లార్వా ఉన్న ప్రాంతాల్లో నిత్యం శానిటైజేషన్‌ చేయడంతో పాటు వైద్య శిబిరాలు నిర్వహించేలా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు మంత్రి చెప్పారు. ఐటీడీఏ పరిధిలోని పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో వైద్యులు, వైద్య పరికరాలు, పరీక్షలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 


హాట్‌ స్పాట్‌ ప్రాంతాలను గుర్తించండి..
విష జ్వరాలు, డెంగీ, మలేరియాతో పాటు సీజనల్‌ వ్యాధులు తీవ్రంగా ప్రబలుతున్న ప్రాంతాలను ‘హాట్‌ స్పాట్‌’ ప్రాంతాలుగా గుర్తించాలని మంత్రి తెలిపారు. ఈ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలతో పాటు అర్బన్‌ ప్రాంతాల్లో నిరంతరంగా ఫాగింగ్, స్ప్రే చేయిస్తున్నామని పేర్కొన్నారు. ఏజెన్సీలో దోమ తెరలు పంపిణీ ప్రక్రియను వేగిరం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటున్నా.. కొన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపాలతో సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు.


అత్యధిక కేసులు విశాఖ జిల్లాలోనే..
రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మలేరియా, డెంగీ కేసుల్లో అత్యధికం.. విశాఖ జిల్లాలోనే ఉన్నాయని మంత్రి తెలిపారు. విశాఖ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 462 డెంగీ, 708 మలేరియా, 24 చికున్‌ గున్యా కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు తీవ్రమవుతోన్న నేపథ్యంలో రక్తం, ప్లేట్‌లెట్స్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిల్వలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. వైద్య శిబిరాల ఏర్పాటుతో పాటు అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.


డెంగీ నిర్ధారణ పరీక్ష చేసేందుకు ఉపయోగించే ఎలిసా కిట్‌లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటిలో తగినన్ని అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. లేని పక్షంలో రాష్ట్ర అధికారులకు సమాచారం ఇచ్చి తెప్పించుకోవాలని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి స్వచ్ఛత కార్యక్రమాలు అమలు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


Also Read: Horoscope Today : ఈ రాశులవారు ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉండాలి.. ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొచ్చే సమయం


Also Read: Gold-Silver Price Today: మగువలకు గుడ్ న్యూస్…స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇలా...