Manmohan Singh cremated with full state honours | న్యూఢిల్లీ: నిగమ్ బోధ్ ఘాట్‌లో భారత మాజీ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, నవ భారత నిర్మాత మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్ని కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. ఆశ్రు నయనాలతో మాజీ ప్రధాని మన్మోహన్‌కు పార్టీలకతీతంగా నేతలు కడసారి వీడ్కోలు పలికారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, తదితరులు పాల్గొన్నారు.
పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ ప్రముఖులు మన్మోహన్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఢిల్లీ నిగంబోధ్ ఘాట్ వద్ద మన్మోహన్ సింగ్ అంత్యక్రియలలో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు పాల్గొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళుర్పించి తుది వీడ్కోలు పలికారు.
ఏఐసీసీ ఆఫీసు నుంచి నిగమ్ బోధ్ వరకు అంతిమయాత్ర
అంతకుముందు ఏఐసీసీ కార్యాలయం నుంచి నిగమ్ బోధ్ వరకు మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర నిర్వహించారు. అంత్యక్రియలు నిర్వహించిన నిగబ్ బోధ్ ఘాట్‌లో స్మారకం నిర్మించాలన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి తీవ్ర అస్వస్థకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్చారు. అదే రోజు రాత్రి 9.51 గంటలకు మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచారని డాక్టర్లు వెల్లడించారు. నేటి ఉదయం ఏఐసీసీ కార్యాయానికి మన్మోహన్ సింగ్ పార్థివదేహాన్ని తరలించారు. అక్కడ సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేసి మన్మోహన్ సింగ్‌కు కాంగ్రెస్ నేతలు నివాళుర్పించారు.
చక్వాల్లో జన్మించిన మన్మోహన్
పంజాబ్ (ఇప్పటి చక్వాల్ , పాకిస్తాన్) లో 1932 సెప్టెంబరు 26న జన్మించారు మన్మోహన్ సింగ్. పంజాబ్ యూన్సివర్సిటీ నుంచి 1952లో ఎకనామిక్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, 1954లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి 1957లో బ్యాచిలర్స్, 1962లో ఆక్స్‌ఫర్డ్ యూన్సివర్సిటీ నుంచి డాక్టరేట్ పూర్తి చేసిన మన్మోహన్ సింగ్ 1957-59లో ఆర్థికశాస్త్రం లెక్చరర్ గా చేశారు.
1963-65 పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రం ప్రొఫెసర్‌గా , 1969-71 కాలంలో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో, 1976 లో జేఎన్‌యూ న్యూఢిల్లీలో బాధ్యతలు చేపట్టారు.
రాజ్యసభ సభ్యుడిగా సేవలు
1991 అక్టోబరు 1 నుంచి 2019 జూన్ 14 వరకు ఐదు పర్యాయాలు అస్సాం నుంచి రాజ్యసభ సభ్యునిగా సేవలు అందించారు. 2019 ఆగస్టు 20 నుంచి 2024 ఏప్రిల్ 3 వరకు రాజస్థాన్ నుండి రాజ్యసభ సభ్యునిగా చేశారు. 1991లో ఆర్థిక శాఖ మంత్రిగా ఆర్థిక సంస్కరణలతో భారతదేశాన్ని మళ్లీ గాడిన పెట్టారు. ఆపై 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ సేవలు అందించారు.
1971-72లో ఆర్థిక సలహాదారుగా సేవలు
1972-76లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాన సలహాదారుడుగా కీలకపాత్ర.
1976-80 మధ్య కాలంలో భారత రిజర్వు బ్యాంకు డైరెక్టర్‌గా
1980 ఏప్రిల్ - 1982 సెప్టెంబరు 15 కాలంలో ప్లానింగ్ కమిషన్ సభ్యుడు- కార్యదర్శిగా సేవలు
1982 - 1985 జనవరి 14లో రిజర్వ్ బ్యాంకు గవర్నరు
1983-84లో ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుల కౌన్సిల్ సభ్యుడు
1985 జనవరి 15 నుంచి 1987 జూలై 31 వరకు ప్లానింగ్ కమిషన్ డిప్యూటి ఛైర్మన్‌గా సేవలు
1990 - 1991 మార్చి 14లో ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుడు
1991 మార్చి 15 నుంచి 1991 జూన్ 20 వరకు యూనివర్సిటి గ్రాంట్స్ కమిషన్ ఛైర్మన్