Balkampet Yellamma Temple : హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఉత్సవాలకు వైభవంగా ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. జులై 5వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అమీర్ పేట డివిజన్ లోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద అమ్మవారి కల్యాణం నిర్వహణ, ఏర్పాట్ల పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కల్యాణం సందర్భంగా అమ్మవారికి సమర్పించనున్న చీరల తయారీ పనులను ఆలయ ఆవరణలో మంత్రి ప్రారంభించారు. ఆలయం వెనుక భాగంలో భక్తుల వసతి కోసం 3.20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. జులై 5వ తేదీన అమ్మవారి కల్యాణం, 6వ తేదీన రథోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అమ్మవారి కల్యాణాన్ని ఆలయం ముందు నిర్మించిన రేకుల షెడ్డు కింద గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నిర్వహించేందుకు సర్వం సిద్దం చేస్తున్నారు.
ఆరు ఎల్ఈడీ స్క్రీన్లు
ఈ సారి అమ్మవారి కల్యాణానికి 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అమ్మవారి కల్యాణానికి వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి కల్యాణాన్ని వివిధ ప్రాంతాలలోని భక్తులు లైవ్ లో చూసేందుకు వీలుగా ఫ్రీ లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. అంతేకాకుండా ఆలయ పరిసరాలలో 6 LED స్క్రీన్ లలో అమ్మవారి కల్యాణాన్ని వీక్షించేలా సిద్ధం చేస్తున్నారు. దర్శన సమయంలో భక్తులు తోపులాటకు గురికాకుండా పటిష్టమైన బారికేడ్ లను ఏర్పాటు చేస్తున్నారు. శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించడంతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు సేవలు అందించే వాలంటీరులకు పాస్ లను జారీ చేస్తున్నారు. ఆలయానికి వచ్చే రహదారులలో అవసరమైన ప్రాంతాలలో ట్రాపిక్ మళ్లింపునకు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు.
భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు
విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా మొబైల్ ట్రాన్స్ ఫార్మర్ లను అందుబాటులో ఉంచనున్నారు. వాటర్ వర్క్స్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్ లను ఏర్పాటు చేసి వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ ను భక్తులకు అందించనున్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా నీటి సరఫరా జరిగేలా చూడాలని ఇప్పటికే వాటర్ వర్క్స్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఆలయ పరిసరాలలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించనున్నారు. భక్తుల సౌకర్యార్ధం టాయిలెట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నారు. ఆలయ పరిసరాలలో ఎలాంటి మురుగు లీకేజీలు లేకుండా చూడాలని, రహదారులకు అవసరమైన చోట్ల మరమ్మతులు చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. బల్కంపేట ఆలయానికి నిత్యం వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం, దాతల సహకారంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టింది ఆలయకమిటీ. ఆలయం పక్క రోడ్డులో నూతనంగా భారీ రేకుల షెడ్డును దాతల సహకారంతో నిర్మించనున్నారు.