Train Death : అగ్నిపథ్ ఆందోళనలతో ఏ మాత్రం సంబంధం లేకపోయినా ఎంతో మంది నష్టపోతున్నారు. కొంత మంది ఆర్థికంగా నష్టపోతున్నారు.. మరికొంత మంది ప్రాణాల మీదకూ వస్తోంది. ఆందోళనల్లో పాల్గొని తూటాలకు ప్రాణాలర్పించిన వారు కాదు అసలు ఆందోళనలతో ఏ సంబంధమూ లేకపోయినా ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. అతడిని కాపాడుకునేందుకు కుటుంబసభ్యులు ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. గుండెలవిసిపోయే ఈ ఘటన విశాఖ జిల్లా కొత్త వలసలో చోటు చేసుకుంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆర్మీ ఆశావహులు సృష్టించిన విధ్వంసంతో ఏపీలోనూ అలర్ట్ అయ్యారు. సికింద్రాబాద్ స్టేషన్‌పై దాడి జరిగే అవకాశం ఉందన్న సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తయ్యారు. ప్రత్యేక బలగాల్ని ఏర్పాటు చేశారు. అదే సమయంలో రైళ్ల రైకపోకల్ని నిలిపివేశారు. ఫలితంగా ఎక్కడి రైళ్లు అక్కడ ఆగిపోయాయి. ఆ రైళ్లలో ఉన్న ప్రయాణికులది ఒక్కో కథ.. ఒక్కో వ్యథ.
రైళ్లను నిలిపివేయడంతో కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్ కొత్తవలసలో నిలిపివేశారు. అందులో ఒడిషాకు చెందిన జోగేష్ బెహరా కూడా ప్రయాణిస్తున్నారు. కుటంబసభ్యులు ఆయనకు గుండెకు చెందిన చికిత్స చేయించేందుకు విశాఖ తీసుకు వస్తున్నారు. ప్రయాణం సరిగ్గా జరిగి ఉంటే ఉదయం విశాఖలో దిగి వెంటనే ఆస్పత్రికి వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకునేవారు. కానీ ట్రైన్ కొత్త వలసలో ఆగిపోయింది. ఎంత సేపు కొత్త వలసలో ఎదురు చూసినా కదల్లేదు. మరో వైపు జోగేష్ బెహరా గుండె కొట్టుకునే వేగం పెరిగింది. ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. దీంతో ఇంకా ఎక్కువ సేపు వెయిట్ చేస్తే కష్టమని వెంటనే ఆయనను అంబులెన్స్‌లో కొత్తవలస నుంచి విశాఖ తరలించేందుకు ప్రయత్నించారు.
తెరుచుకున్న వైజాగ్ రైల్వే స్టేషన్, సర్వీసులను పునరుద్ధరించాలని రైల్వే అధికారులకు ఆదేశాలు
ఎంత ప్రయత్నించినా అంబులెన్స్ దొరకలేదు. దీంతో వెంటనే కొత్తవలసలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ప్రాథమిక చికిత్స చేస్తూండగానే బెహరా చనిపోయారు. ఎలాగైనా కుటుంబసభ్యుడ్ని కాపాడుకోవాలని వస్తున్న ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. విషాదం ఏమిటంటే ... కాసేపటికే ట్రైన్ కదిలి విశాఖ వెళ్లింది. ఇక విశాఖ వెళ్లాల్సిన అవసరం లేదని.. అప్పటి వరకూ ప్రాణాలతో ఉన్న బెహరాను.. విగతజీవిగా అంబులెన్స్‌లో తీసుకుని ఒడిషా బయలుదేరారు. అగ్నిపథ్ ఆందోళనతో జోగేష్‌కు ఆయన ఫ్యామిలీకి ఎలాంటి సంబంధంలేదు. కానీ ఆయన ప్రాణం పోవడానికి మాత్రం పరోక్షంగా అవే కారణం అయ్యాయి.