Indian Railways News | న్యూఢిల్లీ: ఓ వ్యక్తి రైలు కింద సెటిలై ఏకంగా 250 కిలోమీటర్లు ప్రయాణించాడని సోషల్ మీడియాలో శుక్రవారం భారీగా ప్రచారం జరిగింది. ఇటార్సీ నుంచి జబల్‌పూర్‌కు 250 కిలోమీటర్ల దూరం రైలు చక్రాల మధ్య దాక్కుని ఓ వ్యక్తి ప్రయాణించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. నిజంగా ఇలా చేయవచ్చా అని చర్చ మొదలైంది. కానీ ఆ వైరల్ స్టోరీ ప్రచారంపై భారత రైల్వే మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇందులో వాస్తవం లేదని, సోషల్ మీడియాలో, కొన్ని మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రైల్వే శాఖ కొట్టిపారేసింది. ఇలాంటివి ఎవరూ నమ్మవద్దని ప్రజలకు రైల్వే శాఖ అధికారులు సూచించారు.
రైలు కింద నుంచి బయటకు వచ్చిన వ్యక్తి
రైలు చక్రాల మధ్య, రైలు కింద కూర్చున్న వ్యక్తి బయటకు వస్తున్న ఎవరో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. టికెట్లు కొనడానికి డబ్బుల్లేక ఇలా రైలు కింద జాగ్రత్తగా కూర్చుని వందల కిలోమీటర్లు ప్రయాణించిన ఇతడు అంటూ ప్రచారంతో హోరెత్తించారు. రైల్వే బోర్డు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ దీనిపై స్పందించారు. ఇది ఫేక్ న్యూస్ అని, ఇలాంటి ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని రైల్వే అధికారులు చెప్పారు. అధికారిక సమాచారం, మంత్రుల ప్రకటన లాంటివి కాని విషయాలను అంత ఈజీగా నమ్మకూడదని.. వాస్తవం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలని సూచించారు.
కొంచెమైనా ఆలోచించాలన్న రైల్వే శాఖ
రైలు వెళ్తుంటే ఓ వ్యక్తి చక్రాల పక్కన దాక్కున్నాడు. కదులుతున్న రైలు చక్రాల మధ్య కూర్చుని ప్రయాణించాడని ప్రచారం జరుగుతోంది. ఇలాంటివి ఆచరణ సాధ్యం కాదని, అందులోనూ వందల కిలోమీటర్లు అని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. సోషల్ మీడియాలో కనిపించిన వీడియోను చూసి కొన్ని వార్త సంస్థలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఎలాంటి ధ్రువీకరణ, నిర్ధారణ లేకుండానే దుష్ప్రచారం చేశారని క్లారిటీ ఇచ్చారు.
ఇలాంటి వార్తలు చూసిన వారు నిజమో అని భావించి తాము కూడా రైలు కింద దాక్కుని ప్రయాణించాలని యత్నించే అవకాశాలు సైతం లేకపోలేదు. కనుక అధికారులు, మంత్రులు ప్రకటన చేస్తే వాస్తవాలుగా చూడాలని అధికారి సూచించారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. డబ్బుల్లేక ఇలా తాము కూడా ప్రయాణించవచ్చు అనుకుంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని రైల్వే శాఖ హెచ్చరించింది.
Also Read: Serial Killer : 18 నెలల్లో 11మంది హత్య - పురుషులనే టార్గెట్ చేసిన సీరియల్ కిల్లర్.. అసలు కథ ఇదే