ఏపీలో అన్నివార్డులను వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన మునిసిపాలిటీల్లో నెల్లూరు జిల్లా వెంకటగిరి ఒకటి. అయితే ఇక్కడ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వర్గానికి వ్యతిరేకంగా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ దొంతు శారద వర్గం ఎప్పటికప్పుడు తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తాజాగా జరిగిన మున్సిపల్ సమావేశంలో మాజీ చైర్ పర్సన్, ప్రస్తుత కౌన్సిలర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దొంతు శారద సహచర కౌన్సిలర్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆమె వర్గం కౌన్సిలర్లు మీటింగ్ లో హల్ చల్ చేశారు. ప్రస్తుత చైర్ పర్సన్ నక్కా భాను ప్రియ అసలు వైసీపీయా, లేక టీడీపీయా అని ప్రశ్నించారు. టీడీపీ నుంచి వలస వచ్చిన వారికే ఎక్కువ కాంట్రాక్ట్ పనులు దొరుకుతున్నాయని మరికొందరు విరుచుకుపడ్డారు. మొత్తం మీద అందరూ అధికార పార్టీ నాయకులే అయినా కౌన్సిల్ సమావేశం మాత్రం రసాభాసగా మారడం విశేషం. 


Also Read:  సీఎం జగన్‌ను ఇక బ్రహ్మ కూడా జైలుకి పంపలేడు.. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు


వెంకటగిరి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు


వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  వెంకటగిరి మండలం వల్లివేడులో ఏపీ ప్రత్యేక పోలీసు 9వ బెటాలియన్‌లో బుధవారం స్పోర్ట్‌, గేమ్స్‌ మీట్ ను ఆయన ప్రారంభించారు. లోకల్ మాఫియాలతో పోలీసులు చేతులు కలిపారని ఆరోపించారు. నక్సలిజం, టెర్రరిజం తగ్గిందని ఇక లోకల్ మాఫియాలు పోవాల్సి ఉందన్నారు. లోకల్ మాఫియాలతో పోలీసులు చేతులు కలిపారని అలా చేయడం వల్ల సామాన్యులకు భద్రత లేకుండా పోయిందన్నారు. ఈ లోకల్ మాఫియాలు గత ప్రభుత్వంలోనే కాదు ఈ ప్రభుత్వంలో కూడా ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థను బలోపేతం చేయాలంటే కలుపు మొక్కలను తొలగించాలని ఆయన సలహా ఇచ్చారు. 


Also Read:  పాకిస్తాన్ జాతిపిత పేరుతో గుంటూరులో జిన్నా టవరా .. కూల్చేయాల్సిందే! బీజేపీ డిమాండ్‌తో కలకలం...


గతంలోనూ విమర్శలు


ఆనం రామనారాయణ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదేం మొదటి సారి కాదు. కొంత కాలంగా నేరుగా ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయనప్పటికీ పరోక్షంగా అధికారయంత్రాంగంపై విమర్శలు చేస్తున్నారు. ఓ సారి మాఫియా గ్యాంగ్‌లు, గ్యాంగ్‌స్టర్‌లకు నెల్లూరును అప్పగించేశారని విమర్శించారు.  నెల్లూరులో పని చేయాలంటేనే అధికారులు భయపడుతున్నారని, అయిదేళ్లలో నలుగురు ఎస్పీలు మారిన ఘనత నెల్లూరుకే దక్కిందంటూ ఘాటుగా విమర్శించారు. ఇసుక నుంచి క్రికెట్ బెట్టింగ్ నుంచి యధేచ్ఛగా సాగుతున్న పోలీసులు సైతం అచేతనం అయిపోయారంటూ మండిపడ్డారు. 


Also Read:  కొంప ముంచుతున్న సోము వీర్రాజు వ్యాఖ్యలు.. దేశమంతా వైరల్, కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి