ఆంధ్రప్రదేశ్‌లో వినాయకచవితి వేడుకలపై ప్రభుత్వ ఆంక్షల వివాదం ముదురుతోంది. భారతీయ జనతా పార్టీతో పాటు తెలుగుదేశం కూడా తక్షణం ఆంక్షలు సడలించాలని మండపాలు ఏర్పాటు చేసుకునే అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జులు అందరూ సీఎం జగన్‌కు లేఖ రాశారు. మరో వైపు బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిశారు. విగ్రహాల తయారీ దారులు ప్రభుత్వం తమను మోసం చేసిందని.. అధికారులు నష్టపరిచారని ఆందోళన చెందుతున్నారు.
వినాయకచవితి మండపాలు బహిరంగ ప్రదేశాల్లో వద్దని ఇళ్లలో మాత్రమే పండుగ చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించిన వ్యవహారం రాజకీయ దుమారంగా మారింది. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్‌లో జనాలు గుమికూడే రాజకీయ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టినప్పటికీ .. దేనికీ ఆంక్షలు పెట్టని ప్రభుత్వం ఒక్క వినాయక చవితికి మాత్రమే పెట్టడం ఏమిటన్న ప్రశ్న అన్ని రాజకీయ పార్టీలు వేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ తక్షణం ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు టీడీపీకి చెందిన నియోజకవర్గాల ఇంచార్జులు, ఎమ్మెల్యేలు సీఎం జగన్‌కు లేఖలు రాశారు. అందులో వినాయకచవితి ప్రాముఖ్యతను వివరిస్తూ.. కులమతాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కోవిడ్ రూల్స్ ప్రకారం పండుగ నిర్వహించుకునేలా రూల్స్ మార్చి గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని లేఖలో టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఒక వేళ ప్రభుత్వం తక్షణం రూల్స్ మార్చుకోకపోతే పండుగను బహిరంగంగానే నిర్వహిస్తామని ఏం చేస్తారో చూస్తామని ఆ పార్టీ నేత బొండా ఉమహేశ్వరరావు ప్రకటించారు.
Also Read : సెప్టెంబర్ 17న తెలంగాణలో ఏం జరుగుతుంది..?
ఇక భారతీయ జనతా పార్టీ రాజకీయ ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. రెండు రోజుల కిందట పలు చోట్ల కలెక్టరేట్లను ముట్టడించి.. ప్రభుత్వం హిందువుల్ని అవమానిస్తోందని తీవ్ర ఆరోపణలు చేసిన ఆ పార్టీ నేతలు ఇవాళ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. వినాయక చవితి వేడుకలకు ప్రభుత్వం అనుమతి నిరాకరణపై గవర్నర్‌కు బీజేపీ నేతలు వివరించారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా చవితి పందిర్లకు అనుమతులు ఇప్పించాలని గవర్నర్‌ను నేతలు కోరారు. ఈ అంశంపై తదుపరి కార్యాచరణకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. పండుగ దగ్గర పడినందున ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే బహిరంగంగానే మండపాలు బీజేపీ తరపున ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కేసులు పెడితే జైలుకైనా వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు.
Also Read : బిల్లులు చెల్లింకపోతే ఇక కేసులే..!
మరో వైపు విగ్రహాల తయారీదారుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. గతంలో అధికారులు విగ్రహాల తయారు చేసుకోవాలని అనుమతి ఇచ్చారని చివరికి పండుగ దగ్గరకు వచ్చే సరికి అమ‌్మకాలను వ్యతిరేకిస్తున్నారని లక్షలు అప్పు తెచ్చి విగ్రహాలు తయారు చేసిన తమ పరిస్థితేమిటని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆంక్షలు విధించిందన్న కారణంతో కొన్ని చోట్ల మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం చూపారు. అమ్మకాలకు పెట్టిన విగ్రహాలను తరలించే ప్రయత్నం చేశారు. గుంటూరులో మున్సిపల్ అధికారులు చెత్తబండిలో తరలించే ప్రయత్నం చేయడం వివాదాస్పదమయింది. అయితే తమ తప్పేమీలేదని ఉన్నతాధికారులు ఓ శానిటరీ ఇన్స్‌పెక్టర్‌పై వేటు వేశారు. అయితే విగ్రహ తయారీదారులు మాత్రం తాము బయటపడాలంటే... అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే ప్రభుత్వం వేడుకలకు అనుమతి ఇవ్వాల్సిందేనని అంటున్నారు.
Also Read : ఢిల్లీ టూర్‌కు హరీష్ ఎందుకెళ్లలేదు..?
అటు విపక్షాల ఆందోళనలు.. ఇటు విగ్రహతయారీ దారుల వేదనలు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయో లేదో స్పష్టత లేదు. కానీ పండుగ చేసుకోవద్దని ప్రభుత్వం చెప్పలేదని బహిరంగంగా మండపాలు మాత్రమే ఏర్పాటు చేయవద్దని సూచించామని అంటున్నారు. అయితే మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ బహిరంగ మండపాలకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. కోవిడ్ రూల్స్ పాటిస్తూ జరుపుకోవాలని అనుమతులు ఇచ్చాయి. అయినా విపక్షాలు చేస్తున్న డిమాండ్లపై స్పందించలేదు. మరో రెండురోజుల్లో పండుగ ఉన్నందున విపక్షాలు పట్టు వదలకుండా ఉద్యమాలు చేస్తున్నారు. ప్రభుత్వం వెనక్కి తగ్గి రూల్స్ మార్చకపోతే పండుగ మరింత రాజకీయం అయ్యే అవకాశం కనిపిస్తోంది. Also Read : తాత వెంకీ - రియల్ రోల్