అగ్నిపథ్ ఆందోళనలు-ఏపీలోనూ హై అలర్ట్


సికింద్రాబాద్ అగ్నిపథ్ ఆందోళనల సెగ ఆంధ్రప్రదేశ్‌నూ తాకింది. రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఎలాంటి అల్లర్లు 
జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు. విశాఖ రైల్వే స్టేషన్ సహా గుంటూరులోనూ భారీ బందోస్తు ఏర్పాటు చేశారు. ఈ రెండు రైల్వే స్టేషన్ల పరిధిలోని రైళ్లను నిలిపివేశారు. పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి నిఘా పెంచారు. అన్ని రైల్వే స్టేషన్లలోనూ దాదాపు ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. హై అలర్ట్ ప్రకటించి, దాడులు జరుగుతాయని సమాచారం వచ్చిన స్టేషన్ల పరిధిలో అదనపు బలగాలను మోహరించారు. విజయవాడ రైల్వే స్టేషన్‌తో పాటు బస్‌స్టాండ్‌లోనూ భద్రత పెంచారు. 


ముందస్తు అరెస్ట్‌లు, గృహ నిర్బంధాలు 


ప్రధాన కూడళ్లలో ప్రత్యేకంగా తనిఖీలు చేపడుతున్నారు. స్టేషన్‌లోని అన్ని గేట్ల వద్ద బందోబస్తు పటిష్ఠం చేశారు. విద్యార్థులు సంయమనం పాటించాలని, కాదని నిరసనలకు దిగితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఎలాంటి అల్లర్లకు పాల్పడినా కేసులు నమోదు చేయాల్సి వస్తుందని, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. అటు గుంటూరులోనూ ఆర్మీ నియామక బోర్డ్ వద్ద నిఘా పెంచారు. ఆర్మీ కార్యాలయానికి వెళ్లే మార్గాలను మూసేశారు. చలో గుంటూరు కార్యక్రమం నిర్వహిస్తారని ముందస్తు సమాచారం రావటం వల్ల వెంటనే అప్రమత్తమయ్యారు పోలీసులు. కొత్తపేట స్టేషన్‌కు ఆందోళనకారులు వస్తారన్న సమాచారం రావటం వల్ల ముందస్తుగానే పలువురు ఆర్మీ అభ్యర్థుల్ని అరెస్ట్ చేశారు. విశాఖకు వచ్చే కొన్ని రైళ్లను దారి మళ్లించారు. స్టేషన్‌కి అరకిలోమీటర్ ముందే బారికేడ్లు ఏర్పాటు చేసి గస్తీ కాస్తున్నారు. కొందరు విద్యార్థి సంఘ నేతల్ని ముందస్తు జాగ్రత్తగా అరెస్ట్ చేశారు. ఇంకొందరిని గృహ నిర్బంధం చేశారు. 


సింహాచలం, మర్రిపాలెం, గుంటూరు లాంటి స్టేషన్లలోనూ భద్రతను పెంచారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా విశాఖ పట్నంలో కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ప్రభుత్వం, రైల్వే శాఖ అలెర్ట్ అయ్యాయి. 
వైజాగ్ సీపీ శ్రీకాంత్, వాల్తేర్ డివిజన్ DRM అనూప్ సత్పతీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నగరాల్లో ప్రశాంత వాతావరణం ఉండేలా చర్యలు చేపడుతున్నారు. 


Also Read: AP POLYCET 2022 Results: ఏపీ పాలిసెట్ 2022 ఫలితాలు విడుదల, రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Also Read: Alert In Vizag: సికింద్రాబాద్ ఘటనతో వైజాగ్‌లో హై అలెర్ట్