రాజకీయాలు కొత్త రంగు పులుముకుంటున్నాయి. గతంలో నేతలు చేసిన మంచి పనులు చెప్పుకుని ఓట్లు అడిగేవారు. ఆ తరువాత ప్రత్యర్థి పార్టీ నేత చేసే చెడు పనులు ప్రచారం చేసి ఓటు బ్యాంక్ రాబట్టుకునేవారు. కానీ రోజురోజుకూ రాజకీయాల్లో ఓ మెట్టు దిగుతున్నట్లు కనిపిస్తున్నారు నేతలు. పరస్పరం దూషించుకుని రాజకీయ నాయకులకు, పార్టీలకు కిక్‌ లేకుండా పోయిందనుకుంటా. అందుకే ఇప్పుడు తిట్లని వినడం కన్నా చూపించడం.. దాన్ని నలుగురు చదివేలా చేస్తే బాగుంటుందనకున్నారు. ఈ ఐడియా ఎవరిదో కానీ దండం రా సామి అంటున్నారు ప్రజలు. 


రేపటి నుంచి బీజేపీ సమావేశాలు.. 
రేపటి నుంచి తెలంగాణలో బీజేపీ సమావేశాల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ నేతలు వర్సెస్ బీజేపీ నేతల వ్యాఖ్యల గురించే. తెలంగాణలో కమలం వర్సెస్‌ కారు పోరు ఇప్పుడు కొత్తరూపాన్ని అందుకుంది. జులై 2నుంచి జరగనున్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ  సమావేశాలు ఇందుకు వేదికగా మారుతున్నాయి. అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్‌ ఎలా ఉందో చూడాలంటే నగర రోడ్లపై వెలిసిన పోస్టర్లు, డిస్‌ ప్లే బోర్డులు చూస్తే చాలు. సాలు మోదీ సంపకు మోదీ అంటూ టీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు పెట్టారని బీజేపీ నేతలు ఆరోపిస్తుండగా.. సాలు దొర ఇక సెలవు దొర (#SaaluDoraSelavuDora) అంటూ బీజేపీ శ్రేణులు తమను కించపరిచేలా బహిరంగంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు పెట్టారని టీఆర్ఎస్ నేతలు విమర్శించారు.


మా గొడవ మాదే.. 
అసలే వర్షాలు.. ఈ జల్లులకు నగరం ఎలా ఉంటుందోనని జనం భయపడుతుంటే మా గొడవ మాదే అన్నట్లు అటు గులాబీ ఇటు కాషాయం కౌంట్‌ డౌన్‌ ని షురూ చేశాయి. వచ్చే ఎన్నికల్లో పీఠం మాదే అన్నలెవల్లో ధీమాతో ఉన్న కమలనాథులు.. టీఆర్‌ఎస్‌ నేతల్ని హెచ్చరిస్తూ బీజేపీ ఆఫీసు ముందు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫోటోతో కౌంట్‌ డౌన్‌ గడియారాన్ని పెట్టింది. ఈ చర్య అధికార నేతలకు కోపం తెప్పించింది. ఇంకేముంది  రెండు రోజుల టైమ్‌ ఇచ్చింది. ఈ చీప్‌ డిస్‌ ప్లే బోర్డులు తీయకపోతే మేమే పీకేస్తామని చెప్పడమే కాదు చేసి చూపించింది. అక్కడితో ఆగలేదు. కేసీఆర్‌ పాలనలో బంగారు తెలంగాణ సాధించిన అభివృద్ధిని చూపిస్తూ పోస్టర్లు వేసింది. ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు చేసిన మోసాలను ఆ పోస్టర్లలో హైలెట్‌ చేశారు. ఇంకా కోపం చల్లారని గులాబీ శ్రేణులు బైబై మోదీ అంటూ నినాదాలతో పాటు  బ్యాంకర్లు కూడా ఏర్పాటు చేశారు.


అక్కడితో ఆగలేదు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి రానున్న ప్రధాని మోదీకి  సీఎం కేసీఆర్ వెల్‌ కమ్‌ చెప్పరని కూడా  గులాబీ పార్టీ తెగేసి చెప్పేసింది. దీనికి బీజేపీ కూడా గట్టిగానే బదులిచ్చింది. మీరు పీకేస్తే మేము పెట్టుకోలేమా అంటూ డిజిటల్‌ గడియారాన్ని రెడీ చేసింది. బంగారు తెలంగాణ ఇచ్చేది తెచ్చేది బీజేపీనే ఆ కల సాకారమయ్యేది ప్రధాని మోదీ నాయకత్వంలోనే అని ఆపార్టీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు.
పార్టీల గోల ఎలా ఉన్నా నగర ప్రజలరా మీరు మాత్రం జర జాగ్రత్త. వానలు పడుతున్నాయి కదా ఈ బోర్డింగ్ లు, పోస్టర్లు నెత్తిన పడితే ప్రజల ప్రాణాల మీదకొస్తుంది. మీ ప్రాణాలకే మీరు బాధ్యులు కాబట్టి జాగ్రత్త వహించడం బెటర్.


Also Read: BJP TRS Flexi Fight : బీజేపీ-టీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీ వార్, ప్రధాని పర్యటన వేళ ముదిరిన వివాదం 


Also Read: Kondagattu Ghat Road: 65 మందిని బలిగొన్న ఘాట్ రోడ్డు, నాలుగేళ్ల తర్వాత పునఃప్రారంభం - ఏ చర్యలు తీసుకున్నారంటే