AP Cinema Tickets Issue: ఏపీలో గత కొన్ని నెలలుగా సినిమా టికెట్ల విక్రయంపై పలు సందేహాలు, వివాదాలు నెలకొన్నాయి. చివరికి ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయం హైకోర్టుకు వెళ్లింది. ఏపీ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఆన్‌లైన్‌ ద్వారా సినిమా టికెట్ల విక్రయంపై హైకోర్టు స్టే (AP High Court gives stay on Movie Tickets) ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సినిమా టికెట్ల కొత్త విధానం అమలు నిలిపేసిన న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేసింది. 


రాష్ట్రంలో సినిమాల టికెట్లను ప్రభుత్వమే విక్రయించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం గత ఏడాది కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు సవరణ చట్టం చేసి, ప్రభుత్వం టికెట్ల విక్రయాలపై ఉత్తర్వులు సైతం జారీ చేసింది. దీని ప్రకారం ఏపీలో సినిమా టికెట్లను రాష్ట్ర ప్రభుత్వమే ఆన్ లైన్ ద్వారా విక్రయిస్తోంది. అయితే ఆన్​లైన్లో ప్రభుత్వమే సినిమా టికెట్ల విక్రయాన్ని వ్యతిరేకిస్తూ బిగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేటు లిమిటెడ్‌, ఎగ్జిబిటర్లు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. జూలై 1న తీర్పు ఇస్తామని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అయితే నేడు తుది తీర్పు వెలువరించకుండా ప్రస్తుతానికి కొత్త విధానం ప్రకారం ఏపీ సర్కార్ టికెట్లు విక్రయించకుండా తాత్కాలికంగా స్టే విధించింది.  


జీవో 69 ఏమిటి.. వివాదం అక్కడే మొదలైందా ?
గత ఏడాది ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 69ను విడుదల చేసింది. దీని ప్రకారం.. ఏపీ ప్రభుత్వమే సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తుంది. టికెట్ల అమ్మకంపై వచ్చిన ఆదాయాన్ని ఆ తర్వాత ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్‌కు ఇచ్చే విషయంలో క్లారిటీ లేకపోవడం ఓ సమస్య. కాగా, ప్రభుత్వాలే నేరుగా సినిమా టికెట్లు విక్రయిస్తే థర్డ్ పార్టీ ఆన్‌లైన్ టికెట్ పోర్టల్స్ భవిష్యత్ ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. తమకు ఎలాగైనా న్యాయం చేయాలంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ విచారణ చేపట్టిన హైకోర్టు బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. ప్రస్తుతానికి కొత్త విధానం ద్వారా టికెట్ల విక్రయం నిలిపివేయాలని నేడు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 
Also Read: AP Govt GPF Issue : ఉద్యోగుల ఖాతాల్లో నగదు మాయంపై న్యాయపోరాటం చేస్తాం - సూర్యనారాయణ 
Also Read: Minister Gudivada Amarnath : పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం, ఆగస్టులో రూ. 500 కోట్ల ఇన్సెంటివ్ లు- మంత్రి గుడివాడ అమర్నాథ్