Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన మలుపులు చోటు చేసుకున్నాయి. ఉదయం నుంచి సీఎంగా ఫడ్నవీస్ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆయితే గవర్నర్‌ను కలిసిన తర్వాత సీన్ మారిపోయింది. ఏక్‌నాథ్ షిండేను సీఎంగా ఫడ్నవీస్ స్వయంగా ప్రకటించారు. అయితే తాను మంత్రివర్గంలో ఉండనని ఆయన చెప్పారు. కానీ తర్వాత రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకార సమయంలో సీఎంగా షిండే ప్రమాణం చేసిన తర్వాత ఫడ్నవీస్ పేరు కూడా వినిపించారు. ఆయన వెళ్లి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు వ్యవహరించి మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.
మొదట షిండే ఒక్కరే ప్రమాణం చేస్తారని అనుకున్నారు. బీజేపీ బయట నుంచి మద్దతు ఇస్తుందని చెప్పుకున్నారు. అలా అయితే ప్రభుత్వ మనుగడ ఉండదన్న అభిప్రాయం వినిపించింది. ఎందుకంటే షిండే వర్గం అంతా సాంకేతికకంగా శివసేన ఎమ్మెల్యేలే. వారు వేరే పార్టీ పెట్టుకున్నా... ఇతర పార్టీల్లో చేరిన యాంటీ డిఫెక్షన్ లా కింద అనర్హతా వేటుకు గురవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ సపోర్ట్ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ఏక్ నాథ్ షిండే వర్గం భావించడంతో .. బీజేపీ హైకమాండ్ ఆయన కోరిక మేరకు ఫడ్నవీస్‌తో డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది.
గతంలో బీజేపీ- శివసేన ప్రభుత్వంలో ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉండే ఏక్ నాథ్ షిండే మంత్రిగా ఉండేవారు. ఇప్పుడు శివసేన చీలిక వర్గం- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో ఏక్ నాథ్ షిండే సీఎం ... ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం అయ్యారు. అదే సమయంలో ఓ సారి ముఖ్యమంత్రిగా చేసి.. మళ్లీ డిప్యూటీ సీఎం పదవి చేపట్టినవారు తక్కువే. తనకు పదవి వద్దని ఫడ్నవీస్ ప్రకటించారు. తాను ప్రభుత్వానికి దూరంగా ఉంటానన్నారు. కానీ బీజేపీ హైకమాండ్ ఆదేశంతో ఆయన తక్కువ స్థాయి పదవి చేపట్టక తప్పలేదు. అందుకే ప్రమాణస్వీకార సమయంలో ఫడ్నవీస్ అంత ఉత్సాహంగా కనిపించలేదు.
నిజానికి గత రెండున్నరేళ్లుగా మహావికాస్ ఆఘాడీపై దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో బీజేపీ పోరాడుతోంది. రాజ్యసభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోనే విజయాలు సాధించారు. ఏక్నాథ్ షిండేను కూడా తిరుగుబాటుకు మోటివేట్ చేసింది ఫడ్నవీసేనని చెబుతారు. మళ్లీ సీఎం అవ్వాలని ఆయన అనుకున్నారు.. అవుతానని అనుకున్నారు. కానీ కథ మాత్రం అడ్డం తిరిగింది.