Atmakur BJP Vishnu :  ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నికల్లో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు ప్రధానంగా తలపడుతున్నాయి. అధికర పార్టీగా వైఎస్ఆర్‌సీపీ పూర్తి బలగాన్ని రంగంలోకి దింపింది. పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలను ఆత్మకూరుకు తరలించింది. ఈ అంశంపై భారతీయ జనతాపార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వైఎస్ఆర్‌సీపీపై సెటైర్లు వేశారు. అధికారంలోకి వచ్చిన   36 నెలలలో ఆత్మకూరును మీరు అభివృద్ధి చేసి ఉంటే ఇప్పుడు జరగనున్న ఈ ఉప ఎన్నికల్లో ఇంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, వైసీపీ నేతలు అవసరమా? అని ప్రశ్నించారు. 


గ‌డ‌ప గ‌డ‌ప‌కు ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రి వెల్లంపల్లికి ఝ‌ల‌క్, తలలు పట్టుకున్న పోలీసులు !


వైఎస్ఆర్‌సీపీకి నిజంగా ప్రజాబలం ఉందని అనుకుంటే   అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, బిజెపి కార్యకర్తలను భయపెట్టవలసిన అవసరం ఏముంది? అని విష్ణువర్దన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. బీజేపీ అంటే భయపడుతున్నారని పోలింగ్‌లో తమ ఎజెంట్లు కూడా ఉండకుండా పోలీసుల సాయంతో కుట్ర చేస్తున్నారని విష్ణువర్దన్ రెడ్డి అంటున్నారు.   కొందరు పోలీసుల సహకారంతో ఏజెంట్లను సైతం పెట్టకూడదని బిజెపి నాయకులకు అనధికారిక ఆదేశాలు ఇచ్చారని.. ఇలా  ఇవ్వాల్సిన అవసరం వైయస్ఆర్ పార్టీ నేతలకు ఎందుకు దాపురించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 


టీఆర్ఎస్‌ ఎంపీ ఫ్లెక్సీల్లో పవన్, చిరంజీవి - కేసీఆర్ ఫోటో కూడా లేదేంటి ?


విష్ణువర్ధన్ రెడ్డి ఆత్మకూరు ఉపఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు.  నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లినా సరైన రోడ్లు, డ్రైనేజీలు లేవని విష్ణువర్దన్ రెడ్డి మండిపడ్డారు.  రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనకపోవడం, కొందరు రైతులకు కొన్న పంటకు డబ్బులు చెల్లించకపోవడం వంటి కారణాలతో రైతులూ తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు.  అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని.. పథకాలను కూడా కొంత మందికే ఇస్తున్నారని..  ప్రజలు అన్ని రకాల  సమస్యలను తమ ప్రచారంలో ప్రస్తావిస్తున్నారన్నారు. వైఎస్ఆర్‌సీపీ తిరోగమన పాలనకు ఇది నిదర్శనమని.. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు ఇంత కంటే రుజువేం కావాలని ఆయన ప్రశ్నించారు. 


ఆత్మకూరు ఉపఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే గౌతంరెడ్డి చనిపోవడంతో ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ కారణంగా టీడీపీ, జనసేన పోటీకి దూరంగా ఉన్నాయి. అయితే ఎలాంటి ఎన్నిక జరిగినా పోటీ చేసే విధానం పెట్టుకున్న బీజేపీ అభ్యర్థిని నిలిపి చురుగ్గా ప్రచారం చేస్తున్నారు. ఆత్మకూరులో బలం చాటేందుకు ప్రయత్నిస్తున్నారు.