ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్గపోరులో మరో వేదికగా మారిన సత్తుపల్లిలో రాజకీయం రసవత్తరంగా మారింది. రెండు వర్గాల నడుమ నువ్వా.. నేనా అన్నట్లుగా వర్గపోరు నడుస్తోంది. ఓ వైపు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వర్గం కాగా మరోవైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గంగా ఇక్కడ గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ వర్గపోరులో ఎవరు పై చేయి సాధిస్తారనేది ఇక్కడ చర్చానీయాంశంగా మారింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆంధ్రా సరిహద్దు ప్రాంతంగా సత్తుపల్లి నియోజకవర్గం ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా ఆంధ్రా రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్లే తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన సండ్ర వెంకటవీరయ్య విజయం సాధించారు. అయితే 2018 ఎన్నికల అనంతరం సండ్ర వెంకటవీరయ్య టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎస్సీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి పోటీ చేశారు. ఈ రెండు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి వెన్నంటే ఉంటున్న డాక్టర్ మట్టా దయానంద్ 2014 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందగా.. 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ టిక్కెట్ ఆశించినప్పటికీ ఆయనకు రాలేదు. దీంతో మనస్థాపానికి గురయ్యారు. పొంగులేటికి సత్తుపల్లిలో బలమైన క్యాడర్ ఉంది. దీంతోపాటు డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు పొంగులేటి వర్గంలోకి రావడంతో ప్రస్తుతం పొంగులేటి వర్గం వర్సెస్ ఎమ్మెల్యే సండ్ర వర్గం అన్నట్లుగా సత్తుపల్లి రాజకీయాలు మారాయి. ఈ నేపథ్యంలోనే పోటాపోటీగా రెండు వర్గాలు కార్యక్రమాలు చేస్తున్నాయి.
సండ్ర సక్సెస్ అయ్యేనా..?
సత్తుపల్లి నియోజకవర్గంలో సండ్ర ఒంటరిగానే ముందుకు సాగడం, పిడమర్తి రవి సైతం ఇటీవల పొంగులేటి కార్యక్రమాలలో పాల్గొంటుండటంతో సత్తుపల్లి రాజకీయ వ్యూహంలో సండ్ర సక్సెస్ అవుతారనే చర్చ జరుగుతోంది. దీంతోపాటు గత అనేక ఏళ్లుగా సత్తుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించాలని చూస్తున్న డాక్టర్ మట్టా దయానంద్ పొంగులేటి అనుచరుడిగా టిక్కెట్ తెచ్చుకోవడంలో సక్సెస్ అవుతాడా..? అనే విషయం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. కేసీఆర్, కేటీఆర్‌లకు అత్యంత సన్నిహితుడిగా మారి, మంత్రి పదవి రేసులో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు టిక్కెట్ ఇవ్వకుండా ఉంటారా..? అన్నది కూడా చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ వర్గ పోరు కాస్తా ఎవరి గెలుపుకు సహకరిస్తుంది..? ఎవరి ఓటమికి కారణమవుతుందనే చర్చ కూడా నియోజకవర్గంలో సాగుతుంది. ఏది ఏమైనా రెండు బలమైన వర్గాలుగా సత్తుపల్లి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీలో ఉండటంతో గులాబీ అధినేత కేసీఆర్ ఎవరివైపు మొగ్గుతారు.. ఎవరిని బుజ్జగిస్తారు.. అనేది తేలాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.