మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. చిన్న చిన్న విషయాలు సైతం ప్రాణాల మీదకి తెస్తాయి. నెల్లూరు జిల్లాలో తాజాగా జరిగిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. బఠాణీ గింజ రూపంలో రెండేళ్ల చిన్నారికి మృత్యువు ముంచుకొచ్చింది. అభం శుభం తెలియని రెండేళ్ల బాలుడు తినేందుకు నోట్లో వేసుకున్న బఠాణీ గింజ గొంతులో ఇరుక్కు పోవడంతో నరకయాతన అనుభవించాడు. నిమిషాల వ్యవధిలో ఏం జరిగిందో తెలుసుకునే లోగా చిన్నారి మృతి చెందాడు. ఈ విషాద ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నెల్లూరు జిల్లాలోని అయ్యవారి పల్లి వాసులు ఏసురత్నం, నర్సమ్మలు భార్యాభర్తలు. వీరు బతుకు దెరువు కోసం జిల్లాలోని ఉదయగిరి మండలం కుర్రపల్లి బీసీ కాలనీకి వలస వెళ్లారు. నివాసం ఏర్పాటు చేసుకుని గత కొన్నేళ్లుగా ఇక్కడే జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు సంతానం ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరిలో చివరి బాబు పేరు కిరణ్. వయసు రెండేళ్లు. అందరి కంటే చిన్నవాడు కావడంతో రెండేళ్ల కిరణ్‌ను అల్లారుముద్దుగా చూసుకునే వారు. స్థానికులు సైతం బాబును ఆడిస్తూ కాలక్షేపం చేసేవారు. ఆడుతూ పాడుతూ బుడి బుడి అడుగులు వేస్తున్న బాలుడు కిరణ్‌కు బఠాణీ కనిపించింది.
Also Read: Watch: రాజు మృతిపై అనుమానాలొద్దు.. వీళ్లంతా ప్రత్యక్ష సాక్షులే.. డీజీపీ క్లారిటీ
బఠాణీ గింజను తిందామని చిన్నారి నోట్లో వేసుకున్నారు. అయితే పసివాడు కావడంతో గట్టిగా ఉన్న బఠాణీ గింజను నమలలేకపోయాడు. అలాగని నోటి నుంచి బయటకు ఉమ్మేయలేదు. ఈ క్రమంలో బఠాణీ గింజ గొంతులో ఇరుక్కు పోయింది. రానురాను ఊపిరాడని పరిస్థితి ఎదురైంది. చిన్నారి గుక్క పట్టి ఏడవటం మొదలుపెట్టాడు. మరోవైపు ఎక్కిళ్లు సైతం మొదలయ్యాయి. చిన్నారి కిరణ్ పరిస్థితి గమనించిన వెంటనే తల్లిదండ్రులు కిరణ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే చిన్నారి చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు.
Also Read: బాలుడిపై లైంగిక వేధింపులు కేసులో సంచలన తీర్పు... ఆయాకు 20 ఏళ్ల జైలు శిక్ష... నాలుగేళ్ల తర్వాత న్యాయం
డాక్టర్లు చెప్పిన మాట విన్న ఏసురత్నం, నర్సమ్మలు ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోయారు. అప్పటివరకూ ఆడుతూ తిరిగిన బాలుడు ఇక తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో కుర్రపల్లి బీసీ కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి. తల్లి నర్సమ్మ రోదన చూపరులను సైతం కంటతడి పెట్టించింది.