BJP Leaders In TRS : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కంటే ముందే ఆ పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమితి షాక్ ఇచ్చారు. హైదరాబాద్‌కు చెందిన నలుగురు కార్పొరేటర్లు, తాండూపు మున్సిపాలిటీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లను టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. మంత్రి కేటీఆర్ స్వయంగా కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, రాజేంద్రనగర్ కార్పొరేటర్ పొడవు అర్చన ప్రకాష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డేరంగుల వెంకటేష్, అడిక్ మెట్ కార్పొరేటర్ సునిత ప్రకాష్ గౌడ్, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజ గౌడ్, కౌన్సిలర్ ఆసిఫ్ టీఆర్ఎస్ లో చేరగా కేటీఆర్ కండువా కప్పి వారిని స్వాగతించారు.
ఇటీవలే బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ఢిల్లీలో ప్రధాని మోడీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అందరు కార్పొరేటర్లు ఆ సమావేశానికి వెళ్లారు. పార్టీ మారిన నలుగురు కూడా ఆ సమావేశానికి వెళ్లారు. అయితే తిరిగి వచ్చిన తర్వాత వారు టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. టీఆర్ఎస్ ముఖ్య నేతలు వారితో సంప్రదింపులు జరిపి.. పార్టీలో చేరేలా ఒప్పించారు. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు 2, 3 తేదీల్లో జరగనున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ అగ్రనేతలంతా హైదరాబాద్ వస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు హైదరాబాద్ చేరుకున్నారు.
తెలంగాణలో విజయం సాధించడమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఇతర పార్టీల నేతల్ని ఆకర్షించి బలం పెంచుకోవాలని అనుకుంటున్నారు. ప్రధానంగా టీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న వారిపై దృష్టి కేంద్రీకరించినట్లుగా తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్ మాత్రం రివర్స్‌లో బీజేపీకి ముందుగానే షాక్ ఇచ్చింది. బీజేపీ ప్రజాప్రతినిధుల్ని చేర్చుకోవడంతో కమలనాథులు ఒక్క సారిగా ఉలిక్కి పడ్డారు.
తమతో చాలా మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని తరచూ బండి సంజయ్ ప్రకటిస్తూ ఉంటారు. ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు తమ పార్టీ ప్రజాప్రతినిధుల్ని చేర్చుకున్నందున ముందు ముందు ఈ టచ్‌లో ఉన్న ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటారేమో చూడాల్సి ఉంది.ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో అన్ని పార్టీల్లోనూ జంపింగ్‌ల హడావుడి ఎక్కువయ్యే చాన్స్ ఉందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.