Manmohan Singh funeral : న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల సమయంలో కాంగ్రెస్ పార్టీలో వివాదం చెలరేగింది. తన తండ్రి, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కాంగ్రెస్ పార్టీ సరిగ్గా గౌరవించలేదని, ఆయన విషయంలో తీరని అన్యాయం చేశారని శర్మిష్ఠా ముఖర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.
అధికారిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నేడు (శనివారం) అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్నారు. ఏఐసీసీ ఆఫీస్ నుంచి నిగమ్ బోధ్ వరకు మాజీ ప్రధాని అంతిమయాత్ర జరగనుంది. అనంతరం అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆ ప్రదేశంలోనే స్మారకం నిర్మించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కానీ తన తండ్రి విషయంలో కాంగ్రెస్ నేతలు ఉదాసీనంగా వ్యవహరించారని ప్రణబ్ ముఖర్జీ కూతురు ఆరోపించారు.
నా తండ్రిపై ఎందుకీ వివక్ష.. శర్మిష్టా మండిపాటు
మన్మోహన్ విషయంలో చూపిన శ్రద్ధ, ప్రేమ, గౌరవం తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ (Pranab Mukherjee) ఎందుకు చూపలేదని శర్మిష్ఠా ముఖర్జీ ప్రశ్నించారు. తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ చనిపోతే కనీసం సీడబ్ల్యూసీ (CWC) సమావేశం కూడా నిర్వహించకపోవడాన్ని ఆమె తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసిన ప్రణబ్ ముఖర్జీ అనంతరం దేశానికి రాష్ట్రపతిగా సేవలు చేసినా ప్రయోజనం లేకపోయిందని మండిపడ్డారు. ప్రణబ్ ముఖర్జీకి నివాళులర్పించేందుకు సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించి అధికారికంగా నివాళులు ఎందుకు అర్పించలేదని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
తప్పుదోవ పట్టించారు..
ప్రణబ్ ముఖర్జీ 2020లో మరణించారు. ఆ సమయంలో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించకపోవడంపై శర్మిష్టా ముఖర్జీ పలు విషయాలు లేవనెత్తారు. నివాళి అర్పించేందుకు సీడబ్ల్యూసీ భేటీ ఎందుకు నిర్వహించలేదని అడిగితే.. రాష్ట్రపతిగా చేసిన వారికి అలా చేయరని చెప్పి తనను తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతులకు సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించి సంతాపం తెలిసేపే ఆ సంప్రదాయం పాటించడం లేదని ఓ సీనియర్ కాంగ్రెస్ నేత తనకు చెప్పారని తెలిపారు. కానీ తన తండ్రి డైరీని చదివితే అది నిజం కాదని తెలిసిందని... గతంలో రాష్ట్రపతి కెఆర్ నారాయణన్‌కు నివాళులర్పించేందుకు సీడబ్ల్యూసీ భేటీ నిర్వహించినట్లు అందులో ఉందన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు మెమోరియల్ అనేది గొప్ప నిర్ణయం. అందుకు ఆయన అర్హులు. భారత రత్న రావాలని తన చేతుల మీదుగా ప్రదానం చేయాలని నాన్న అనుకున్నారు. కొన్ని కారణాలతో అలా జరగలేదని ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్టా ముఖర్జీ మరో ట్వీట్ చేశారు.