ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త వివాదం ప్రారంభమయింది. ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతోంది. ఇదంతా  "బ్లాంక్ జీవో"ల వ్యవహారం గురించి. ఇప్పటి వరకూ అందరూ కాన్ఫిడెన్షియల్ జీవోల గురించి మాత్రమే విని ఉంటారు. కానీ ఏపీ ప్రభుత్వం కొత్తగా బ్లాంక్ జీవోల పద్దతి తీసుకు వచ్చింది. గత వారం రోజుల్లో ఇలాంటి జీవోలు దాదాపుగా 50 రిలీజయ్యాయని తెలుగుదేశం పార్టీ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.


భారీగా బ్లాంక్ జీవోలు విడుదల..!


సాధారణంగా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలన్నింటినీ ప్రజలకు తెలిసేలా  జీవోలను అందుబాటులో ఉంచుతారు. ఇందు కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్ కూడా నిర్వహిస్తున్నారు. https://goir.ap.gov.in/ వెబ్‌సైట్‌లో జీవోలను అందుబాటులో ఉంచుతారు.ప్రజలు చూసుకోవచ్చు. అయితే గత వారం రోజుల్లో దాదాపుగా యాభై జీవోలను ఇలా ఈ వెబ్‌సైట్‌లో పెట్టారు కానీ.. వాటి విరవాలేమీ లేవు. ఏ డిపార్టుమెంట్ నుంచి రిలీజ్ అయ్యాయో తెలుస్తుంది. జీవో నెంబర్ కూడా ఉంటుంది. కానీ అది అసలు దేనికి సంబంధించినది..అనే వివరాలు మాత్రం ఉండవు. అసలు జీవో కాపీనే ఉండదు. గతంలో కాన్ఫిడెన్షియల్ పేరుతో కొన్ని జీవోలను రహస్యంగా ఉంచేవారు. రాజకీయంగా వివాదాస్పదం అవుతాయి అనుకున్న వాటిని అలా కాన్ఫిడెన్షియల్‌గా పెట్టి... ఆ నిర్ణయాలను అమలు చేసిన తర్వాత బహిరంగపరిచేవారు. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్షియల్ పద్దతికి మరింత వాల్యూ యాడ్ చేసినట్లుగా బ్లాంక్ జీవోల పద్దతి తీసుకు వచ్చారు. అంటే జీవో నెంబర్ మాత్రం ఉంటుందిజీవో ఉండదన్నమాట.
 
నిర్ణయాలన్నీ ప్రజల ముందు ఉంచారని కోర్టులు, కేంద్రం ఆదేశాలు..!


కాన్ఫిడెన్షియల్ జీవోల విషయంలోనే గతంలో హైకోర్టులు ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏ ప్రభుత్వమైనా.. తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజల ముందు ఉంచాలని… కోర్టులు చెబుతున్నాయి. కొన్నాళ్ల  కిందట.. కేంద్ర ప్రభుత్వం కూడా.. అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి రహస్య జీవోలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ.. రహస్యాలు ఉండకూడదని..జీవోలు పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని ఆదేశించింది. తెలంగాణలోనూ ఇలాంటి రహస్య జీవోలు భారీగా ఉండటంతో.. పేరాల శేఖర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే జీవోల విషయంలో పారదర్శకత ఉండాలని, రహస్య జీవోలు చెల్లవని వాటన్నిటిని పబ్లిక్ డొమైన్ లో ఉంచాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈ ఆదేశాలు అన్ని ప్రభుత్వాలకూ వర్తిస్తాయి. కానీ ఏపీ సర్కార్ మాత్రం… రహస్య జీవోల్లో కొత్త దారులు వెదికింది. తాజాగా బ్లాంక్ జీవోల బాట పట్టింది. 


బ్లాంక్ జీవోల పద్దతిపై గవర్నర్‌ కూడా ఆశ్చర్యపోయారన్న టీడీపీ..!


సాధారణంగా ప్రభుత్వ వ్యవహారాలన్నీ గవర్నర్ పేరు మీదుగా నడుస్తాయి. గవర్నర్ రాజ్యాంగాధిపతి. ఈ  బ్లాంక్ జీవోల వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది.  తాము చేసిన ఫిర్యాదులు...  ప్రభుత్వం తీరును  చూసి గవర్నర్ ఆశ్చర్యపోయారని టీడీపీ నేతలు ప్రకటించారు. అసలు బ్లాంక్ జీవోల మాట తానెప్పుడూ వినలేదని ఆయన అన్నట్లుగా టీడీపీ నేత వర్ల రామయ్య ప్రకటించారు. అయితే ఈ అంశంపై గవర్నర్ ..ప్రభుత్వాన్ని వివరణ కోరారో లేదో స్పష్టత లేదు. కానీ టీడీపీ మాత్రం రాజ్యాంగ పరంగా ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేయాలి కాబట్టి చేశామని.. తదుపరి న్యాయపోరాటం చేస్తామని అంటోంది. ఏపీ ప్రభుత్వం దారుణ ఉల్లంఘనలకు పాల్పడినా గవర్నర్ పట్టించుకోవడం లేదని ఇప్పటికే టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.


ప్రతిపక్షం ఆరోపణలపై స్పందించని ఏపీ ప్రభుత్వం..!


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అనేక రకాల రాజ్యాంగఉల్లంఘన ఆరోపణలు చేస్తోంది.  ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని ఉల్లంఘించి అధికంగా అప్పులు తేవడం, తప్పుడు పద్దతుల్లో కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, పీడీ ఖాతాల్లో రూ. 41వేల కోట్ల నిధులకు లెక్కలులేకపోవడం, కార్పొరేషన్ల అప్పులు ఇలా అన్ని వ్యవహారాల్లోనూ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. తాజాగా బ్లాంక్ జీవోల వ్యవహారంపై కూడా ప్రతిపక్షం విమర్శలు చేస్తోంది. అయితే ఈ బ్లాంక్ జీవోల రగడపై ప్రభుత్వం మాత్రం ఇంత వరకూ అధికారికంగా స్పందించలేదు.