న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర ఢిల్లీలో కొనసాగుతోంది. షెడ్యూల్ ప్రకారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి మన్మోహన్ అంతిమయాత్ర ప్రారంభమైంది. నిగమ్‌బోధ్ ఘాట్ వరకు మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర చేసి, అక్కడ దివంగత ప్రధానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించిన గొప్ప వ్యక్తిగా మన్మోహన్ సింగ్ ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. కాగా, శనివారం ఉదయం మన్మోహన్ సింగ్ పార్థివదేహాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలు, సామాజికవేత్తలు ఆయనకు నివాళులర్పించారు. మన్మోహన్ పార్థివదేహం వద్ద ఆయన సతీమణి గురుశరణ్ కౌర్, ఆయన కుమార్తె, సోనియా గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు.