Chiru Pavan In TRS MP Flexis : తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఇటీవల రాజ్యసభ ఎంపీగా ఎన్నికయిన వద్దిరాజు రవిచంద్ర చిరంజీవి, పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలను ఖమ్మం అంతా పెట్టించారు. ఇటీవల రాజ్య సభకు ఎంపికైనా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారదిరెడ్డిలు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా ఖమ్మం నగరానికి వస్తున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా నాయకులు స్వాగతంతోపాటు భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. దీంతో రెండు రోజులుగా టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఖమ్మం నగరాన్ని గులాబీమయంగా చేశారు. పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు, ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే వద్దిరాజు అభిమానులు మాత్రం వద్దిరాజు రవిచంద్రతోపాటు చిరంజీవి, పవన్‌కళ్యాణ్ పోటోలతో ప్రత్యేకంగా ప్లెక్సీలను ఏర్పాటు చేశారు.
కొన్ని ప్లెక్సీలలో కేవలం చిరంజీవి, పవన్‌కళ్యాణ్, వద్దిరాజు రవిచంద్ర ఫోటోలను పెట్టిన అభిమానులు కొన్ని ప్లెక్సీలలో వంగవీటి మోహనరంగ ఫోటోలను పెట్టారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వద్దిరాజు రవిచంద్ర ఎంపీగా ఎన్నిక కావడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఇలా ప్లెక్సీలను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే అందులో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన అగ్రనేతల ఫోటోలు కూడా లేవు. కేవలం సామాజిక వర్గానికి చెందిన నాయకుల ఫోటోలు ఉండటంతో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు రావాలనే ఉద్దేశ్యంతో ఈ ప్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగిందనేది వినిపిస్తుంది.
టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నాయకులు మాత్రం ఈ విషయంపై కాస్తా అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ నుంచి ఎన్నికైన నాయకుడికి వేరే పార్టీలలో ఉన్న నాయకుల ఫోటోలతో కలిపి ప్లెక్సీలు ఏర్పాటు చేయడం పట్ల ఈ విషయం ఇప్పుడు ఖమ్మం నగరంలో చర్చానీయాంశంగా మారింది. వద్దిరాజుకు తెలియకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరని కొంత మంది వాదిస్తున్నారు. ఆయన ప్రోత్సాహంతోనే ఇలా చేశారని అంటున్నారు. మొత్తానికి టీఆర్ఎస్‌లో ఇదో వివాదం అవుతోంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీలో గ్రూపు విబేదాలు అధికం అయ్యాయి. ఇప్పటి వరకు ఖమ్మం నియోజకవర్గంలో మాత్రం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ గ్రూపులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలు కొత్త గ్రూపు ఏర్పాటుకు ఆస్కారం ఇస్తుందా..? అనేది ప్రశ్నగా మారింది. ఏది ఏమైనప్పటికీ టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ స్వాగత ప్లెక్సీలలో చిరంజీవి, పవన్‌కళ్యాణ్ పెక్సీల ఏర్పాటు ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.