AP Govt GPF Issue : జీపీఎఫ్ ఖాతాలో సొమ్ము మాయమైన వ్యవ‌హ‌రంపై ఉద్యోగ సంఘాల నేత నాయ‌కులు సూర్యనారాయణ, ఆస్కార్ రావులు గురువారం సీఎస్ తో స‌మావేశం అయ్యారు. నగదు డెబిట్ పై న్యాయపోరాటం చేయాల‌ని అయితే అంత‌కు ముందు ఈ విష‌యంపై న్యాయనిపుణులతో సంప్రదింపుల తర్వాత కార్యాచరణ రూపొందిస్తామ‌ని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. సీఎస్ సమీర్‌శర్మతో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు గురువారం భేటీ అయ్యారు. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము డెబిట్ కావడంపై చర్చించారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ సాంకేతిక కారణాలతో నగదు డెబిట్ అయినట్లు అధికారులు చెప్తున్నారని, ఆ సమాధానంతో సంతృప్తి చెందలేదని సీఎస్‌కు చెప్పామన్నారు. ఉద్యోగులను చిన్న పిల్లల మాదిరిగా చూస్తున్నారని అన్నారు. 


ప్రభుత్వ వివరణ అవాస్తవం 


ఆర్థికశాఖ అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉద్యోగ సంఘాల నేతలకు అబద్ధం చెప్పారని సూర్యనారాయణ మండిపడ్డారు. నగదు డెబిట్‌పై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా అకౌంట్‌ల నుంచి డబ్బులు తీయడం నేర‌మ‌న్నారు. ప్రభుత్వం ఇచ్చిన వివరణ పూర్తిగా అవాస్తవమని తెలిపారు. డీఏ బకాయిల చెల్లింపుపై గతంలోనే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు. డీఏ బకాయిలతోనే జీతాలు పెరిగినట్లు చెప్పారని అన్నారు. అయితే దీనిపై ఉద్యోగ సంఘాలు అన్ని స‌మావేశం అయి భ‌విష్యత్ కార్యచ‌ర‌ణ రూపొందిస్తామ‌ని చెబుతున్నారు. న్యాయ నిపుణులతో సంప్రదింపుల తర్వాత కార్యాచరణను ప్రకటిస్తామని సూర్యనారాయణ వెల్లడించారు.


క‌ల‌సి రాని ఉద్యోగులు!


ఈ వ్యవ‌హ‌రంపై ఉద్యోగుల్లో కూడా కొంత వ‌ర‌కు విభేదాలు ఉన్నాయ‌నే ప్రచారం జ‌రుగుతుంది. ఇటీవల భారీ ఉద్యమం చేసిన రోజు ఉద్యోగుల్లో కూడ విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. రాజ‌కీయ పార్టీల వారీగా ఉద్యోగులు విడిపోయార‌ని అంటున్నారు. ఇప్పుడు జీపీఎఫ్ ఖాతాలో సొమ్ము మాయంపై కూడా ఉద్యోగుల్లో ఇదే ప‌రిస్థితి ఉంద‌ని ప్రచారం జ‌రుగుతుంది. జీపీఎఫ్ సొమ్ము ఇప్పటికిప్పడు అవ‌స‌రం ఏముంద‌నే భావ‌న కూడా ఉద్యోగుల్లో ఉంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప్రభుత్వ ఆర్థిక ప‌రిస్థితులపై ఉద్యోగుల‌కు ఫుల్ క్లారిటీ ఉంది. ఇలాంటి సంద‌ర్భంలో ఉద్యోగులు ఆందోళ‌న‌లు చేసినంత మాత్రన ఉప‌యోగం ఉండ‌దు కాబ‌ట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప‌ని చేశామ‌నే భావ‌న ఎందుకు క్రియేట్ చేయాల‌నే భావ‌నను వ్యక్తం చేస్తున్నార‌ని అంటున్నారు. స‌మ‌స్యలను ప‌రిష్కరించాల‌ని విజ‌య‌వాడ బీఆర్టీఎస్ రోడ్డులో ఉద్యోగులు ఆందోళ‌న చేసిన స‌మ‌యంలో కొంద‌రు నాయ‌కులు ప్రభుత్వానికి కోవ‌ర్టులుగా మారారు. జ‌రిగే ప్రతి విష‌యాన్ని ప్రభుత్వంలోని పెద్దల‌కు తెలియచేశారు. వాట్సాప్ లో వీడియోలు, ఫొటోలు కూడా పంపి త‌మకు కావాల్సిన ప‌నులు చేయించుకున్నార‌ని చెబుతున్నారు. ఇప్పుడు సొమ్మును దారి మ‌ళ్లించిన స‌మ‌యంలో ఆ నాయ‌కులు ఎందుకు నోరు మెద‌ప‌టం లేద‌నే వాద‌న కూడా తెర మీద‌కు తెస్తున్నార‌ట‌. దీని వ‌ల‌న అస‌లు స‌మస్య ప‌క్కదారి ప‌ట్టే అవ‌కాశం ఉండ‌టంతో నాయ‌కులు సైలెంట్ అవుతున్నార‌ని చెబుతున్నారు.