రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు మొదలయ్యాయి. విద్యార్థులు బడి బాట పట్టారు. రెండేళ్ళ తర్వాత పూర్తి స్థాయిలో పాఠశాలలు పనిచేయనున్నాయి. కరోనా వ్యాప్తి కారణంగా అస్తవ్యస్తంగా మారిన విద్యా వ్యవస్థ మళ్లీ గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో అన్ని రకాల చర్యలను ప్రభుత్వం చేపట్టింది. అయితే ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు మాత్రం ఫీజులు అడ్డగోలుగా పెంచడమే కాదు గత రెండు సంవత్సరాలలో జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో భర్తీ చేసేందుకు ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నడూలేని విధంగా ప్రతి స్కూల్లోనూ ఫీజులను భారీగా పెంచాయి పాఠశాల యాజమాన్యాలు. 
ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం.. కానీ
మరో వైపు ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంని సైతం మొదలు పెట్టి ఉచిత విద్యకి పాటుపడుతున్న ప్రభుత్వ ఆశయాల్ని గండికొట్టే విధంగా మారాయి ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు. సౌకర్యాలు లేని తరగతి గదులు, అంతగా నైపుణ్యం లేని టీచర్ లని తీసుకువచ్చి సంఖ్యాపరంగా సిబ్బందిని మాత్రం ఎక్కువ చేసి చూపిస్తున్నారు. దీంతో పాటు భారీ ఎత్తున మార్కెటింగ్ చేసి ... ఇంటింటికి తమ సిబ్బందిని పంపి క్యాంపెన్ నిర్వహించి మరీ పిల్లలను తమ స్కూల్లో చేరే విధంగా చేస్తున్నాయి ప్రైవేట్ స్కూల్స్.


భారీగా పెరిగిన స్కూల్ ఫీజులు
ఇక గతేడాది కంటే కూడా ఈ సంవత్సరం స్కూల్ ఫీజులు దాదాపు 20% శాతం పెంచారు. గత సంవత్సరంలో రెండవ తరగతి విద్యార్థికి 12 వేల రూపాయలు ఫీజు ఉంటే, ప్రస్తుతం అదే విద్యార్థికి 20 వేల రూపాయలు వరకు పెంచారు. కరోనా సమయంలో పెండింగ్ ఉన్న స్కూల్ ఫీజులను ప్రైవేట్‌ యాజమాన్యాలు తల్లిదండ్రుల నుండి ముక్కుపిండి మరీ  వసూలు చేశాయి. ఒక సాధారణ స్కూల్ లో ఏడాదికి రూ.10 వేల నుంచి మొదలుకొని హై క్లాస్ పిల్లలు చదివే వాటిలో రూ.లక్షకు పైగా ఫీజులున్నాయి. అందులోనూ రకరకాల ఫీజుల పేరుతో మళ్ళీ రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ప్రైవేట్‌ స్కూళ్లు వసూలు చేస్తున్నాయి. ఐదవ తరగతి నుండే ఐఐటీ , సివిల్స్ కోచింగ్ ల పేరుతో  నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అప్పు చేసైనా ప్రైవేట్‌ స్కూల్‌ అనేది వేళ్లూనుకోవడంతో దిగువ, మధ్య తరగతి జనం వాటివైపు మొగ్గుచూపుతున్నారు.


పారశాలల యాజమాన్యాలు ఏమంటున్నాయి..
ఇక పాఠశాల యాజమాన్యాల వైఖరి వర్షన్ మరోవిధంగా ఉంది. గత రెండేళ్ల కాలంలో తాము భారీ ఎత్తున నష్టాలను చవి చూశామని... కొన్నిసార్లయితే ఎలాంటి ఫీజులు రాకున్నా తమ సిబ్బందికి మాత్రం స్కూల్ వదిలి పోకుండా ఉండడానికి గాను జీతాలు  ఇచ్చామని, అనుకున్న స్థాయిలో  ఫీజులు వసూలు కాకపోవడంతో ఈసారికి పెంచక తప్పడం లేదని అంటున్నారు. సొంత భవనాలు ఉన్న స్కూల్స్ పరిస్థితి బాగానే ఉందని కానీ అద్దెకు లేదా లీజుకు తీసుకుని డెవలప్ చేసిన ప్రైవేట్ స్కూళ్ల పరిస్థితి దారుణంగా ఉందని వారంటున్నారు. ఏది ఏమైనా అటు కరోనా కారణంగా పెరిగిన స్కూల్ ఫీజుల భారం ఇటు తల్లిదండ్రుల మెడపై కత్తిలా వేలాడుతోంది. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా ఆ రేంజ్‌లో నాణ్యమైన విద్య అందిస్తున్నారా లేదా అనే అంశంపై విద్యా శాఖ అధికారులు ఫోకస్ చేస్తున్నారు.