Hydra Commissioner Ranganath Comments On Yearly Report: 'హైడ్రా' ఏర్పడి దాదాపు 5 నెలలు దాటిందని.. ఇప్పటివరకూ 200 ఎకరాల చెరువు భూములు కబ్జా నుంచి రక్షించినట్లు కమిషనర్ రంగనాథ్ (Commissioner Ranganath) తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 'హైడ్రా' (HYDRA) వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. హైడ్రా చర్యల వల్ల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు, అక్రమ నిర్మాణాలపై ప్రజల్లో అవగాహన పెరిగిందని అన్నారు. ఇకపై పబ్లిక్ ఫిర్యాదులే తమ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. '5 నెలల అనుభవాలు, వచ్చే ఏడాది రూట్ మ్యాప్ సిద్దం చేశాం. ఓఆర్ఆర్ వరకూ హైడ్రా పరిధి ఉంది. జీహెచ్ఎంసీ చట్టం కింద ప్రభుత్వం ప్రత్యేక అధికారులు ఇచ్చింది. 12 చెరువులు, 8 పార్కులను అన్యాక్రాంతం కాకుండా హైడ్రా రక్షించింది. 1,095 చెరువుల్లో వచ్చే ఏడాది ఎఫ్‌టీఎల్ నిర్దారణ చేస్తాం. సాంకేతిక పరిజ్ఞానంతో చెరువులకు సరిహద్దులు, బఫర్ జోన్లను నిర్ణయిస్తున్నాం.' అని పేర్కొన్నారు.


'త్వరలోనే ఎఫ్ఎం ఛానల్'


ఎఫ్‌టీఎల్‌ను పారదర్శకంగా చేయడం తమ బాధ్యతని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. 'ఎన్ఆర్ఎస్ఈతో సమన్వయం చేసుకుని శాటిలైట్ చిత్రాలు సేకరిస్తున్నాం. ఏరియల్ డ్రోన్ చిత్రాలు సైతం తీసుకుంటాం. శాటిలైట్ ఇమేజ్‌తో అత్యంత రెజల్యూషన్ ఉన్న డేటా తీసుకుంటున్నాం. ప్రభుత్వ భూములకు జియో ఫెన్సింగ్ చేసేందుకు చర్యలు చేపట్టాం. చెరువులకు సంబంధించి 2000 నుంచి 2024 వరకూ ఉన్న చిత్రాలు సేకరిస్తున్నాం. శాస్త్రీయమైన పద్దతుల్లోనే ఎఫ్‌టీఎల్ నిర్దారణ జరుగుతుంది. నాలాలపై కిర్లోస్కర్ కంపెనీ చేసిన స్టడీని తీసుకుంటున్నాం. ఇప్పటివరకూ హైడ్రాకు 5,800 వరకూ ఫిర్యాదులు అందాయి. అనధికారిక నిర్మాణాలకు సంబంధించి 27 పురపారక సంఘాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా ఆక్రమణలను గుర్తిస్తున్నాం. భవన నిర్మాణ వ్యర్థాల డంపింగ్‌పై కూడా దృష్టి పెట్టాం.' అని రంగనాథ్ తెలిపారు.


'వచ్చే ఏడాది నుంచి గ్రీవెన్స్ సెల్'


'హైడ్రా' అంటే కేేవలం కూల్చేందుకే అన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని.. ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు కాపాడడమే హైడ్రా ప్రధాన కర్తవ్యమని రంగనాథ్ స్పష్టం చేశారు. 'భూముల రక్షణతో పాటు వరద నివారణ చర్యలు సైతం చేపడతాం. హైడ్రాకు డాప్లర్ రాడార్ అమర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. ఇది ఉంటే కచ్చితమైన వాతావరణ అంచనాలు సేకరిస్తాం. హైడ్రా తరఫున ఒక ఎఫ్ఎం ఛానల్ త్వరలోనే పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నాం. దాని ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం తెలిపేందుకు వీలుంటుంది. హైడ్రా యాప్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. 12 చెరువుల పునరుద్దరణకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. త్వరలోనే 72 డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులోకి వస్తాయి. వెదర్ డేటా విశ్లేషించేందుకు హైడ్రాలో ఒక టీం ఏర్పాటు చేస్తున్నాం. హైడ్రా వల్ల ప్రజల్లో భూములు, ఇల్లు క్రయ విక్రయాలపై అవగాహన పెరుగుతుంది. నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై కఠినంగానే వ్యవహరిస్తాం. వచ్చే ఏడాది నుంచి ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం. ఎఫ్‌టీఎల్‌లో ఉన్న షెడ్లపై ప్రజలెవరు అద్దెకు తీసుకోవద్దు. ప్రజల ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తున్నాం.' అని పేర్కొన్నారు.


Also Read: New Year - Liquor Sales : మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సర్కార్ సన్నాహాలు