Rajasthan Child Has Been In Borewell For 6 Days: రాజస్థాన్‌లోని (Rajasthan) చేతన అనే మూడేళ్ల చిన్నారి బోరుబావిలో పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే, చిన్నారిని బయటకు తీసేందుకు గత 6 రోజులుగా అధికార యంత్రాంగం శ్రమిస్తోంది. చిన్నారి 150 అడుగుల వద్ద ఉన్నట్లు గుర్తించిన అధికారులు పైపులతో ఆక్సిజన్‌ను లోపలికి పంపిస్తున్నారు. ఈ నెల 23న ఈ ఘటన జరగ్గా.. ఇప్పటివరకూ చిన్నారిని బయటకు తీయకపోవడంపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తన కుమార్తెను రక్షించాలంటూ బాలిక తల్లి అధికార యంత్రాంగాన్ని వేడుకుంటున్నారు.
అసలేం జరిగిందంటే.?
రాజస్థాన్‌లోని కోఠ్‌పుత్లీ - బెహ్రర్ జిల్లాలో చేతన అనే చిన్నారి తండ్రి పొలంలో ఆడుకుంటూ ఈ నెల 23న (సోమవారం) 700 అడుగుల బోరుబావిలో పడిపోయింది. తొలుత పాపను రక్షించేందుకు కుటుంబసభ్యులు యత్నించగా మరింత కిందకు జారుకుంది. ఈ క్రమంలోనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీస్ సిబ్బంది పాపను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. చిన్నారి 150 అడుగుల వద్ద ఉన్నట్లు గుర్తించారు. పైపుతో ఆక్సిజన్‌ను లోపలికి పంపిస్తున్నారు. క్లిప్స్ సాయంతో చిన్నారిని 30 అడుగులు పైకి లాగినట్లు అధికారులు వెల్లడించారు. గత 6 రోజులుగా చిన్నారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
చిన్నారి పడిపోయిన బోరుబావికి సమాంతరంగా సొరంగం తవ్వడంపై దృష్టి సారించిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. తద్వారా బాలిక వద్దకు నిపుణులు చేరుకుని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందు కోసం ర్యాట్ హోల్ మైనర్స్ సాయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా చిన్నారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని స్పష్టం చేశారు.