Breaking News Live: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులపాటు వాయిదా

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 27న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 27 Sep 2021 10:45 PM
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులపాటు వాయిదా

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులపాటు వాయిదా పడ్డాయి. అక్టోబర్ 1 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. గులాబ్ తుపాను కారణంగా ఏపీతో పాటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు సభాపతి, ప్రొటెం ఛైర్మన్ సోమవారం సాయంత్రం ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారులు, ఎమ్మెల్యేలు సహాయచర్యల్లో పాల్గొనాల్సినందున నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

గులాబ్ ప్రభావంతో ఏపీలో 1.63 లక్షల ఎకరాల్లో పంట నష్టం

గులాబ్ తుపాను కారణంగా పంట నష్టంపై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ప్రాథమిక అంచనా ప్రకారం 1.63 లక్షల ఎకరాల్లో  పంటలు ముంపునకు గురయ్యాయని వెల్లడించారు. పారదర్శకంగా పంట నష్టం అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు, అధికారులు పర్యటించాలని సూచించారు.
ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో  తుపాను  ప్రభావం, పంట నష్టం ఎక్కువగా ఉందన్నారు. వ్యవసాయ సలహా మండళ్ల సభ్యులు కూడా గ్రామాల్లో పర్యటించి రైతులకు అండగా నిలవాలని మంత్రి కన్నబాబు ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా రేపు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

రాష్ట్ర వ్యాప్తంగా గులాబ్ తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రేపు(మంగళవారం) ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు అని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. 

రేపు జరగాల్సిన పరీక్షలు వాయిదా

గులాబ్ తుపాను కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో 28, 29 తేదీల్లో జరగాల్సిన ఇంజినీరింగ్, డిగ్రీ పరీక్షలను వాయిదా వేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ రెండు రోజుల్లో జరిగే పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామో తర్వాత వెల్లడిస్తామన్నారు. 

పవన్ కళ్యాణ్ కామెంట్లపై స్పందించిన పోసాని.. జగన్ కోసం మాట్లాడతానంటూ కౌంటర్

రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లపై నటుడు పోసాని కృష్ణమురళి స్పందించారు. మీడియాలో వచ్చిన విషయాలపై ప్రశ్నించే హక్కు పవన్‌కు ఉందన్నారు. అయితే సాధారణంగా పవన్ తనను తానే ప్రశ్నించుకుంటారని, దానికి జవాబులు సైతం పవన్ చెప్పుకుంటారని పోసాని పేర్కొన్నారు. సమాజం కోసం మాట్లాడతా అని పవన్ చెబుతారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తనకు అభిమానం ఉందన్నారు. జగన్ కోసం మాట్లాడతూ అని పోసాని అన్నారు. 

విశాఖ విమానాశ్రయం వద్ద వరదనీరు

గులాబ్ తుపాను తీవ్రతతో కురుస్తున్న వర్షాలతో విశాఖ విమానాశ్రయం వద్ద వరదనీరు చేరింది. విమానాశ్రయంలో దాదాపు 1 అడుగు మేర నీరు చేరింది. మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ నుంచి వరద నీటిని వదలడంతో విమానాశ్రయం ముంపునకు గురైంది. అయితే ఇప్పటికి విమానసేవలు సాధారణంగానే కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రయాణికులు రెండు గంటల ముందుగా విమానాశ్రయానికి చేరుకోవాలని సూచిస్తున్నారు. 

బొడ్డలంక వద్ద వాగు ఉద్ధృతం... నిలిచిపోయిన గర్భిణీని తరలిస్తోన్న 108 వాహనం 

తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చావడికోట పంచాయతీ బొడ్డలంక వద్ద పెళ్లిరేవు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. గర్భిణీను తరలిస్తున్న 108 వాహనం వాగు దాటేందుకు వీలులేక నిలిచిపోయింది. పాతకోట నుంచి గుర్తేడు పీహెచ్ సీకి తీసుకొస్తుండగా వాగు పొంగి 108 వాహనం నిలిచిపోయింది. సుమారు నాలుగు గంటలు వరకు గర్భిణీ వాహనంలోనే ఉండిపోయింది. స్థానిక యువకులు గర్భిణీని వాగు దాటించి, గుర్తేడు ఆసుపత్రికి తరలించారు. 


 

హైదరాబాద్ లో మరికొన్ని గంటలు భారీ వర్షాలు

గులాబ్ తుపాను బలహీనపడి వాయుగుండంగా మారిందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఛత్తీస్ గడ్, విదర్భ, తెలంగాణ సరిహద్దుల్లో తుపాను కేంద్రీకృతమై ఉన్నట్లు ప్రకటించింది.  తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ లో మరికొన్ని గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని జీహెచ్ఎంసీ తెలిపింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచించింది. 


 

మణికొండలో గల్లంతైన రజనీకాంత్‌ మృతదేహం గుర్తింపు

హైదరాబాద్‌లో కురిసిన వర్షాలకు వరద నీటిలో పడి మణికొండలో రజినీ కాంత్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గల్లంతైన సంగతి తెలిసిందే. ఆయన మృతదేహం తాజాగా లభ్యమైంది. నెక్నాంపూర్ చెరువులో మృతదేహం లభ్యం రజినీ కాంత్ మృతదేహాన్ని గుర్తించారు. ఆ చెరువులో జేసీబీ సాయంతో గుర్రపు డెక్కను తొలగిస్తుండగా మృతదేహం బయటపడింది. మణికొండ ప్రాంతంలో నాలాలో గల్లంతైన రజనీ కాంత్ కోసం విపత్తు ప్రతిస్పందక టీమ్‌లో రెండ్రోజులుగా గాలింపు చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే.

భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో సమీక్ష నిర్వహించారు. గులాబ్ తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురుస్తాయని, ఈ పరిస్థితుల్లో ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మరోసారి జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో సీఎస్‌తో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జలు కూడా పాల్గొన్నారు

ఎవరూ బయటికి రావద్దు: సీపీ

హైదరాబాద్ నగరంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న భారత వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో పోలీసు అధికారులు అప్రమత్తం అయ్యారు. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ దీనిపై అత్యవసర సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. ఎలాంటి సమస్య వచ్చినా డయల్ 100కి లేదా స్థానిక పోలీసులకు గానీ, పెట్రోలింగ్ సిబ్బందికి గానీ సమాచారం ఇవ్వాలన్నారు.

అరకులోయ గ్రామాలకు రాకపోకలు బంద్

గులాబ్ తుఫాన్ కారణంగా అరకులోయ అనంతగిరి మండలాల్లో పలు గ్రామాలకు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. వర్షానికి తోడు, భారత్ బంద్ నిర్వహించడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. అరకులోయ మండలంలో చొంపి వద్ద, బొండాం, కొత్తవలస మధ్య అరకులోయ కోడి గడ్డ వంతెనపై నుంచి వరదనీరు ప్రవాహిస్తుంది. అరకులోయ ఘాట్ రోడ్ లో పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారిలో సుమారు రెండు అడుగుల మేర వర్షపు నీరు నిలిచిపోయింది. 

విశాఖ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

గులాబ్ తుపాను ప్రభావంతో ఏపీలో అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ జిల్లా కూర్మన్నపాలెం గేట్ నుంచి కనితి బస్ స్టాప్ వరకు వాన నీటిలో మునిగిపోయింది. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కనితి బస్ స్టాప్ నుంచి కూర్మం పాలెం వెళ్లే మొత్తం వాహనాలు దారి మళ్లిస్తున్నారు. విశాఖ జనరల్ ఆస్పత్రి నుంచి అగనంపూడి వెళ్లే దారి మీదగా వాహనాలు మళ్లిస్తున్నారు. రోడ్లమీద భారీగా వరద నీరు నిలిచిపోయింది. విశాఖ గాజువాక పెదగంట్యాడ మండలం బర్మాకాలనిలో గెడ్డ ప్రమాదకరంగా మారింది. హెచ్.బి.కాలని, బర్మాకాలని, డైరికాలని, రిక్షాకాలని, రామచంద్రానగర్ నీట మునిగాయి.  అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. 

సోమశిలకు భారీ వరద.. గేట్లు ఎత్తి నీరు విడుదల.. 

భారీ వర్షాలకు సోమశిల జలాశయానికి వరదనీరు చేరుకుంది. దీంతో రెండు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలేస్తున్నారు అధికారులు. ఇటీవల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు లాంఛనంగా నీటిని కిందకు విడుదల చేయగా.. ఆ తర్వాత గేట్లు మళ్లీ మూసివేశారు. తాజాగా మరోసారి ఎగున నుంచి వస్తున్న వరదనీటితో సోమశిల నిండుకుండలా మారింది. అయితే జలాశయం పూర్తిగా నిండే వరకు అధికారులు గేట్లు ఎత్తివేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈసారి కూడా ప్రాజెక్ట్ పూర్తిగా నిండే వరకు అధికారులు వేచిచూస్తున్నారని స్థానికులు ఉంటున్నారు.  గతేడాది కూడా ఇలానే నీటిని దిగువకు వదలకపోవడంతో ఒక్కసారిగా డ్యామ్ పై ఒత్తిడి పెరిగిపోయిందని తెలిపారు.

విశాఖపట్నం: విరిగిపడ్డ కొండ చరియలు.. మహిళ మృతి

విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం వేపగుంటలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడి మహిళ మృతి చెందింది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి పెందుర్తి బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం వద్ద గోడ కూలింది. అంతేకాక, ఆ చుట్టుపక్కల విద్యుత్ వైర్లపై చెట్లు పడిపోయాయి. కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

’మా‘ ఎన్నికలు: నామినేషన్ వేసిన ప్రకాశ్ రాజ్

నటుడు ప్రకాశ్​రాజ్ మా అధ్యక్ష పదవికి నామినేషన్ వేశారు. ఉదయం 11 గంటల సమయంలో తన ప్యానల్ సభ్యులతో వచ్చి అధ్యక్ష పదవికి ఆయన నామినేషన్​దాఖలు చేశారు. సినిమా బిడ్డలం పేరుతో తన ప్యానెల్ సభ్యుల జాబితాను ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

గుర్రపు బండ్లపై అసెంబ్లీకి కాంగ్రెస్ నేతలు

రెండో రోజు కొనసాగుతున్న శాసనసభ వర్షాకాల సమావేశానికి కాంగ్రెస్ నేతలు గాంధీభవన్​నుంచి గుర్రపు బండ్లపై అసెంబ్లీకి వెళ్లారు. అనంతరం కేంద్ర విధానాలపై నిరసన తెలిపారు. దీంతో రోడ్డుపై బాగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అసెంబ్లీకి చేరుకున్న కాంగ్రెస్ నేతల గుర్రపు బండ్లను పోలీసులు గేటు లోనికి అనుమతించబోమని తేల్చిచెప్పారు. దీంతో వారు ఆందోళనకు దిగారు. గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పోలీసులు నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర విధానాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని హస్తం ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు.

విజయవాడ: గాల్లోనే చక్కర్లు కొడుతున్న విమానం

వర్షాల ప్రభావం విమానాలపైనా పడుతోంది. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో విమానాలు దిగేందుకు వాతావరణం అసలు అనుకూలించడం లేదు. దీంతో బెంగళూరు నుంచి వచ్చిన ఇండిగో విమానం గాల్లోనే చక్కర్లు కొడుతోంది. ల్యాండింగ్ కోసం విమానాశ్రయ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు.

విజయనగరం జిల్లాలో గులాబ్ తుపాను ప్రభావం ఇలా..

  • విజయనగరం జిల్లాలో గులాబ్ తుపాను కారణంగా కొనసాగుతున్న భారీ వర్షాలు

  • గజపతినగరంలో 61 మంది, తెర్లాము మండలం జి.గదబవలస నుంచి 18 మంది పునరావాస కేంద్రాలకు తరలింపు. వారికి ఆహారం, తాగునీరు సరఫరా

  • తుపాను కారణంగా సుమారు 13,122 హెక్టార్లలో పంటలు, 291 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా, 9 పశువులు మృతి

  • కొట్టుకుపోయిన 2.3 కిలో మీటర్ల మేర రోడ్లు, 1.2 కిలో మీటర్ల మేర పాడైన కాలువలు

  • పునరుద్ధరణ పనులు చేపట్టిన జిల్లా యంత్రాంగం, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ

  • నేల కూలిన చెట్లను, రాత్రికి రాత్రే తొలగించి, రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు

  • కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి, జాయింట్ కలెక్టర్లు

రెండో రోజు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ.. నేటి నుంచి ప్రశ్నోత్తరాలు

శాసనసభ, మండలి సమావేశాలు రెండో రోజు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల అనంతరం, బీఏసీ సమావేశం నిర్ణయాల నివేదికను ప్రవేశపెడతారు. గృహ నిర్మాణ మండలి సవరణ బిల్లు, కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయ సవరణ బిల్లు, పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లు, జాతీయ న్యాయ విద్య, పరిశోధన విశ్వవిద్యాలయ సవరణ బిల్లులను మంత్రులు సభ ముందు ఉంచుతారు. అనంతరం పరిశ్రమలు, ఐటీ రంగాలపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. శాసన మండలిలోనూ ప్రశ్నోత్తరాలు జరుగుతాయి.

ఇంకా దొరకని వ్యక్తి ఆచూకీ.. 34 గంటల నుంచి గాలింపు

హైదరాబాద్‌లోని మణికొండలో వరద నీటిలో గల్లంతైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గోపిశెట్టి రజనీకాంత్ ఆచూకీ ఇంకా దొరకలేదు. 34 గంటలుగా గాలింపు కొనసాగుతోంది. దీంతో రెస్క్యూ బృందాలు నగరంలోని గోల్డెన్ టెంపుల్ నుంచి నెక్నంపూర్ చెరువు వరకు గాలిస్తున్నాయి. రజినీకాంత్ ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఆయన మృతదేహం పైప్ లైన్ మధ్యలో చిక్కుకొని ఉంటుందని రెస్క్యూ బృందాలు అంచనా వేస్తున్నాయి.

జీహెచ్ఎంసీ అలర్ట్

‘గులాబ్’ తుపాను ప్రభావంతో తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అయింది. ఇవాళ, రేపు హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ హైఅలర్ట్ ప్రకటించింది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలో సోమ, మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండేలా అధికారుల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. తుపాను నేపథ్యంలో హైదరాబాద్‌లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు కంట్రోల్‌ రూమ్ 040-23202813 నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు.

Background

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 27న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.